Resham Talwar: చూపు లేకపోతేనేం! చక్కని స్వరాలతో.. అవకాశాలు అందిపుచ్చుకొని..

18 Jul, 2022 13:22 IST|Sakshi

వైకల్యాన్ని సాకుగా చూపి ఏమీ చేయకుండా కూర్చునే వారు కొందరైతే... ‘‘వైకల్యం ఉంటే ఏం? జీవితంలో వైకల్యం దగ్గరే ఆగిపోతామా? సాకల్యంగా ముందుకు సాగాలి’’ అంటూ మనోధైర్యంతో వివిధ రంగాల్లో రాణించేవారి జాబితా చెప్పకనే చెబుతుంది.

ఈ జాబితాలో ఉన్న రేషమ్‌ తల్వార్‌... పుట్టుకతో చూపు లేకపోయినప్పటికీ 25 ఏళ్ల వయసులో గాయనిగా, వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తూ  అబ్బురపరుస్తోంది. 

దిల్లీలో ఓ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టింది రేషమ్‌ తల్వార్‌. పుట్టగానే కళ్లు తెరిచి చూస్తే తనకు ఏమీ కనిపించలేదు. కళ్లు తెరిచినా..మూసినా అంతా చీకటే. తన చుట్టూ ఉన్న వాటిని చూడలేదు. అయినా ఏమాత్రం నిరాశపడలేదు. వస్తువులను తాకడం ద్వారా అవేంటో తెలుసుకోవడం ప్రారంభించింది.

అలా రంగులు, భావోద్వేగాలను పసిగట్టగలిగింది. రేషమ్‌ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు చిన్నప్పుడే బ్లైండ్‌ అసోసియేషన్‌లో చే ర్పించి బ్రెయిలీ నేర్పించారు. బ్రెయిలీ నేర్చుకుని సాధారణ పాఠశాలలో రెండో తరగతిలో చేరింది.

పదోతరగతి లో మంచి ప్రతిభను కనబరిచి సీబీఎస్సీ నుంచి ఇందిరా అవార్డును కూడా అందుకుంది. అలా చదువుకుంటూ డిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ, ఇగ్నోలో పీజీ పూర్తిచేసింది.

అమ్మపాటలు వింటూ..
నాన్న మంచి మ్యూజీషియన్, అమ్మ మంచి గాయని కావడంతో ఇంట్లో ఎప్పుడూ సంగీత వాతావరణం ఉండేది. వివిధరాగాలు వింటూ నిద్రలేచే రేషమ్‌ చిన్నప్పుడు అమ్మ పాడే పాటలను చాలా ఆసక్తిగా ఆలకించేది. అమ్మతో పాటు హార్మోనియం వాయిస్తూ తను కూడా పాడడానికి ప్రయత్నించేది.

సంగీతంపై ఉన్న మక్కువను ప్రోత్సహించేందుకు తొమ్మిదేళ్ల వయసులో రేషమ్‌ను తన తల్లి సంగీతం నేర్పించే మాష్టారు దగ్గర చేర్పించింది. అలా సంగీతం నేర్చుకుని స్కూలులో, కాలేజీలో వివిధ సందర్భాలలో జరిగే వేడుకల్లో పాటలు పాడుతూ సింగర్‌గా పాపులర్‌ అయ్యింది. అంతేగాక మిస్‌ ఫ్రెషర్, మిస్‌ ఫేర్‌వెల్‌ టైటిల్స్‌ను గెలుచుకుంది. 

మూడో తరగతి నుంచే..
తొలిసారి మూడో తరగతిలో పాటల పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. అప్పటి నుంచి స్కూలు, కాలేజీలో ఏ పోటీలో పాల్గొన్నా  విన్నర్‌గా నిలిచేది. ‘‘ద వాయిస్, ఇండియన్‌ ఐడల్, స రే గ మ పా వంటి అనేక టెలివిజన్‌ రియాల్టి షోలలో కూడా పాల్గొంది. వెయ్యికి పైగా స్టేజ్‌షోలలో పాడిన అనుభవంతో.. వాయిస్‌ వోవర్‌ ఆర్టిస్ట్‌గా ఎదిగింది.

అనేక హిందీ సినిమాలు, కమర్షియల్‌ ప్రకటనలకు డబ్బింగ్‌ చెప్పింది. ప్రారంభంలో వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌ ఉద్యోగం కోసం వెతికిన రేషమ్‌ ఇప్పుడు తన గాత్రానికి వచ్చిన గుర్తింపుతో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. హేళన చేసిన ఎంతో మందికి తన గొంతుతోనే సగర్వంగా సమాధానం చెబుతోంది రేషమ్‌.

స్కూల్లో ఉన్నప్పుడు స్నేహితులు, టీచర్లు సైతం నాకు కళ్లు కనిపించవని హేళన చేసేవారు. ఎన్నోసార్లు బాధగా అనిపించేది కానీ, వాటిని ఎప్పటికప్పుడు మనసులో నుంచి తీసేదాన్ని. ఇప్పటిదాకా నా  లైఫ్‌ జర్నీలో అమ్మ నా వెన్నంటే ఉండి ప్రోత్సహించారు.

నేను ఎప్పుడు బాధపడినా అన్నయ్య నాలో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తూ  కింద పడిన ప్రతిసారి పైకి లేపాడు. ఎన్ని అవమానాలు ఎదురైనా కుటుంబం అండతో ఈ స్థాయికి చేరుకోగలిగాను. మనలో దాగున్న ప్రతిభను కష్టపడి వెలికితీస్తే ఏదైనా సాధ్యమే. అందుకే కష్టాన్ని నమ్ముకుంటే వైకల్యం ఏది ఉన్నా జీవితంలో ఉన్నతంగా ఎదగ గలుగుతారు. – రేషమ్‌ తల్వార్‌ 

చదవండి: Delhi: 11 మంది మహిళలు.. లడ్డుతో వ్యాపారం మొదలుపెట్టి.. కార్పోరేట్‌ హోటళ్లలో ‘గెస్ట్‌ చెఫ్‌’గానూ..

మరిన్ని వార్తలు