Nishtha Dudeja Story: ధైర్యం... ఆమె మనసు మాట విన్నది..

19 Nov, 2021 01:49 IST|Sakshi

Miss Deaf Asia 2018 Winner Nishtha Dudeja: ఈ అమ్మాయికి చిన్ననాటి నుంచి వినికిడి లోపం ఉందని చెబితే ఎవ్వరైనా జాలిపడతారు. కానీ, ఈ అమ్మాయే మిస్‌ డెఫ్‌ ఆసియా 2018 టైటిల్‌ విజేత, మిస్‌ అండ్‌ మిస్టర్‌ డెఫ్‌ ఇండియా పోటీ లో ఢిల్లీ నుంచి ప్రాతినిథ్యం వహించింది.

18 సంవత్సరాల మిస్‌ అండ్‌ మిస్టర్‌ డెఫ్‌ వరల్డ్‌ పోటీల్లో భారతదేశం నుంచి టైటిల్‌ గెలుచుకున్న మొదటి ప్రతినిధి అని చెబితే ఆమె ధైర్యానికి, పట్టుదలకు ఫిదా అవకుండా ఉండరు. గ్లామర్‌ ప్రపంచంలో మోడల్‌గా రాణిస్తూ, క్రీడల్లోనూ ఎదిగిన 26 ఏళ్ల నిష్ఠా దూదెజా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న తీరు గురించి తెలుసుకోవాల్సిందే అనిపించక మానదు.

నిష్ఠా దూదెజాకు చిన్ననాటి నుంచి వినికిడి సమస్య ఉంది. ఫలితంగా మనం అడిగిన దానికి సమాధానమివ్వలేదు. ఏదైనా చెప్పాల్సి వస్తే కాగితమ్మీద రాసిస్తుంది. లేదంటే ఫోన్లో టెక్స్‌›్ట మెసేజ్‌ల ద్వారా విషయం చెప్పేస్తుంది. మనం ఓ ప్రశ్న రాసిస్తే, ఆమె దానికి రాతపూర్వకంగానే సమాధానమిస్తుంది. కానీ, ఆమే గ్లామర్‌ ప్రపంచంలో విజయవంతమైన మోడల్‌గా రాణిస్తోంది.

టెన్నిస్‌ క్రీడాకారిణి..
నిష్ఠా తన గురించి రాతపూర్వకంగా ఇచ్చిన తన మనసులోని మాటలు.. ‘12 ఏళ్ల వయసు నుంచి పదేళ్ల పాటు టెన్నిస్‌ క్రీడలో సాధన చేశాను. 2013, 2015, 2017 సంవత్సరాలలో బధిరుల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలో పాల్గొన్నాను. తీవ్రమైన దవడ కండరాల నొప్పులు రావడంతో వైద్యుల సూచన మేరకు కొన్నాళ్లు ఆ క్రీడకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అమ్మానాన్న తర్వాత టెన్నిస్‌ నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. అందుకే, పోటీలలో పాల్గొనలేకపోయినా టెన్నిస్‌ను పూర్తిగా వదులుకోలేదు. ఐదేళ్ల వయసు నుంచి జూడో ఆడటంలో సాధన చేశాను. ఏడేళ్లపాటు ఈ గేమ్‌లో రాణించాను’ అని తన గెలుపుకు వేసుకున్న బాట గురించి వివరిస్తుంది.

అందాల పోటీలో మేటి
మరిన్ని వివరాలను తెలియజేస్తూ– ‘టెన్నిస్‌ పోటీలో పాల్గొనలేనని అర్థమయ్యాక అంతకుమించి ఏదైనా చేయాలని ఆలోచించినప్పుడు మిస్‌ ఇండియా బ్లైండ్‌ గురించి తెలిసింది. ఈ విభాగంలో డెఫ్‌ కూడా ఉంటారని తెలుసుకున్నాను. దానికి తగిన కృషి చేశాను. అలా మిస్‌ ఇండియా డెఫ్, మిస్‌ ఆసియా డెఫ్‌ టైటిట్స్‌ గెలుచుకున్నాను’ అని తెలిపిన నిష్ఠా దూదెజా జూడో, టెన్నిస్, బ్యూటీ విభాగాలలోనూ నంబర్‌ వన్‌ అనిపించుకుంది.

వికలాంగుల సాధికారత
 భారత ఉపరాష్ట్రపతి నుంచి రోల్‌ మోడల్‌ కేటగిరీలో వికలాంగుల సాధికారత జాతీయ అవార్డును అందుకున్నది. ‘నా పై జాలి చూపే వారిని నేను ఇష్టపడను’ అని చెప్పే నిష్ఠా ప్రయాణం అంత తేలికగా సాగలేదు. ‘పాఠశాల స్థాయిలో తోటి పిల్లలే ఎగతాళి చేసేవారు. చిన్నప్పుడు అర్ధం కాలేదు. చాలా బాధనిపించేది. టీనేజ్‌ దాటాక నా పరిస్థితి పైన పూర్తి అవగాహన వచ్చింది. అప్పటి నుంచే జీవితంలోని సానుకూల కోణాన్ని చూశాను. అడ్డంకులను దాటుకుంటూ నా ప్రయణాన్ని కొనసాగించాను. విజయవంతమయ్యాను’ తెలిపే నిష్ఠా దూదెజా విజయం వినికిడి లోపం గల పిల్లలున్న తల్లిదండ్రులు తమ పిల్లలపై ఆశలు చివురించేలా చేస్తుంది. సరైన విధంగా దారి చూపిస్తే తమ పిల్లలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారనే ధైర్యాన్ని నింపుతుంది.

మరిన్ని వార్తలు