Delhi Acid Attack: జాగ్రత్త... ప్రమాదం పొంచే ఉంది

16 Dec, 2022 20:24 IST|Sakshi
ప్రతీక్మాతక చిత్రం

యాసిడ్‌ అమ్మకాల మీద నిఘా పెట్టాం. మహిళల రక్షణకు చట్టాలు కఠినతరం చేశాం. షీ టీమ్స్‌ సిద్ధంగా ఉన్నాయి. యాప్స్‌ డెవలప్‌ అయ్యాయి. నిజమే. కాని ప్రమాదం పొంచే ఉంది. ఢిల్లీలో తాజా యాసిడ్‌ దాడి ఘటన ఈ విషయమే నిర్థరిస్తోంది. ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో’ (ఎన్‌.సి.ఆర్‌.బి) నివేదిక ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా 176 యాసిడ్‌ దాడులు నమోదయ్యాయి. మరో 73 అటెంప్ట్స్‌ జరిగాయి. అంటే ప్రమాదం పొంచే ఉంది. నిర్లక్ష్యం ఏ మాత్రం పనికి రాదు.

వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నప్పుడు ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది. 2013లో సుప్రీం కోర్టు యాసిడ్‌ అమ్మకాల మీద జవాబుదారీ ఉండాలని చెప్పింది. రిజిస్టర్‌ మెయింటెయిన్‌ చేయాలని చెప్పింది. అంతే కాదు ఐ.డి.ప్రూఫ్‌ లేకుండా యాసిడ్‌ అమ్మకూడదు. అలా చేస్తే 50 వేల రూపాయల ఫైన్‌ ఉంది. అయితే 2016లో ఢిల్లీలో కొంతమంది పోలీసులు మఫ్టీలో యాసిడ్‌ కొన ప్రయత్నిస్తే 23 షాపులు ఎవరు ఏమిటి అనకుండా అమ్మారు. అప్పుడు గగ్గోలు అయ్యింది. తాజాగా ఢిల్లీలో జరిగిన యాసిడ్‌ దాడిలో నిందితుడు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా యాసిడ్‌ను కొన్నాడని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ అమ్మకం దారులను యాసిడ్‌ అమ్మకాలపై జాగ్రత్త వహించవలసిందిగా తాకీదులు పంపుతున్నారు. అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే.

పరిస్థితి దారుణం
కోవిడ్‌ కాలంలో తప్ప దేశంలో యాసిడ్‌ దాడులు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీలు బలవుతూనే ఉన్నారు. ప్రేమ వద్దన్నారని, ప్రేమలో ఉన్నాక బ్రేకప్‌ చెప్పారని, పెళ్లయ్యాక విడిపోయారని రకరకాల కారణాల వల్ల పురుషులు ద్వేషంతో యాసిడ్‌ దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. 2016 నుంచి 2021 మధ్య 1300 యాసిడ్‌ దాడులు జరిగాయి. విషాదం ఏమిటంటే ఈ యాసిడ్‌ దాడుల్లో నేరస్తులకు శిక్ష పడుతున్న శాతం అతి తక్కువగా ఉండటం. 400 కేసులు నమోదు అయితే 10 మందికి మాత్రమే శిక్ష పడుతోందంటే ఎన్ని విధాలుగా తప్పించుకుంటున్నారో, తప్పించుకోవచ్చులే అనే ధైర్యంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

అప్రమత్తత అవసరం
విద్యార్థినులు, యువతులు, స్త్రీలు తమకు తారసపడుతున్న ప్రేమ, వైవాహిక బంధాలలో పురుషుల ధోరణి పట్ల అప్రమత్తంగా ఉండాలి. బెదిరిస్తున్నవారిని, వద్దనుకున్నా వెంటపడుతున్నవారిని, ఒకవేళ బంధం నుంచి బయటపడాలనుకుంటే ఆ మగవారిని గమనించి వారి ధోరణి ప్రమాదకరంగా అనిపిస్తే ముందే కుటుంబ సభ్యుల, పోలీసుల మద్దతు తీసుకోవాలి. ముఖ్యంగా ఇష్టం లేని ప్రేమ ప్రతిపాదిస్తున్నప్పుడు, ప్రేమలో నుంచి బ్రేకప్‌ చెబుతున్నప్పుడు, విడాకుల సందర్భాలలో ఒంటరిగా తిరిగేటప్పుడు అప్రమత్తంగా ఉండటం, ఎవరైనా అపరిచితుడు లేదా పాత మిత్రుడు దగ్గరిగా వస్తుంటే జాగ్రత్త పడటం, అసలు వీలైనంత సామరస్యంగా, ఒప్పుదలతో బంధాల నుంచి బయటపడటం... ఇవన్నీ ముఖ్యమైనవే. 

దేశంలో యాసిడ్‌ దాడులను నిర్మూలించామని ఎవరూ హామీ ఇవ్వడం లేదు. కనుక మన రక్షణకు మనమే బాధ్యత వహించాలి. కుటుంబం, పోలీసుల వద్ద సమస్యను దాచకుండా సాయం పొందాలి. (క్లిక్‌ చేయండి: వరతమ్మా నీకు వందనాలమ్మా!)

మరిన్ని వార్తలు