ఆన్‌లైన్‌ ఆర్డర్లలో ఈ ఆర్డర్‌ వేరయా! రోజులు కాదు ఏకంగా నాలుగేళ్లు పట్టింది డెలివరీకి!

24 Jun, 2023 18:46 IST|Sakshi

ఇప్పుడంతా ఆన్‌లైన్‌ మయమైంది. ఏం కావాలన్నా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టేస్తున్నారు. ఎలాంటి కష్టం లేకుండా కావాల్సిన వస్తువులు ఇంటికి తెచ్చేసుకుంటున్నారు. ఐతే ఏదైనా వస్తువు ఆర్డర్‌ పెడితే..  మహా అయితే ఐదు నుంచి పది రోజుల్లో వచ్చేస్తుంది. అది కూడా ఆ వస్తువు వచ్చే ప్లేస్‌ని బట్టి కూడా డెలివరీ టైం అనేది ఉంటుంది. అంతేగాని సంవత్సరాలు పట్టదు. కానీ ఇక్కడొక వ్యక్తికి మాత్రం తాను ఆర్డర్‌ చేసిన వస్తువును అందుకోవడానికి రోజులు కాదు.. ఏకంగా నాలుగు సంవత్సరాలు పట్టింది.

ఢిల్లీకి చెందిన నితిన్‌ అగర్వాల్‌ అనే వ్యక్తి 2019లో చైనా వెబ్‌సైట్‌ అలీబాబాకు చెందిన అలీ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ఆర్డర్‌ పెట్టాడు. ఐతే ఆ పార్శిల్‌ సరిగ్గా జూన్‌ 23, 2023కి అతని వద్దకు చేరుకుంది. అంటే ఆ పార్శిల్‌ చేరడానికే నాలుగేళ్లు పట్టింది. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌ని ఇండియాలో బ్యాన్‌ చేశారు. కాగా, ఒక్కసారిగా సదరు వ్యక్తి నితిన్‌ అగర్వాల్‌  ఆ పార్శిల్‌ని చూసి షాక్‌ అయ్యాడట! పైగా ఆ పార్శిల్‌పై ఆర్డర్‌ చేసిన టైం డెలివరి అయ్యిన తేది రెండు కూడా ఉన్నాయి. 

దీంతో ఆ వ్యక్తి ట్విట్టర్‌లో నెటిజన్లతో ఈ విషయాన్ని పంచుకుంటూ.. ‘చివరి వరకు ఆశను వదులుకోకండి. ఆలస్యం కానిదే ఏ పని కాదు’ అంటూ ట్వీట్‌ చేశాడు. దీంతో నెటిజన్లు మీరు చాలా లక్కీ అని ఒకరూ, తాను ఆర్డర్‌ చేసింది కూడా ఏదో ఒక రోజు ఇలానే తన వద్దకు వస్తుందన్న హోప్‌ వచ్చిందని మరొకరూ ట్వీట్‌ లు చేశారు. 

(చదవండి: స్నానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు..నీరు లేకుండా స్నానం చేయొచ్చు అని తెలుసా!)

మరిన్ని వార్తలు