కోచ్‌గా తొలగించారనే కోపంతో..

22 Aug, 2020 13:25 IST|Sakshi

న్యూఢిల్లీ:  కోపం, కసి.. మనిషిని స్థిమితంగా ఉండనివ్వవు. ప్రశాంతంగా ఆలోచించనివ్వవు. ఏదో ఒక రూపంలో పగ తీర్చుకొమ్మని అవి రెండూ నిరంతరం మనిషిని ప్రేరేపిస్తుంటాయి. శేఖర్‌ పట్నాయక్‌ని కూడా అలాగే ప్రేరేపించాయి. పట్నాయక్‌ ఫుట్‌ బాల్‌ కోచ్‌. ఇప్పుడు కాదు. 2011–2013  మధ్య.. ఢిల్లీ యునైటెడ్‌ ఫుట్‌ బాల్‌ క్లబ్‌కి ఆయన సేవలను అద్దెకు తెచ్చుకున్నారు. కోచ్‌ అన్నాక ఒకరే ఉండరు. పక్కన ఇంకో సెమీ కోచో, క్వార్టర్‌ కోచో ఉంటారు. ఆ కోచ్‌ ఈ పట్నాయక్‌ కోచ్‌ మీద కంప్లయింట్‌ చేశాడు. పద్ధతి లేని మనిషి, బద్ధకపు మనిషి, టైమ్‌కి రాడు.. అని పై వాళ్లకు కాగితం పెట్టాడు. పై వాళ్లు వెంటనే స్పందించి పట్నాయక్‌ని తీసేశారు. అది మనసులో పెట్టుకున్నాడు. ఏడేళ్లుగా టీమ్‌ మీద కసి తీర్చుకోవాలని కాపు కాస్తున్నాడు.

ఈ మార్చిలో అవకాశం వచ్చింది! జవహర్‌ లాల్‌ నెహ్రు స్టేడియంలో ఢిల్లీ ఫుట్‌ బాల్‌ లీగ్‌ మ్యాచ్‌ జరుగుతుంటే డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ టీమ్‌ మొత్తానివీ సెల్‌ ఫోన్‌లు, ఇతర విలువైన వస్తువులు ఉంటాయి. ఆ సెల్‌ ఫోన్లన్నీ.. మొత్తం 12.. తీసుకెళ్లిపోయాడు. ఐదు నెలల తర్వాత ఇప్పుడు పోలీసులకు దొరికాడు. వాటిల్లో ఒక ఫోన్‌ స్విచ్చాన్‌ కాగానే పోలీసులు అక్కడికి వెళ్లారు. ఎవరు అమ్మారో తెలుసుకుని నేరుగా పట్నాయక్‌ ఇంటికి వెళ్లి మిగతా సెల్‌ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ‘నన్ను కోచ్‌ గా తొలగించారు. ఆ కోపంతోనే నేను ఈ పని చేశాను’ అని పట్నాయక్‌ అంటుంటే.. పాపం అనిపిస్తుంది. పేదవాడి ప్రతీకారం కూడా పేదవాడి కోపం లాంటిదేనేమో!!

మరిన్ని వార్తలు