SK Bhandari: ఢిల్లీ డాక్టర్‌ ఎస్‌. కె. భండారీ

15 May, 2021 00:00 IST|Sakshi

కొన్ని ఊళ్లు కొందరు డాక్టర్‌లను గుర్తుకు తెస్తాయి. అలాగే కొందరు డాక్టర్లు కొన్ని ఊళ్లను గుర్తుకు తెస్తారు. ఎస్‌.కె.భండారీ సుమారు అరవై ఏళ్ల పాటు ఢిల్లీలోమంచి డాక్టర్‌గా, ఢిల్లీ డాక్టర్‌గా గుర్తింపు పొందారు. అలాగే ఆమెకు ఉన్న మరొక గుర్తింపు.. ప్రియాంక, రాహుల్‌ గాంధీలు ఆమె చేతుల మీదుగానే జన్మించడం!

న్యూఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌ వెబ్‌ సైట్‌లోకి వెళ్లి ‘ఆబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ’ విభాగంలో డాక్టర్‌ల జాబితాను చూస్తే అక్కడ ఇప్పటికీ డాక్టర్‌ భండారి ఫొటో కనిపిస్తూ ఉంటుంది. 86 ఏళ్ల డాక్టర్‌ ఎస్‌.కె.భండారీ గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు అదే హాస్పిటల్‌కు అనుబంధంగా ఉన్న సర్‌ గంగారామ్‌ కాల్మెట్‌ హాస్పిటల్‌లోని కరోనా వార్డులో మరణించారు.

రెండు వారాల క్రితం గుండెకు సంబంధించిన అనారోగ్యాలతో ఆసుపత్రిలో చేరారు డాక్టర్‌ భండారీ. వాటికి చికిత్స జరుగుతూ ఉండగానే కోవిడ్‌తో అంతిమశ్వాస వదిలారు. అయితే ఆ ఆసుపత్రికి ఆమె అందించిన సేవల స్మృతులు ఎప్పటికీ అక్కడివారిని వదిలి వెళ్లేవి కావు. అందుకు ప్రతీకాత్మకంగానే అన్నట్లుగా వెబ్‌సైట్‌లోని డాక్టర్‌ల ఫొటోల మధ్య ఆమె స్థానం చిరస్మరణీయంగా ఉండి ఉంటుంది. 

డాక్టర్‌ భండారీ గత 58 ఏళ్లుగా ఆ ఆసుపత్రి లో ప్రసూతి వైద్యురాలిగా (ఆబ్‌స్టెస్ట్రీషియన్‌), స్త్రీల వైద్య నిపుణురాలిగా (గైనకాలజిస్ట్‌) పని చేస్తున్నారు. లండన్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తవగానే నేరుగా ఆమె ఢిల్లీ వచ్చి సర్‌ గంగారామ్‌ ఆసుపత్రిలో వైద్యురాలిగా చేరిపోయారు. ఆసుపత్రిలో తొలిసారి ‘ఆబ్‌స్టెట్రిక్స్, గైనకాలజీ’ విభాగాన్ని నెలకొల్పింది కూడా డాక్టర్‌ భండారీనే! ఐవీఎఫ్‌లో తను నిపుణురాలు కానప్పటికీ హాస్పిటల్‌లో ఒకటంటూ ఆ విభాగం ఉండాలని పట్టుపట్టి ఐవీఎఫ్‌ను ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం గంగారామ్‌ ఆసుపత్రి ఛైర్మన్‌ డి.ఎస్‌. రాణా.

నలభై ఏభయ్యేళ్ల క్రితం ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు.. ఢిల్లీలో మంచి గైనకాలజిస్టులుగా రెండే పేర్లు వినిపించేవట. ఒకరు డాక్టర్‌ భండారీ. ఇంకొకరు డాక్టర్‌ శీలా మెహ్రా. శీల మూల్‌చంద్‌ మెడిసిటీలో చేసేవారట. డాక్టర్‌ భండారీ తనకు తల్లి లాంటి వారనీ, ఆమె మరణం తనకు తీరని లోటు అని రాణా ఆవేదన చెందారు. డాక్టర్‌ భండారీ భర్త రిటైర్డ్‌ ఆఫీసర్‌. 97 ఏళ్లు. ప్రస్తుతం ఆయన కోవిడ్‌ వార్డులో ఐసీయులో ఉన్నారు. భార్య చనిపోయిన విషయాన్ని వెంటనే ఆయనకు చేరవేసే సాహసాన్ని ఎవరూ చేయలేకపోయారు. ఒకటే కూతురు. కొన్నాళ్లుగా ఆమె తన తల్లిదండ్రుల దగ్గరే ఉండి వైద్యసేవలు అందిస్తున్నారు. ఆమె కూడా వైద్యురాలే. 

డాక్టర్‌ భండారీని గుర్తు చేసుకుంటున్న చాలామందిలో ఆ ఆసుపత్రి ఐవీఎఫ్‌ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ అభా మంజుదార్‌తోపాటు, ఆసుపత్రి బయట ప్రియాంక, రాహుల్‌ గాంధీ వంటి వాళ్లు కూడా ఉన్నారు. ఆ అన్నాచెల్లెళ్లకు డాక్టర్‌ భండారీనే తన చేతుల మీదుగా జన్మనిచ్చారు. ప్రియాంక కొడుకు, కూతుళ్లకు ఆమే పురుడు పోశారు. అందుకే కావచ్చు డాక్టర్‌ భండారీ మరణం గురించి తెలియగానే ఆమెతో తనకున్న అనుబంధాన్ని, వృత్తి పట్ల ఆమె అంకితభావాన్ని గుర్తు చేసుకుంటూ.. డాక్టర్‌ భండారీ తన డెబ్బై ఏళ్ల వయసులోనూ సొంతంగా కారు నడుపుకుంటూ ఉదయాన్నే డ్యూటీకి వెళుతుండేవారని ప్రియాంక  నివాళులు అర్పించారు. ఇక డాక్టర్‌ అభా మజుందార్‌ 1987 నుంచి భండారీతో కలిసి పని చేస్తున్నారు. డాక్టర్‌ భండారీ రాంచీలో తన తల్లి జయంతి కార్యక్రమంలో తన చేత ప్రత్యేకంగా ప్రసంగం ఇప్పించారని అభా గుర్తు చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు