శివాలయంలో సేవానందలహరి

7 May, 2021 07:31 IST|Sakshi

శివోహం

మనలో చాలామంది భక్తులు ఆలయాలకు వెళ్తుంటారు. రోజూ, లేక వారానికోసారి, ఏదైనా పండుగలు, ఉత్సవాలు జరిగే సమయంలో ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తుంటారు. ఏవైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకుంటారు లేదా విశేష ఆర్జితసేవలు జరిపించుకుంటారు. అయితే మనం ఆలయాలకు వెళ్లి ఇంకా ఎన్నో సేవలు స్వయంగా ఆచరించి శివాలయ నిర్మాణం చేస్తే.. నిర్వహణ చేస్తే.. పునరుద్ధరణ చేస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో దానితో సమానమైన ఫలితాలు శివాలయసేవ ద్వారా పొందవచ్చు. అటువంటి కొన్ని సేవలు.. వాటి ఫలితాలు ఇవి..

ఆవుపేడతో అలికి ముగ్గులు పెడితే..
ఆవుపేడ లక్ష్మీ నిలయంగా భావిస్తాం మనం.  అందుకే ఆలయాన్ని శుభ్రంగా ఆవుపేడతో అలికితే కూడా ఎంతో గొప్ప ఫలితం ఉంది. మలినం కాని ఆవుపేడనే తీసుకోవాలి. గోమయంతో శివాలయ పరిసర ప్రాంతాన్ని చక్కగా అలికితే తమ పూర్వీకులు తరించి గోలోకం చేరుకుంటారు. చక్కగా రంగవల్లులు (ముగ్గులు) తీర్చిదిద్ది పంచరంగులతో అలంకరిస్తే చేసిన వారు.. వారి కుటుంబ సభ్యులతో సహా సిరిసంపదలతో తులతూగుతారు.

దూరం నుండి దర్శిస్తే చాలు...
అల్లంత దూరంలో ఆలయశిఖరం కనిపిస్తే చాలు. అమాంతం మన రెండు చేతులు ఒకదానికొకటి కలిసి నమస్కరిస్తాయి. అదే మన చిన్ననాటి నుండి మన పెద్దలు మనకు నేర్పిన ధర్మం. దానివలన ఏడుజన్మలలో తాను చేసిన పాపాలనుండి వెంటనే విముక్తుడౌతాడు. రెండుచేతులు జోడించిన వెంటనే మనలోని అహంకారం తొలగి దైవసాక్షాత్కారం కోరి మనస్సు పరితపిస్తుంది. అప్పుడే మనం ఆ దైవాన్ని దర్శించేందుకు పరిపూర్ణమైన యోగ్యత సంపాదించుకున్నవాళ్లమౌతాం.

నీటితో కడిగి.. అద్దంలా తుడిస్తే...
ఆలయాన్ని నీటితో కడిగితే ఆ ప్రాంతమంతా పరిశుద్ధమౌతుంది. అటువంటి ఆలయాన్ని కడిగే నీటిని మాత్రం వడగట్టి తీసుకోవాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. వస్త్రంతో వడగట్టిన నీటితో ఆలయాన్ని పరిశుభ్రం చేసినవారు సజ్జనులు. అతడు యోగియై శివుని చేరుకుంటాడు. అలాగే శివాలయం నేలను అద్దం లా తుడవాలి. ఎంతలా అంటే నేలపై తన ప్రతిబింబం కనపడేంతగా.

వెల్ల వేయించి.. దీపాలు వెలిగిస్తే...
శివాలయానికి, ప్రాకారం గోడలకు సుధాకర్మ (సున్నం పూయించడం) చేయించినవారికి ఆలయనిర్మాణం చేసిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం విడువకుండా, పాలవంటి తెల్లసున్నంతో లేదా వేరే రంగులతో అందంగా వెల్లవేయించినా శివలోకవాసం లభిస్తుంది. అలాగే ఆలయంలోని గోడలకు సుగంధాలు పూయడం, గుగ్గిలంతో ధూపం వేయడం కూడా ఆలయసేవలో భాగాలే. ఆలయం ఆవరణలో దీపాలు వెలిగించడం, దానికి కావలసిన ద్రవ్యాలను అందించడం, మొదలైన సేవలు ముఖ్యమైన సేవలు. 

