చదువు వేరైనా.. అనుభవం లేకున్నా..పట్టుదలతో రాణించింది!

4 May, 2022 00:12 IST|Sakshi
డాక్టర్‌ సిమ్రన్‌ మన్‌ సచ్‌దేవ

చదివిన డిగ్రీలకు సంబంధించిన ఉద్యోగాలు చేసేవాళ్లు కొందరైతే, తమ చదువు, అర్హతలకు సంబంధం లేని రంగాల్లో  ప్రవేశించి రాణించేవాళ్లు మరికొందరు. చూడగానే ఇట్టే పట్టేసే నేర్పరితనం, విభిన్నంగా ఆలోచించే శైలి, చక్కని పరిశీలనా శక్తి ఉంటే వృత్తిలోనే కాదు, అనుభవం లేని వ్యాపారంలో కూడా అవలీలగా రాణించవచ్చని నిరూపించి చూపిస్తోంది ఢిల్లీకి చెందిన ఎంట్రప్రెన్యూర్‌ డాక్టర్‌ సిమ్రన్‌ మన్‌ సచ్‌దేవ. డెంటల్‌ సర్జన్‌గా పనిచేసిన సిమ్రన్‌ విభిన్న ఆలోచనతో ఏకంగా చెప్పులు, షూలు విక్రయించే స్టార్టప్‌ను ప్రారంభించింది. వృత్తిరీత్యా వైద్యురాలు అయినప్పటికీ పరిస్థితుల దృష్ట్యా స్టార్టప్‌ను ఏర్పాటు చేసి చక్కగా నడిపిస్తూ లాభాలను ఆర్జిస్తూ, ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. 

చండీగఢ్‌లో న్యాయసంబంధ మూలాలున్న కుటుంబంలో పుట్టింది సిమ్రన్‌. కుటుంబ సభ్యుల ఆలోచనలకు ఎప్పుడూ భిన్నంగా ఆలోచించే సిమ్రన్‌కు చిన్నప్పటి నుంచి పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. పెద్దయ్యాక వెటర్నరీ డాక్టర్‌ కావాలనుకుంది. ఇంటర్మీడియట్‌ తర్వాత వెటర్నరీ ఇంటర్న్‌ షిప్‌ చేసింది. కానీ ఆమెకు అంతగా నచ్చకపోవడంతో అమెరికాలో డెంటల్‌ సర్జరీ డిగ్రీ చేసింది. చదువు పూర్తయ్యాక ఢిల్లీలో మూడేళ్లపాటు పనిచేసింది. తర్వాత పెళ్లి అయ్యి పిల్లలు పుట్టడడంతో వారిని చూసుకోవడంతో బిజీగా ఉంటూ తన వృత్తికి విరామం ఇచ్చింది. పిల్లలకు ఐదేళ్లు వచ్చాక.. స్కూల్లో చేర్పించింది. స్కూలుకెళుతోన్న పిల్లలకు తన బంధువులు, స్నేహితులతో విదేశాల నుంచి రకరకాల చెప్పులు, షూస్‌ తెప్పించి వేసేది. కానీ అవి కొద్దినెలల్లోనే పాడవుతుండేవి. దీంతో తరచూ షూస్‌ కొనాల్సి వచ్చేది. ఇండియా లో కొన్న చెప్పులు ఎక్కువ కాలం ఉంటున్నాయి. కానీ విదేశాల నుంచి తెచ్చినవి ఎక్కువ కాలం ఉండడంలేదు. మనదేశం లో చెప్పులుగానీ, షూస్‌ గానీ ఒకసారి కొన్నామంటే రెండుమూడేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఇక్కడ మాత్రం ఎంత ఖరీదు పెట్టి కొన్నప్పటికీ మూడు నెలల్లోనే పాడవుతున్నాయి. అక్కడ నుంచి నాసిరకం చెప్పులను ఎందుకు తెచ్చుకోవాలి. మనదేశంలో తయారైన నాణ్యమైన షూలను నేనెందుకు విక్రయించకూడదన్న ఆలోచన వచ్చింది సిమ్రన్‌కు. 

కజార్‌మ్యాక్స్‌ 
ఏమాత్రం అనుభవం లేని వ్యాపారం ఎలా చేయాలి అనుకుంటూనే చెప్పుల బిజినెస్‌ ప్రారంభించడానికి అనేక పుస్తకాలు చదివి అవగాహన పెంచుకుంది. తరవాత వస్త్ర వ్యాపారం చేస్తోన్న తన మామగారి దగ్గర కొన్ని సలహాలు సూచనలు తీసుకుని 2017లో ‘కజార్‌మ్యాక్స్‌’ పేరుతో ఫుట్‌వేర్‌ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇండియాలో దొరికే ముడి పదార్థాలతో పిల్లల చెప్పులు, షూస్‌ను నాణ్యంగా రూపొందించి ‘లోకల్‌ ఫర్‌ వోకల్‌’ పేరిట విక్రయిస్తోంది. పర్యావరణ హితంగా, తక్కువ ధరలో నాణ్యమైన చెప్పులు దొరుకుతుండడంతో అతికొద్దికాలంలోనే ఏడు లక్షల రూపాయలతో ప్రారంభించిన కజార్‌ మ్యాక్స్‌ ఇరవై కోట్లరూపాయల టర్నోవర్‌కు చేరుకుంది. కజార్‌మ్యాక్స్‌ బ్రాండ్‌ ఉత్పత్తుల తయారీ లో ఎటువంటి జంతుచర్మాలనూ ఉపయోగించడంలేదని పెటా కూడా ఈ బ్రాండ్‌కు అనుమతి ఇచ్చింది. క్లాత్, కొన్ని రకాల ప్లాస్టిక్, రబ్బరుతో ఆకర్షణీయమైన రంగులతో చెప్పులు, షూస్‌ తయారు చేసి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ మాధ్యమాల్లో విక్రయిస్తోంది. 
 

‘‘సమయం, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఒక్కోసారి మన చదువుకు సంబంధం లేని పనులు చేయాల్సి ఉంటుంది. వాటిని అనుసరించి నడిస్తే భవిష్యత్‌ బావుంటుందనుకున్నప్పుడు ఏది ఎంచుకున్నా తప్పుకాదు. నాకు వ్యాపార అనుభవం లేకపోయినప్పటికీ పుస్తకాలు, ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసి అనేక విషయాలు నేర్చుకున్నాను. జీవితాల్లో అనేక మలుపులు, ఆటుపోట్లు వస్తాయి. వాటిని సానుకూలంగా మలుచుకుంటూ ముందుకు సాగాలే గానీ, అక్కడే ఆగిపోకూడదు. ఏది చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందో దానిని క్రియేటివ్‌ గా చేసుకుంటూ ముందుకు సాగితే, విజయం దానంతట అదే వస్తుంది’’ అని చెబుతూన్న సిమ్రన్‌ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.  

మరిన్ని వార్తలు