డా‘‘ రోల్‌ మోడల్‌: వయసు మరచి కలలు కనండి

31 Mar, 2022 06:33 IST|Sakshi
డాక్టర్‌ గీతా ప్రకాష్‌

యవ్వనంలో ఉన్న అమ్మాయికి గానీ అబ్బాయిలకు గానీ కాస్త ఈ పనిచేయండి? అని దేనిగురించి అయినా చెప్పామంటే..‘‘నా వల్ల కాదని కొందరు చెబితే, మరికొందరు నాకే చాలా పని ఉంది మళ్లీ ఇది చేయాలా? అని సణుగుతారు. ఇటువంటి యంగ్‌ జనరేషన్‌ ఉన్న ఈ రోజుల్లో ఆరుపదులు దాటిన అమ్మమ్మలు, నాయనమ్మలు కొందరు డ్యాన్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంటే, మరికొందరు డెభైఏళ్ల వయసులోనూ కొత్త బిజినెస్‌లు ప్రారంభించి ఔరా అనిపిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న డాక్టర్‌ గీతా ప్రకాష్‌ ఈ కోవకు చెందిన వారే అయినప్పటికీ... వీరందరి కంటే ఒక అడుగు ముందుకేసి ఏకంగా రెండు ఉద్యోగాలు చేస్తున్నారు. పేరులోనే తెలుస్తోంది ఆమె ఒక డాక్టర్‌ అని. ముఫ్పైఏళ్లపాటు డాక్టర్‌గా పనిచేసిన తరువాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టి మంచి మోడల్‌గా మారింది గీత. ఒకపక్క డాక్టర్‌గా సేవలందిస్తూనే, 67 ఏళ్ల వయసులో లేటెస్ట్‌ మోడల్‌గా ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.

ఢిల్లీకి చెందిన గీతా ప్రకాష్‌ వైద్యవిద్యపూర్తయ్యాక జనరల్‌ ఫిజీషియన్‌గా బాధ్యతలు చేపట్టింది. ఒక డాక్టర్‌గా జీవితం ఎంతో సంతృప్తిగా సాగుతోంది. రోజూ తన క్లినిక్‌కు వచ్చే రోగులను చూడడం, వారి బాధలకు మందులు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూడడం ఆమె దైనందిన చర్యగా మారింది. ఓ రోజు ఇటలీకి చెందిన ఓ ఫొటో గ్రాఫర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం గీత దగ్గరకు వచ్చాడు. తన ట్రీట్మెంట్‌ పూర్తయ్యాక..ఫొటోగ్రాఫర్‌ కాస్త చనువు తీసుకుని ..‘‘మేడమ్‌! మీ ముఖం చాలా కళగా అందంగా ఉంది. మీరెందుకు మోడలింగ్‌ చేయకూడదు’’అని సూచించాడు. ఓ పేషెంట్‌ తనకు అస్సలు సంబంధం లేని విషయాన్ని ప్రస్తావించడాన్ని గీత చిన్నగా నవ్వి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయింది.
 
యాభైఏడేళ్ల వయసులో...
కొన్ని నెలల తరువాత ఇటాలియన్‌ ఫొటోగ్రాఫర్‌ నుంచి గీతకు ఉత్తరం వచ్చింది. ‘‘మేడమ్‌! మీ ఫొటోలు పంపించండి’’ అని ఆ ఉత్తర సారాంశం. ఆ ఫొటోగ్రాఫర్‌ మాటలు ప్రోత్సాహకరంగా ఉండడంతో గీతకు నచ్చాయి. దీంతో ‘‘చూద్దాం అతను చెబుతున్నాడు, కాబట్టి మోడలింగ్‌ చేద్దాం’’ అనుకుంది. అప్పటిదాకా ఫొటోల మీద పెద్దగా ఆసక్తి లేకపోవడంతో..ఎప్పుడూ మంచిగా రెడీ అయ్యి ఫొటోలు దిగలేదు. అప్పుడప్పుడూ దిగిన అత్యంత సాధారణ ఫొటోలను తన పిల్లలతో చెప్పి ఫొటోగ్రాఫర్‌కు పంపించింది. ఈ ఫొటోలు ముంబైకి చెందిన ప్రముఖ డిజైనర్‌ తరుణ్‌ తహిలియానీకి నచ్చడంతో...అతను రూపొందించిన ‘కనీ’ శాలువాకు మోడలింగ్‌ చేసేందుకు గీత ఎంపికైంది.

