Deepika Bhardwaj: సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని వదిలి మరీ.. పెళ్లి బాధల పురుషులకు బాసటగా నిలుస్తూ..

26 Jan, 2022 08:55 IST|Sakshi

ట్రెండింగ్‌/మేరేజ్‌స్ట్రైక్‌

‘మేరేజ్‌ స్ట్రయిక్‌’...ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌. ‘వివాహ చట్టాలన్నీ స్త్రీని కాపాడి పురుషులను బాధ పెడుతున్నాయి. తప్పుడు కేసులతో హింసిస్తున్నాయి. ఇక మాకు పెళ్లొద్దు బాబోయ్‌’... అని కొంతమంది పురుషులు ఈ హ్యాష్‌ట్యాగ్‌ మూవ్‌మెంట్‌ను ప్రారంభించారు. పురుషులకు బాధలు ఉంటాయా? ‘అవును ఉంటాయి’ అంటుంది దీపికా భరద్వాజ్‌.

'మేట్రియర్స్‌ ఆఫ్‌ మేరేజ్‌’, ‘టేల్‌ ఆఫ్‌ ఫాల్స్‌ రేప్‌ కేస్‌ సర్వయివర్స్‌’ పేరుతో రెండు డాక్యుమెంటరీలు తీసిన దీపిక పెళ్లి వ్యవస్థలో పురుషుల బాధలకు తన గళం వినిపిస్తోంది.
ఒక స్త్రీగా ఆమె పురుషులకు ఎందుకు బాసటగా నిలుస్తోంది. గత రెండు రోజులుగా ట్విటర్‌లో ‘మేరేజ్‌స్ట్రయిక్‌’ పేరుతో మగవాళ్ల మూవ్‌మెంట్‌ ట్రెండ్‌ అవుతోంది. ‘పెళ్లి చట్టాల వల్ల మగవాళ్లకు వచ్చిన కష్టాలు చాలు. ఇక మేము పెళ్లి చేసుకోము’ అనే అర్థంలో ఈ మూవ్‌మెంట్‌ మొదలెట్టారు.

దానికి కారణం ఢిల్లీ హైకోర్టులో ‘మేరిటల్‌ రేప్‌’ మీద ఒక కేసు చర్చకు రావడమే. ‘పెళ్లయ్యాక భార్యకు అంగీకారం లేకుండా భర్త శృంగారంలో పాల్గొంటే అది రేప్‌ కిందకు రాదని చట్టం చెబుతోంది. కాని భర్తకు పెళ్లి అనే కారణంగా రేప్‌ అభియోగానికి వీలు లేని రక్షణ ఎందుకు? స్త్రీకి ఇష్టం లేకుండా జరిగేది రేప్‌ అయినప్పుడు భర్త చేసినా రేపే అవుతుంది’ అని ఆ కేసులో వాదన. దీనికి ఢిల్లీ హైకోర్టు ‘మీరేం అంటారు’ అని కేంద్ర హోమ్‌ శాఖను అడిగితే ‘ఇది సున్నిత అంశం. పెళ్లి అనే వ్యవస్థను ఈ విషయం చెదరగొట్టే అవకాశం ఉంది. ఆలోచించి చెప్తాం’ అని సమాధానం ఇచ్చింది.

ఈలోపు మగవాళ్ల హాహాకారాలు మొదలయ్యాయి. ‘ఇప్పటికే విడాకుల కేసుల్లో భరణం పేరుతో, గృహహింస అంటే 498ఏ కేసులతో, వరకట్నం కేసులతో మగవాళ్లు అవస్థలు పడుతున్నారు. నిజమైన కేసుల కంటే అబద్ధపు కేసుల వల్ల బాధ పడుతున్నవారి సంఖ్య ఎక్కువ. ఇప్పుడు మేరిటల్‌ రేప్‌ పేరుతో అది కూడా శిక్షార్హమైన నేరం చేస్తే రేపు భార్యలు భర్తల మీద కోపంతో తప్పుడు మేరిటల్‌ రేప్‌ కేసులు పెడితే మా గతేం కాను. ఇక ఈ పెళ్లి అనే వ్యవస్థకు రాంరాం’ అంటూ ట్రెండింగ్‌ మొదలెట్టారు.

‘అవును. వీరి బాధను అర్థం చేసుకోవాలి’ అని వీరికి వత్తాసు పలుకుతున్నారు దీపికా నారాయణ్‌ భరద్వాజ్‌. బీటెక్‌ చేసి టీవీ జర్నలిజం చదివిన దీపిక తాను చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని వదిలి మరీ మగవాళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడానికి రెడీ అయ్యారు. ‘దానికి కారణం పర్సనల్‌గా ఎదురైన అనుభవమే. మా కజిన్‌కు జరిగిన పెళ్లి మూడు నెలల్లో పెటాకులు అయ్యింది. ఆ అమ్మాయి తనను మేమంతా కొట్టి హింసించామని, వరకట్నం పేరుతో వేధించామని తప్పుడు కేసు పెట్టింది. నన్ను కూడా కేసులో ఇరికించింది.

