డెలివరీ బాక్స్‌లో ముసిముసి నవ్వుల ‘చిన్నారి’

1 Apr, 2021 00:20 IST|Sakshi

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలామంది తల్లులు తమ చంటి పిల్లల్నీ ఎదరు పొట్టకుగానీ వెనుక వీపు మీద కట్టుకుని పనిచేస్తూ.. జీవనం సాగిస్తూంటారు. ఇది మనం రెగ్యులర్‌గా ఎక్కడో ఒకదగ్గర చూస్తూనే ఉంటాము. యాచించే స్త్రీలు అయితే పిల్లల్ని చూపిస్తూ డబ్బులు అడుగుతుంటారు. అయితే చైనాలో ఓ తండ్రి మాత్రం తన ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో చంటిబిడ్డను వెంటబెట్టుకుని మరీ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ చిన్నారి పాప కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ.. తండ్రితోపాటు తనుకూడా వస్తువులను డెలివరీ చేస్తోంది. ఈ విషయం ఆనోటా ఈ నోటా సోషల్‌ మీడియాకు చేరడంతో ప్రస్తుతం ముసిముసి నవ్వుల డెలివరీ గార్ల్‌ ‘బుజ్జాయి’ నెటిజన్‌లను తెగ ఆకర్షిస్తోంది.

చైనాకు చెందిన లీ యువాన్‌  డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. రోజూ తన స్కూటర్‌ మీద వస్తువులను డెలివరీ చేసే యువాన్‌ తన రెండేళ్ల కూతుర్ని డెలివరీ బాక్స్‌లో  కూర్చోబెట్టుకుని విధులు నిర్వహిస్తున్నాడు. డెలివరీ బాక్స్‌లో తన కూతురి కోసం డయపర్‌లు, తను తినే ఫుడ్‌ను తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు తను ఎటు వెళ్తే అటు తీసుకెళ్తున్నాడు. రోజూ తను ఎక్కడకు వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది తెలియని పసిమనుసు..ఎవరైనా చూడగానే అందంగా నవ్వుతూ హాయ్‌ చెబుతోంది. లీయువాన్‌ మాట్లాడుతూ..‘‘తన కూతురు లీ ఫెర్రీ ఐదు నెలల వయసు ఉన్నప్పుడు తనకి నిమోనియా ఉన్నట్లు తెలిసింది. అప్పటి నుంచి తన చికిత్సకు చాలా ఖర్చవుతోంది.

సేవింగ్స్‌లో ఎక్కువ భాగం ట్రీట్‌మెంట్‌కే కేటాయిస్తున్నాం. భార్యాభర్తలు ఇద్దరం కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఈ క్రమంలోనే లీఫెర్రీనీ చూసుకునేవారు ఎవరూ లేకపోవడంతో ఉదయం తనని తనతోపాటు తీసుకెళ్తాను. సాయంత్రానికి ఇంటికి వచ్చాక లీఫ్రెర్రీ రాత్రంతా అమ్మతో గడుపుతోంది’’ ఇలా తనని చూసుకునే సమయాన్నీ షేర్‌ చేసుకున్నాము’’ అని లీయువాన్‌ చెప్పాడు. లీ ఫెర్రీ ఆరునెలల వయసు ఉన్నప్పటినుంచే తనని నా డెలివరీ బాక్స్‌లో కూర్చోపెట్టుకుని విధులు నిర్వహిస్తున్నాను. ఇది కాస్త కష్టంగా ఉన్నప్పటికీ మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలతో ముందుకు సాగుతున్నాను. ప్రస్తుతం ఫెర్రీ పెద్దది అయ్యింది. రెండేళ్లు నిండడంతో తను ఇప్పుడు నడవ గలుగుతుంది. దీంతో తనని వెనుకాల కూర్చోపెట్టుకుని తీసుకెళ్లగలుగుతున్నాను’’అని లీ చెప్పాడు. ప్రస్తుతం నడుస్తోన్న ఫెర్రీ తండ్రితోపాటు డెలివరీ చేసేందుకు తెగ ముచ్చటపడుతూ తండ్రి వెనక హుషారుగా కూర్చుంటోంది. నెలల పసికందునుంచి రెండేళ్ల చిన్నారివరకు ఫెర్రీ డెలివరీ చేయడానికి వెళ్లిన వీడియోలు వైరల్‌ అవుతుండడంతో నెటిజన్లు లీయువాన్‌ను అభినందిస్తున్నారు.   

మరిన్ని వార్తలు