ఆశా జీవులు

14 Aug, 2020 01:36 IST|Sakshi

సోషల్‌ డిస్టెన్స్‌ పాటించకుండా ముందు వరుసలో ఉండి కరోనా వ్యాప్తి నిరోధానికి పాటు పడినన్నాళ్లూ ఆశా వర్కర్‌లను పిలిచి కిరీటం పెట్టని ఢిల్లీ ప్రభుత్వం.. ఇప్పుడు వాళ్లు తమ గౌరవ వేతనాన్ని కనీసం పదివేల రూపాయలకైనా పెంచాలని కోరుతూ నిరసనకు కూర్చుంటే.. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించకుండా లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేస్తోంది! ఢిల్లీలో ఆశా వర్కర్లు జూలై 21 నుంచి ధర్నాలో ఉన్నారు. వారిలో కొందరు బుధవారం జంతర్‌ మంతర్‌ దగ్గర  భైఠాయించినప్పుడు సుమారు 100 మంది ‘ఆశా’ జీవులపై పార్లమెంట్‌ స్ట్రీట్‌ స్టేషన్‌ పోలీసులు ఇండియన్‌ పీనల్‌ కోడ్, ఎపిడమిక్‌ డీసీజ్‌ యాక్ట్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ల కింద కేసులు పెట్టారు! ఆశా వర్కర్‌లు ప్రస్తుతం 4 వేల రూపాయల వేతనానికి మోయలేని సేవలే అందిస్తున్నారు. ఇంకో ఆరువేలు పెంచాలని, పి.పి.ఇ. కిట్లు ఇవ్వాలని వారి డిమాండ్‌. విజ్ఞప్తిని డిమాండ్‌ వరకు ప్రభుత్వమే తెచ్చుకుంది. తిరిగి ప్రభత్వమే ఇప్పుడు వారిపై కేసులు పెడుతోంది. ఆశావర్కర్‌ల ఢిల్లీ కో ఆర్డినేటర్‌ కవితా యాదవ్‌ మాత్రం ఈ కేసుల గురించి కన్నా పెరుగుతున్న కరోనా కేసుల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీని కరోనాకు వదిలి పెట్టామే అని అపరాధ భావన వాళ్లను నిలువనిచ్చేలాను, కూర్చోనిచ్చేలానూ లేదు.‘ప్రభుత్వానికి లేకుంటే మాకు ఉంటుంది కదా’ అని సేవలకు పునరంకితం అయేందుకు తన సేనను సమాయత్తం చేసున్నారు కవిత. 

మరిన్ని వార్తలు