ఆపద్బాంధవులకు థ్యాంక్స్‌ చెప్పండి! 

3 Nov, 2021 12:27 IST|Sakshi

కృతజ్ఞతా దీపావళి

ఒక తల్లి కొడుకును వెంటబెట్టుకుని చేతిలో దీపావళి కానుకతో కారులో బయలుదేరుతుంది. ‘ఎక్కడికమ్మా?’ అని కొడుకు అడిగితే ‘నువ్వే చూస్తావుగా’ అంటుంది. ‘మన ఆత్మీయ కుటుంబాన్ని కలవబోతున్నాం’ అంటుంది. కోవిడ్‌ సమయంలో ఆ కొడుక్కు సీరియస్‌ అయితే ముక్కూ మొహం తెలియని పెద్దమనిషి బెడ్‌ ఏర్పాటు చేసి ఉంటాడు. ఆ పెద్దమనిషి కుటుంబానికి కానుక ఇవ్వడానికే ఆ తల్లి బయలుదేరుతుంది.

‘అమేజాన్‌’ చేసిన ఈ యాడ్‌ భారీ ఆదరణ పొందుతోంది. కోవిడ్‌ కాలంలో ప్రాణాలు నిలబెట్టిన ఆపద్బాంధవులకు ఈ దీపావళి సమయాన థ్యాంక్స్‌ చెప్పాల్సిన సంస్కారాన్ని గుర్తు చేస్తోంది. ఈ సంవత్సరమంతా మనం నిజమైన మనుషుల్ని చూశాం. ఆపద్బాంధవులను చూశాం. సమయానికి మనిషిలా వచ్చిన దేవుళ్లను చూశాం. వాళ్లు లేకపోతే ఇవాళ మనకు ఈ దీపావళి లేదు.

నిజం. వారంతా మన ప్రాణదాతలు. కోవిడ్‌ సమయంలో ఏదో మేరకు సాయపడిన కొత్త బంధువులు. వారూ ఇప్పుడు మనకు ఆత్మీయమైన కుటుంబమే. ఆ కుటుంబానికి థ్యాంక్స్‌ చెప్పాల్సిన సమయం ఇదని ‘అమేజాన్‌’ తన యాడ్‌ ద్వారా చెప్పింది. ఆలోచించి చూడండి... ఎందరు అలాంటి వాళ్లుంటారో.

అన్నం పెట్టినవారు
కోవిడ్‌ సమయంలో చాలామంది హోమ్‌ క్వారంటైన్‌లోనే ఉండి చికిత్స తీసుకున్నారు. వారిలో చాలామందికి భోజనం వండుకునే వీలు లేకపోయింది. అలాంటి సమయంలో ప్రతి ఊళ్లో ఎందరో ఉచిత భోజనం ఏర్పాటు చేశారు.

కోవిడ్‌ బాధితులు ఉన్నాం అని ఇంటి నుంచి కాల్‌ చేస్తే భోజనం తెచ్చి ఇంటి ముందు పెట్టి వెళ్లారు. మరికొన్ని చోట్ల రిస్క్‌ ఉన్నా ఇరుగిల్లు పొరుగిల్లు వారే ఆకలి తీర్చారు. నిజంగా వారే లేకపోతే ఆ 14 రోజులు ఎలా గడిచేవి? ఈ దీపావళి రోజు వారిని పలకరించాలి కదా. ఒక మిఠాయి డబ్బా ఇచ్చి నమస్కారం తెలుపుకోవాలి కదా.

వారు ఇచ్చిన ఆక్సిజన్‌
కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సిజన్‌ కోసం బాధితులు పడిన ఆందోళన అంతా ఇంతా కాదు. మన దగ్గర డబ్బు ఉన్నా సమయానికి ఆక్సిజన్‌ ఆచూకీ తెలిసేది కాదు. అలాంటి సమయంలో ఫేస్‌బుక్‌ పోస్ట్‌ పెడితేనో, ట్విటర్‌లో అప్పీల్‌ చేస్తేనో ఏ మాత్రం పరిచయం లేని ఎందరో ఫలానా చోట ఆక్సిజన్‌ ఉంది... మా దగ్గర ఎక్స్‌ట్రా ఉంది అని ఆచూకి తెలియ చేసి ప్రాణాలు నిలబెట్టారు.

ఎందరో దాతలు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు దానం చేసి గొప్ప సహాయం చేశారు. వాళ్లెవరో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. వారి సహాయానికి ఈ దీపావళికి కనీసం మెసేజ్‌ పెట్టడం అవసరం.

వైద్యుడే నారాయణుడు
వచ్చింది ప్రాణాంతక వ్యాధి. వైద్యం చేయక తప్పదు. చేస్తే అది సంక్రమించే అవకాశం ఎక్కువ. కాని వేలాది మంది వైద్యులు కోవిడ్‌ బాధితులకు వైద్యం చేసి ప్రాణం పోశారు. రేయింబవళ్లు శ్రమించారు. నర్సులు, అటెండర్లు... వీరంతా హాస్పిటల్‌లో ఉన్న సమయంలో బాగా గుర్తే. డిశ్చార్జ్‌ అయ్యే సమయంలో వారికి పెట్టిన నమస్కారం చాలదు. ఈ పండగ సమయంలో వారికి కృతజ్ఞతలు ప్రకటించాలి. చిరు కానుకతోనైనా సత్కరించాలి.

ఆఖరు మజిలి
కోవిడ్‌ కాలంలో ఆప్తుల్ని కోల్పోయారు కొందరు. కాని ఆ ఆప్తులకు అంతిమ సంస్కారాలు జరిపే శక్తి, ధైర్యం, వీలు వారికి లేవు. భారతదేశంలో అంతిమ సంస్కారాలు చాలా ముఖ్యమైనవి. అలాంటి పనికి ఎందరో యువతీ యువకులు రంగంలో దిగి సేవ చేశారు. తమకు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులకు అంతిమ సంస్కారాలు నిర్వహించి గొప్ప మానవులుగా అవతరించారు. ఆత్మీయులను కోల్పోయిన విషాదం ఇంకా వదిలి ఉండకపోవచ్చు. ఈ దీపావళి వారిని మరింత గుర్తు చేయవచ్చు. కాని వారి సగౌరవ వీడ్కోలుకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి ఈ పండగ సమయంలో గుండెలకు హత్తుకోవాలి.

ఎందరో అన్‌సంగ్‌ హీరోలను ఇచ్చిన కాలం ఇది. ఆ నాయికా నాయకులు లేకపోతే ఈ కాలాన్ని గెలిచేవాళ్లం కాదు. వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియచేయాలి.

మరిన్ని వార్తలు