శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను ఆశ్రయించగా..

12 Mar, 2021 07:26 IST|Sakshi

శ్రీకాళహస్తీశ్వర శతకం

ధూర్జటి విరచిత 

పద్యం: 25
నీ పంచంబడియుండగా గలిగిన న్బిక్షాన్నమే చాలు, ని                      
క్షేపంబబ్బిన రాజకీటకముల నే సేవింపగానోప, నా                         
శాపాశంబుల జుట్టి త్రిప్పకుము సంసారార్థమై, బంటుగా                  
చేపట్టం దయగల్గెనేని మదిలో శ్రీకాళహస్తీశ్వరా!    

భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను ఆశ్రయించగా దొరికిన భిక్షాన్నమే నాకు మహాప్రసాదం. నిధి లభిస్తుందన్న ఆశ వున్నా, ఆ పురుగుల్లాంటి రాజులను నేను ఆశ్రయించను. ఈ సంసారతాపత్రయం కోసం ఆశల తాళ్లతో నన్ను బంధించకు. నన్ను నీ సేవకునిగా స్వీకరించే దయ  నీకుంటే, నా కోరికలను తీర్చు.  

పద్యం 26
నీ పేరున్‌ భవదంఘ్రి తీర్థము భవన్నిష్ట్యూత తాంబూలమున్‌       
నీ పళ్లెంబు ప్రసాదమున్‌ గొనికదా నే బిడ్డడైనాడ  న                           
న్నీపాటిం కరుణింపు మోపనికనే నెవ్వారికిం బిడ్డగాన్‌                      
చేపట్టందగు పట్టి మానదగదో శ్రీకాళహస్తీశ్వరా!

భావం: శ్రీకాళహస్తీశ్వరా! నీ పేరు తలచుకొని, నీ పాదతీర్థాన్ని స్వీకరించి, నీ పళ్లెంలోని ప్రసాదాన్ని ఆరగించి, నీవు ఎంగిలి చేసిన తాంబూలాన్ని ఇష్టంగా తిని, నీకు కొడుకునయ్యాను కదా! ఇకపై నేను వేరెవరికీ కొడుకును కాదు. నన్ను దగ్గరగా తీసుకో! ఆ మాత్రం  కరుణ  నాపై చూపించు. పట్టి విడువరాదు సుమా !!!  
-తెలుగు తాత్పర్యం: టేకి వీరబ్రహ్మం 

మరిన్ని వార్తలు