Numer8: సముద్రం సాక్షిగా... మత్స్యకారులకు ఉపయోగపడే స్టార్టప్‌

11 Dec, 2022 07:44 IST|Sakshi

మౌనంగా కనిపించే సముద్రం ఒక మహా విద్యాలయం. అక్కడ ప్రతి కెరటం ఒక పాఠం నేర్పుతుంది. ఒక ప్రాజెక్ట్‌ కోసం పనిచేస్తున్న క్రమంలో దేవ్‌లీనా భట్టాచార్జీ మత్స్యకారుల జీవితాలను దగ్గరి నుంచి చూసింది. సముద్రం సాక్షిగా మత్స్యకారులకు ఉపయోగపడే స్టార్టప్‌ గురించి ఆలోచించింది. ‘న్యూమర్‌8’ రూపంలో ఆమె కల సాకారం అయింది... 

యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఇఎస్‌ఎ)లో ఒక ప్రాజెక్ట్‌లో భాగంగా పనిచేస్తున్నప్పుడు దేవ్‌లీనా భట్టాచార్జీకి మత్య్సకారుల జీవన విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం వచ్చింది. మత్స్యకారుల సంక్షేమం కోసం డాటాసైన్స్‌ను ఎలా ఉపయోగించవచ్చు... అనే కోణంలో మేధోమథనం చేస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అది ‘న్యూమర్‌8’ పేరుతో స్టార్టప్‌కు శ్రీకారం చుట్టడానికి కారణం అయింది.

వాతావరణ సూచనల నుంచి మార్కెట్‌ సూచనల వరకు ఎన్నోరకాలుగా మత్స్యకారులకు ఉపయోగపడే స్టార్టప్‌ ఇది. బెంగళూర్‌ యూనివర్శిటీలో ఎంసీఏ చేసినా లీనాకు రకరకాల సమస్యలకు సంబంధించి సృజనాత్మక పరిష్కారాల గురించి ఆలోచించడం అంటే ఇష్టం. ఎవరి సహాయం లేకుండానే తన పొదుపు మొత్తాలతో ‘న్యూమర్‌ 8’ను మొదలుపెట్టింది. డాటా సైంటిస్ట్‌లు, జియోగ్రాఫిక్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సిస్టం (జిఐఎస్‌) నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రతిభావంతురాలైన నందిని కార్తికేయన్‌ను సీటీవోగా నియమించింది.

సీయీవోగా లీనా స్టార్టప్‌కు సంబంధించిన రోజువారి వ్యాపారవ్యవహారాలను పర్యవేక్షిస్తే, సీటీవోగా నందిని సాంకేతిక విషయాల బాధ్యతలను చూస్తుంది. ‘న్యూమర్‌ 8’లోని ‘వోఫిష్‌’ యాప్‌లో అడ్వైజరీ, మార్కెట్‌ లింకేజి, ఇన్సూరెన్స్, ఫైనాన్స్‌ విషయాలలో మత్స్యకారులకు ఉపయోగపడే ఫీచర్‌లు ఉన్నాయి. ‘వోఫిష్‌’ శాటిలైట్‌ ఇమేజ్‌ డాటా ఎనాలసిస్‌ అనేది మత్య్సకారులకు చేపల వేటలో ఉపయోగపడుతుంది. వేటకు ఎక్కువ సమయం తీసుకోకపోవడమే కాదు, ఇంధనాన్ని పొదుపు చేయడంలో ఉపయోగపడుతుంది.

‘వోఫిష్‌’లోని మార్కెట్‌ లింకేజ్‌ ఫీచర్‌తో మత్స్యకారులకు అవసరమైన వలలు, కోల్డ్‌ స్టోరేజ్‌ సౌకర్యాల ఏర్పాటుకు వీలవుతుంది. దీంతోపాటు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మత్స్యకారులు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌ డిస్ట్రిబ్యూటర్‌లకు అమ్ముకోవచ్చు.

‘న్యూమర్‌8’ తాజాగా సముద్రపు నాచుపై దృష్టి పెట్టింది. ఔషధ, ఆహార, రసాయనిక పరిశ్రమలలో ప్రపంచవ్యాప్తంగా సముద్రపు నాచుకు డిమాండ్‌ పెరుగుతున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్రలోని ‘మహిళా ఆర్థిక్‌ వికాస్‌ మహామండల్‌’ అనే స్వచ్ఛందసంస్థ భాగస్వామ్యంతో మత్య్సకారుల కుటుంబాలకు చెందిన మహిళలకు సముద్రపు నాచు ఉత్పత్తుల ద్వారా ఉపాధి కల్పించే ప్రణాళికను న్యూమర్‌ 8 సిద్ధం చేసింది.
చదవండి: Expiry Date: ఎక్స్‌పైరీ డేట్‌ ఎందుకు? ఆ తర్వాత వాడితే ఏమవుతుందో తెలుసా!

మరిన్ని వార్తలు