ఆ కేసు నుంచి బయటపడటానికి మేమందరం ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. నేనే కాదు ఇలా దేశంలో ఎందరో ఈ చట్టం వల్ల బాధలు పడుతున్నారు. స్త్రీల మీద హింస జరిగే ఘటనలను మనం తప్పక ఖండించాలి. వారికి న్యాయం జరిగేలా చూడాలి. అంత మాత్రం చేత పురుషులకు అన్యాయం జరిగినా పర్వాలేదు అనుకోవడం దారుణం. దేశంలో 498ఏ కేసులు మొదలయ్యాక అర్థం పర్థం లేకుండా కుటుంబ సభ్యులను తీసుకెళ్లి లోపల వేయడం మొదలెట్టారు.

కొన్ని కేసుల్లో చిన్నపిల్లలను కూడా అరెస్టు చేశారు. చివరకు సుప్రీం కోర్టు పూనుకుని ఇలాంటి కేసుల్లో 9 అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక అరెస్టులు చేయాలని చెప్పింది. ఈలోపు తప్పుడు కేసుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న పురుషులు ఎందరో ఉన్నారు’ అంటుంది దీపికా నారాయణ్‌. పురుషుల కోసం పని చేసే ‘సేవ్‌ ఇండియన్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌’ వంటి సంస్థలతో ఈమె పని చేయడమే కాకుండా జాతీయ మహిళా కమిషన్‌ ఉన్నట్టుగానే ‘జాతీయ పురుష కమిషన్‌’ ఉండాలని ప్రచారం చేస్తూ అందుకు అవసరమైన ఉద్యమాన్ని నిర్మిస్తోంది.

‘స్త్రీలపై అత్యాచారాలు నిరోధించడానికి చట్టాలు గట్టిగా పని చేయాలి. దోషులను పట్టుకోవాలి. అదే సమయం లో తప్పుడు అత్యాచారాల కేసులు పెట్టి వేధించే ఆడవాళ్లను కూడా శిక్షించాలి’ అంటుంది దీపికా నారాయణ్‌. నెల రోజుల క్రితం ఢిల్లీలోని ఒక యువతి అత్యాచార కేసు పెడతానని కనీసం ఏడు మంది పురుషులను బెదిరించి భారీగా డబ్బు వసూలు చేయడాన్ని ఆమె ఉదాహరణగా చూపుతోంది. ఆ యువతిని పోలీసులు అరెస్టు చేశారు.

‘నేను పురుషుల తరఫున మాట్లాడుతున్నానంటే స్త్రీలకు వ్యతిరేకం అని కాదు. దుర్మార్గులైన పురుషులను వెతికే క్రమంలో మంచి తండ్రిగా, భర్తగా, కొడుకుగా ఉండే పురుషులను శత్రువులను చేసుకోవాల్సిన పని లేదు. స్త్రీ, పురుషులు ఒకరికొకరు గౌరవించుకునే సమాజాన్ని నిర్మించుకోవాలి. ఒకరిని ఒకరు బాధించే సమాజం, కుటుంబం ప్రమాదం.

తప్పు చేసే వారు ఇరువైపులా ఉంటారని గ్రహించక పోతే న్యూట్రల్‌ దృష్టితో న్యాయం చేయకపోతే కేవలం మగవారు అయినంత మాత్రాన నింద భరించే ఒత్తిడి మగవాళ్ల నెత్తిన ఉండటం సరి కాదు. స్త్రీ ఏ ఆరోపణ చేసినా నమ్మేస్తూ మగవాణ్ణి విక్టిమ్‌ చేయడం ఎంత కాలం? దాని వల్ల ఎందరు ఎన్ని విధాలుగా నాశనం అవుతున్నారో అర్థం చేసుకోవాలి’ అంటుంది దీపిక.

సమాజంలో పురుష పెత్తనం వల్ల స్త్రీల వేదనలు, కష్టాలు వాటి నుంచి రక్షణకు చట్టాలు ఇవన్నీ కాలక్రమంలో దేశం నిర్మించుకుంటూ వచ్చింది. అయితే వివాహ వ్యవస్థలో స్త్రీ, పురుష తకరార్లు పాలు నీళ్లు లాగా విడివిడిగా కనిపించేంత స్పష్టంగా ఉండవు. ఎక్కువ బాధితులు స్త్రీలే కనుక వారి పక్షాన పని చేయాల్సిన అవసరం నేటికీ రేపటికీ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్‌లో ఒక్క నిరపరాధి పురుషుడు కూడా నష్టపోకూడదని దీపిక లాంటి వాళ్లు ఉద్యమిస్తే ఆ మాటను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీకైనా పురుషుడికైనా సమన్యాయం జరిగే వైవాహిక వ్యవస్థ గురించి సమాజం మరింత ఫలవంతమైన చర్చలు చేయాలని కోరుకుందాం. 

చదవండి: Health Benefits Of Ivy Gourd: దొండకాయ కూర తింటున్నారా.. అందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల..
  

మరిన్ని వార్తలు