ఆ శాలువా ధరించి 57 ఏళ్ల వయసులో తొలిసారి మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఈ శాలువాలు గీత వయసువారు ధరించేవి కావడం, పైగా ‘కనీ’ శాలువాలు గీతకు బాగా నప్పడంతో ఆ అడ్వర్‌టైజ్‌మెంట్‌ క్లిక్‌ అయింది. దాంతో ఆమె మోడల్‌గా బాగా పాపులర్‌ అయింది. ఆ తరువాత జైపూర్‌ బ్రాండ్‌ వాళ్లు కూడా మోడల్‌గా పనిచేయమని ఆఫర్‌ ఇవ్వడంతో అప్పటి నుంచి గీత మోడలింగ్‌లో దూసుకుపోతోంది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆరు పదుల వయసులో గీత మోడలింగ్‌లో రాణించడానికి కుటుంబం మొత్తం మద్దతుగా నిలవడం విశేషం. ప్రతి మోడలింగ్‌ అసైన్‌మెంట్‌కు వెళ్లేటప్పుడు ఆమెను మరింత ఉత్సాహపరిచి పంపడం, గ్లాసీ పేపర్‌ల మీద వచ్చిన గీత ఫొటోలను చూపించి అభినందించేవారు.  
 
నా వృత్తిని ఆరాధిస్తాను...

‘‘వృత్తిని దేవుడుగా భావించి ఆరాధిస్తాను. మనపని మనం చేసుకుంటూ పోతే గుర్తింపు తప్పకుండా వస్తుందని నమ్ముతాను’’ అని చెబుతూ.. ‘‘కలలు కనడం ఎప్పుడూ మానకండి, వయసు అయిపోయింది ఇంకేం చేస్తాం, ఇప్పుడు మనవల్ల ఏం అవుతుంది అని అస్సలు అనుకోవద్దు. వయసు ఏదైనా సరే... ఏదోఒకటి సాధించాలన్న కలను కనాలి. ఈ ప్రపంచంలో దేనికీ ఇంతవరకే అన్న పరిమితి లేదు. మన అలవాట్ల ద్వారా కూడా ఏదైనా సాధించవచ్చు’’. అని మహిళలకు పిలుపునిస్తోంది.
 
డాక్టర్‌గానూ.. మోడల్‌గానూ...
ఒకపక్క డాక్టర్‌గా బిజీగా ఉంటూనే గత పదేళ్లుగా మోడలింగ్‌లో రాణిస్తోంది గీతాప్రకాష్‌. మోడల్‌గా మారినప్పటికీ గీత తన డాక్టర్‌ వృత్తిని నిర్లక్ష్యం చేయలేదు. వారాంతాల్లో మోడలింగ్‌కు సమయం కేటాయిస్తూ...మిగతా సమయంలో పేషంట్లను చూసేది. మోడలింగ్‌లో తనకంటూ ఒక గుర్తింపు రావడంతో మరింత బాగా చేయడానికి ప్రయత్నించేది. మోడలింగ్‌ను ప్రేమిస్తూనే..తన ఇంట్లో చారిటబుల్‌ క్లినిక్‌ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం 67 ఏళ్ల వయసులో ప్రముఖ డిజైనర్‌ బ్రాండ్స్‌ అన్జు మోడీ, తరుణ్‌ తహిలియానీ, గౌరవ్‌ గుప్తా, టొరాణి, నికోబార్, జేపోర్, అష్‌దీన్‌ల వద్ద అందాల మోడల్‌గా రాణిస్తూ ఎంతో మంది యువతీయువకులకు ప్రేరణగా నిలుస్తోంది.

మరిన్ని వార్తలు