శివరూపాలను చిత్రిస్తే...
మనం ఆలయగోపురాలపై అనేక శిల్పాలు చూస్తుంటాం. అలాగే ప్రాచీన ఆలయాల్లో అనేక శివరూపాలు చిత్రించి ఉంటాయి. ఉదాహరణకు మన రాష్ట్రంలో లేపాక్షి, తమిళనాడులోని మధురై దేవాలయం పై భాగంలో తలెత్తి చూస్తే అనేక దేవుళ్ల చిత్రాలు గమనించే ఉంటారు. అలా మనం కూడా ఆలయాల్లో దేవుడి చిత్రాలు చిత్రింపచేయడం ఒక కర్తవ్యం గా నెరవేర్చాలి. అలా ఎన్ని బొమ్మలు చిత్రిస్తారో అంతకాలం రుద్రకాలంలో ప్రకాశిస్తారు.

రంగు రంగుల పూలమాలలతో అలంకరిస్తే... 
ఆలయం తోరణాలకు, గోడలకు, కొన్ని మండపాలు, స్తంభాలను పూలతో అలంకరించడం ఒక గొప్పసేవ. అలా చేస్తే ఆ మనిషి రుద్రలోకం చేరతాడని చెప్పబడింది. శివాలయాన్ని రకరకాల పుష్పాలతో అలంకరించినా.. అందంగా తీర్చిదిద్దినా..ఎంత ప్రదేశం తీర్చిదిద్దాడో దాన్ని అంగుళాలతో కొలిచి అంతకాలం రుద్రలోకంలో నివసిస్తారని చెప్పబడుతోంది. అలాగే శివపూజా కైంకర్యాలకోసం పుష్పవనాలను పాదుగొల్పినా.. రకరకాలైన పూల చెట్లను నాటి వాటిని సంరక్షించినా అది కూడా పుష్పకైంకర్యం లెక్కలోకే వస్తుంది కనుక భక్తులు ఈ ప్రయత్నం కూడా చేయాలి.

ఆలయపరిసరాల్ని పరిశుభ్రం చేస్తే... 
పరిశుభ్రమైన మనసు ఉంటేనే పరమేశ్వరుని దర్శనం లభిస్తుందని భా వించే మనం.. మరి భగవంతుని నిలయమైన శివాలయానికి వెళ్లి అక్కడ అపరిశుభ్రంగా ఉంటే.. ఆలయంలో పశువులు తిరుగుతుంటే.. మనమేం చేయాలి? అప్పుడు భక్తులు అక్కడ ప్రాణులు, పశువులను కొట్టకుండా.. చప్పట్లు చరుస్తూ నోటితో అరుస్తూ వాటిని బయటకు పంపి ఆ పరిసరాన్ని మెత్తటి మార్జని(చీపురు)తో పరిశుభ్రం చేయాలి. అలా చేస్తే గొప్పదైన చాంద్రాయణవ్రతం ఆచరించిన ఫలితం కలుగుతుందని శివధర్మశాస్త్రం చెప్పింది. 

మన ఊరి ఆలయాన్నే మెరుగు చేద్దాం..
మన ఊరిలో మన పెద్దలు ఎంతోకాలం ముందుగానే మనకోసం అనేక ఆలయాలను నిర్మించారు. వాటిని మనం కేవలం దర్శించడమే కాదు. పాలించాలి కూడా. అలాగే వైభోగంగా వెలిగే ఆలయాలనే కాదు. ఒకపూట దీపారాధనకి కూడా అవకాశం లేని ఎన్నో ఆలయాల్లో మనవంతు ఆలయసేవగా మనం చేయాల్సింది మనం తప్పకుండా చేయాలి. ఇలాంటి అన్ని సేవలు అనేక క్షేత్రాల్లో ఉన్న పెద్ద దేవాలయాలలో చేయడానికి నేడు రేపు ఎంతోమంది భక్తులు ముందుకొస్తున్నారు. కానీ అదే సేవ మన పల్లెల్లో, గ్రామాల్లో ఉండే ఆలయాలపట్ల మనం ఎంత శ్రద్ధ వహిస్తున్నాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇలా చేస్తే ప్రతీ దేవాలయం దివ్య భవ్య శోభలతో అలరారుతుంది. భక్తులకూ కల్పవృక్షమై నిలుస్తుంది.
– శాస్త్ర ప్రవీణ కె.వి.సత్యబ్రహ్మాచార్య 

మరిన్ని వార్తలు