పండ్ల రసాలు ఎక్కువగా తాగుతున్నారా.. ప్రమాదంలో పడ్డట్టే

12 Sep, 2021 14:04 IST|Sakshi

ఇటీవల మనలో ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. దాంతో మంచి ఆరోగ్యం కోసం మంచి జీవనశైలితో పాటు పండ్లూ ఫలాలూ తినడం, ఇతరత్రా ఆరోగ్యకరమైన మార్గాలను అనుసరించడం పరిపాటిగా మారింది. ఇందులో కొన్ని ఒంటికి మంచివేగానీ... పంటికి అంతగా మంచివి కాకపోవచ్చు. వాటిని తెలుసుకుని ఒంటినీ, పంటినీ కాపాడుకుందాం.

పండ్లు / పండ్ల రసాలతో అప్రమత్తంగా ఉండండి.. 
తాజా పండ్ల రసాలతో మంచి ఆరోగ్యం సమకూరుతుందంటూ చాలామంది ఫ్రూట్‌జ్యూసులు ఎక్కువగా తాగేస్తుంటారు. వాటిల్లో ఆరోగ్యాన్నిచ్చే పోషకాలతో పాటు... కొన్ని అనారోగ్య కారకాలూ ఉంటాయి. ఉదాహరణకు అందులోని చక్కెర మోతాదులు పళ్లను ఎక్కువగా దెబ్బతీయవచ్చు. అలాగే ఒకింత పుల్లగా ఉండే పండ్లలోని యాసిడ్స్‌ వల్ల కూడా పళ్లు దెబ్బతింటాయి.

ఇలా చేయండి... పండ్లను జ్యూస్‌ రూపంలో తాగడం కంటే కొరికి తినడం మేలు. ఉదాహరణగా చెప్పాలంటే... నారింజ/బత్తాయి పండ్లు కొరికి తిన్నదానికంటే చక్కెర కలిపిన ఆరెంజ్‌ పండ్లరసంతో పళ్లు పాడయ్యే అవకాశం చాలా ఎక్కువ. పళ్లు బలహీనంగా ఉన్నవారు ఒకవేళ జ్యూస్‌ రూపంలో తాగాలనుకుంటే... అందులో ఎట్టిపరిస్థితుల్లోనూ చక్కెర కలుపుకోవద్దు. అలాగే జ్యూస్‌ తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. 

చదవండి:  స్మోకింగ్‌ చేసేవారికి పొంచి ఉన్న ప్రమాదం.. ఈ సమస్యలు మూడు రెట్లు ఎక్కువే..

దగ్గు మందులతోనూ జాగ్రత్త అవసరం... 
దగ్గు మందును మనకు మేలు చేసే ఓ ఔషధంగానే పరిగణించినా... అది కూడా చాలా సందర్భాల్లో పైన చెప్పిన ఫ్రూట్‌ జ్యూస్‌లాంటి ముప్పునే తెచ్చిపెడుతుంది. దాంట్లోని గాఢత (జిగురు లాంటి చిక్కదనం), అందులోని చక్కెర మోతాదులు... అచ్చం జ్యూస్‌లాంటి ప్రభావాన్నే చూపుతాయి. దాంతో పళ్లు దెబ్బతినే అవకాశం ఉంది.  


ఇలా చేయండి.. దగ్గు మందు తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. వేలితో దాని జిగురుదనమంతా పోయేలా నోరు శుభ్రం చేసుకోవాలి. ఇలా దగ్గుమందు తాగిన ప్రతిసారీ నోరు కడుక్కోవాలి. 

గుండెకు మేలు చేసే చాక్లెట్లతోనూ జాగ్రత్త... 
డార్క్‌ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయి. వాటిని పరిమితంగా తినడం అన్నది గుండె ఆరోగ్యానికి దోహదం చేసే అంశం. సాధారణంగా చాక్లెట్లు పళ్లకు చుట్టుకుపోయేలా ఒకింత జిగురుగా / జారుడుగా ఉంటాయి. అలా చుట్టుకుపోవడం వల్ల అవి తమలోని చక్కెరను చాలాసేపు పంటిపైనే అంటిపెట్టుకునే ఉండేలా చేస్తాయి. దాంతో పళ్ల ఎనామిల్‌ పొర దెబ్బతినే అవకాశాలతో పాటు, పళ్లలో రంధ్రాలు (క్యావిటీలు) పడే అవకాశాలెక్కువ. ఫలితంగా పిప్పిపళ్లు వస్తాయి. అలా దంతాలు దెబ్బతింటాయి.


సమస్యను తప్పించుకోండిలా... పంటిని చుట్టుకుపోయేలా ఉండే చాక్లెట్లు, క్యాండీలు కాకుండా ఒకింత జిగురు తక్కువగా ఉండే వాటినే తినాలి. చాక్లెట్లు తిన్న తర్వాత  ఆ జిగురంతా పోయేలా వేలితో లేదా టూత్‌ బ్రష్‌తో తేలిగ్గా బ్రష్‌ చేసుకుని నోరు పూర్తిగా శుభ్రమయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి.

చదవండి: Dry Throat: నోటి దుర్వాసన, దగ్గు, పుండ్ల సమస్యా.. ఇలా చేస్తే..

మరిన్ని వార్తలు