చిక్‌ బుక్‌ రైలు

21 Oct, 2021 03:44 IST|Sakshi

దిల్లీకి చెందిన శృతిశర్మ గురించి చెప్పుకునే ముందు బ్రిటీష్‌ నటి ఎమ్మా వాట్సన్‌ దగ్గరకు వెళ్లాలి. హారిపోటర్‌ ఫిల్మ్‌సిరీస్‌తో ఫేమ్‌ అయిన ఎమ్మా ఉద్యమకార్యకర్త కూడా. స్త్రీల హక్కులకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో పట్టభద్రురాలైన ఎమ్మాకు పుస్తక పఠనం అంటే వల్లమాలిన ప్రేమ. మార్కెట్‌లో ఏ మంచి పుస్తకం వచ్చినా ఆమె చదవాల్సిందే.

ఒక మంచి పుస్తకం గురించి ఎక్కడైనా విన్నా చదవాల్సిందే. అలాంటి ఎమ్మా ప్రజల్లో పుస్తకపఠన అలవాటును పెంపొందించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టింది. న్యూయార్క్, లండన్‌లలో సబ్‌వే, స్ట్రీట్‌కార్నర్, జనాలు ఎక్కువగా కనిపించే చోట్లలో పుస్తకాలు పెట్టడం మొదలుపెట్టింది. ఈ ప్రయత్నం మంచిఫలితాన్ని ఇచ్చింది.

‘ఒక మంచి పుస్తకం చదివాను... అనే భావన కంటే ఒక మంచి పుస్తకాన్ని చాలామందితో చదివించాను అనే భావన ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది’ అంటుంది ఎమ్మా.

మళ్లీ దిల్లీ దగ్గరకు వద్దాం. ఎమ్మా వాట్సన్‌లాగే శృతిశర్మకు కూడా పుసక్తపఠనం అనేది చాలా ఇష్టం. అయితే చిన్నప్పుడు ఆమెకు అదొక ఖరీదైన వ్యవహారం. అయినప్పటికీ ఏదో రకంగా పుస్తకాలు సేకరించి చదివేది. ఇప్పుడు పుస్తకాలు కొనడానికి ఆర్థికసమస్య అంటూ లేకపోయినా తానే కాదు పదిమంది చేత పుస్తకాలు చదివించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయానికి రావడానికి రెండు కారణాలు. 1. ఎమ్మా వాట్సన్‌ 2. మెట్రో రైలు లో ప్రయాణం.

ఒకరోజు తాను మెట్రోలో ప్రయాణం చేస్తోంది. ఎటు చూసినా సెల్‌ఫోన్‌ లో మాట్లాడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండేది? కొందరు న్యూస్‌పేపర్స్‌ చదివేవారు. కొందరు వీక్లీ చదువుకునే వారు. కొందరు పుస్తకాలు చదువుతూ కనిపించేవారు. ఈ సమయంలోనే తనకు పుస్తకాల ఆలోచన వచ్చింది. మొదటి ప్రయత్నంగా ప్రముఖ రచయిత్రి జంపా లహిరి పుస్తకాలను మెట్రో స్టేషన్, ట్రైన్‌లలో పెట్టింది. ఈ విషయంలో భర్త తరుణ్‌ చౌహాన్‌ కూడా తనకు సహాయంగా నిలిచాడు.

‘తమ ఎదురుగా పుస్తకం కనిపించగానే ఆబగా చదవకపోవచ్చు. మొదటిసారి పుస్తకాన్ని ఇటూ అటూ తిరగేయవచ్చు. రెండోసారి ఆసక్తిగా కనిపించే భాగాలను చదవాలనిపించవచ్చు. మూడోసారి పుస్తకం మొత్తం చదవాలనిపించవచ్చు. ఆ తరవాత మరిన్ని పుస్తకాలు చదవాలనే ఆలోచన రావచ్చు’ అంటోంది శృతిశర్మ. అయితే ఆమె ప్రయత్నం వృథా పోలేదు. పుస్తకాలు చదివిన వాళ్లు ఆమెకు కృతజ్ఞత పూర్వకంగా ఫోన్‌లు చేస్తుంటారు. అంతేకాదు, శృతిశర్మను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది తాము కూడా ట్రైన్‌లో ప్రయాణికులు  చదవడానికి బుక్స్‌ అందుబాటులో పెడుతున్నారు.  

మరిన్ని వార్తలు