పరలోక సాఫల్యం దిశగా...

13 Feb, 2023 01:40 IST|Sakshi

సృష్టిలోని ప్రతి జీవికీ మరణం తప్పదు. ఇది సృష్టిధర్మం, ఎవరూ తిరస్కరించలేని సత్యం. నాస్తికులూ, ఆస్తికులూ అందరూ మరణాన్ని నమ్ముతారు. దేవుడున్నాడా అనే విషయంలో భేదాభి్రపాయాలున్నాయి గాని, మరణం ఉందా.. లేదా..? అనే విషయంలో ఎటువంటి భిన్నాభిప్రాయమూ లేదు. కాని,‘మరణం తథ్యం’ అని తెలిసినా మనం దాన్ని పట్టించుకోం. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు,స్నేహితులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతోమంది ప్రతిరోజు ఎక్కడో ఒకచోట పోతూనే ఉన్నారు. మనం వారి అంత్యక్రియల్లో పాల్గొని, స్వయానా మన భుజాలపై మోసి, సమాధిలో దించి, స్వహస్తాలతో వారిపై మట్టికప్పి వస్తున్నాం. వారు సంపాదించిన ఆస్తిపాస్తులు, ఆభరణాలు, హోదా, అధికారం ఏదీ వారు తమవెంట తీసుకు వెళ్ళడం లేదు. రిక్తహస్తాలతో వచ్చారు. అలానే వెళ్ళిపోతున్నారు. పవిత్ర ఖురాన్‌ ఇలా అంటోంది:

‘ఈ ్రపాపంచిక జీవితం ఒక ఆట, వినోదం తప్ప మరేమీ కాదు. అసలు జీవితం పరలోక జీవితమే. ఈ యథార్థాన్ని వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండు’ (29–64) అందుకని ప్రపంచమే సర్వస్వంగా బతక్కూడదు. ధర్మాధర్మాల విచక్షణ పాటించాలి. మంచి పనులు చేయాలి. రేపు మనల్ని కాపాడేవి ఇవే. ఎందుకంటే, మనం సంపాదించిన డబ్బూదస్కం, ఆభరణాలు, ఆస్తిపాస్తులు సమస్తం ఊపిరి ఆగిన మరుక్షణమే మనతో సంబంధాన్ని తెంచుకుంటాయి. భార్యాబిడ్డలు, బంధుగణం, మిత్రబృందం... వీరంతా మనల్ని సమాధి వరకు మాత్రమే సాగనంపుతారు. సమాధిలో దించి, మట్టిలో కలిపేసి వెళ్ళిపోతారు.

మన వెంట వచ్చేది, కాపాడేది కేవలం మనం చేసుకున్న మంచి పనులు మాత్రమే. అడ్డదారులు తొక్కి, వారినీ వీరినీ వంచించి సంపాదించేదంతా సుఖమయ జీవితం కోసమేగదా.. రేపటి మన సంతోషం, మన పిల్లల భవిష్యత్తు కోసమేగదా? అక్రమ సంపాదనలో నిజమైన సంతోషం ఉండకపోగా, అది ఎప్పుడూ మనసులో కెలుకుతూనే ఉంటుంది. అయినా అంతరాత్మను అణగదొక్కి అడ్డదారికే ్రపాధాన్యతనిస్తాం.  కేవలం కొన్ని సంవత్సరాల ్రపాపంచిక జీవితం కోసమే ఇంతగా ఆలోచించే మనం, మరి శాశ్వతమైన రేపటి (పరలోకం) కోసం ఏం సంపాదిస్తున్నామన్నది కూడా ఆలోచించాలి.

ఈ ‘రేపు’ మూన్నాళ్ళ ముచ్చట. కాని ఆ ‘రేపు ‘శాశ్వతం. దానికోసం ఏం చేస్తున్నాం.. ఏం దాస్తున్నాం? ఇదికదా అసలు ప్రశ్న. ఇహలోక జీవితం ఎలా గడిచినా పరలోక సాఫల్యం లభిస్తే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. దానికోసం ఆలోచించాలి. దానికోసం శ్రమించాలి. మంచీ చెడుల విచక్షణతో, ధర్మబద్ధంగా ముందుకు సాగితే, ఆ క్రమంలో ఎంత లభిస్తే అంతతో సంతృప్తి చెందితే అదే అసలు విజయం, అసలు సాఫల్యం.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు