డయాబెటిస్‌కు.. టెస్టోస్టిరాన్‌కు లింకు! 

20 Dec, 2020 13:12 IST|Sakshi

ఆస్ట్రేలియా: పురుష హార్మోన్‌ టెస్టోస్టిరాన్‌ ఇంజెక్షన్లతో మధుమేహం బారిన పడకుండా నివారించొచ్చా..? అది సాధ్యమే అంటున్నారు ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సుమారు వెయ్యి మందిపై తాము ప్రయోగాలు నిర్వహించి ఈ అంచనాకు వచ్చామని చెబుతున్నారు. ఈ స్థాయిలో ఇదివరకు ఎన్నడూ ప్రయోగాలు జరగలేదని పేర్కొంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ పురుష హార్మోన్‌ స్థాయి తక్కువగా ఉన్న వారు మధుమేహం బారిన పడొచ్చని ఇప్పటికే కొన్ని పరిశోధనలు స్పష్టం చేశాయి. టెస్టోస్టిరాన్‌ తక్కువగా ఉన్నప్పుడు లైంగిక కోరికలు తగ్గడంతో పాటు కండరాలు బలహీనపడతాయి. ఎముకలు గుల్ల బారడమూ జరుగుతుంది.

ఈ నేపథ్యంలో అడిలైడ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు చేశారు. 50 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న సుమారు వెయ్యి మందిని ఎంపిక చేసి.. రెండు గుంపులుగా విడదీశారు. ప్రయోగాలకు ఎంపికైన వారందరూ అధిక బరువు లేదా ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారే. ఒక వర్గానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి టెస్టోస్టిరాన్‌ ఇంజెక్షన్‌ ఇచ్చారు. వెయ్యి మంది అనుసరించేందుకు కొన్ని వ్యాయామాలను సూచించారు. రెండేళ్ల పరిశీలనల తర్వాత పరిశీలించగా ఇరు వర్గాల్లోని వారు సగటున నాలుగు కిలోల బరువు తగ్గారు. సుమారు 22 శాతం మందిలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎక్కువయ్యాయి. రెండో గుంపు వారిలో 21 శాతం మంది మధుమేహం బారిన పడగా.. టెస్టోస్టిరాన్‌ ఇంజెక్షన్లు తీసుకున్న వారిలో 12 శాతం మందికి మాత్రమే మధుమేహం వచ్చింది. హార్మోన్‌ తీసుకున్న వారి రక్తంలో చక్కెర మోతాదు గణనీయంగా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి మధుమేహం నుంచి తప్పించుకునేందుకు కొంతమందికి టెస్టోస్టిరాన్‌ ఇంజెక్షన్లు ఓ మార్గం కావచ్చని ఈ పరిశోధనలు చెబుతున్నాయి.

కొత్త సోలార్‌ సెల్స్‌ భలే! 
ఖరీదైన సిలికాన్‌తో తయారయ్యే సోలార్‌సెల్స్‌కు సమర్థమైన ప్రత్యామ్నాయం లభించింది.పెరోవెక్సైట్‌‌ అనే వినూత్న పదార్థంతో తయారు చేసిన సరికొత్త సోలార్‌ సెల్స్‌ ఏకంగా 30 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నట్లు తాజా పరిశోధనల ద్వారా స్పష్టమైంది. నిజానికి పెరోవెస్కైట్‌ అనేది ఇటీవలే గుర్తించిన పదార్థమేమీ కాదు. దశాబ్దకాలం కిందటే దీన్ని సౌరశక్తి ఉత్పత్తికి వినియోగించొచ్చని గుర్తించారు. కాకపోతే అప్పట్లో ఈ పదార్థంతో తయారైన సోలార్‌ సెల్స్‌ సామర్థ్యం చాలా తక్కువగా ఉండేది. పెరోవెస్కైట్‌ ప్రత్యేకత ఏంటంటే.. చాలా చౌకగా లభిస్తుంది.

దృశ్య కాంతి నుంచి పరారుణ కిరణాల వరకు అన్ని రకాల రేడియోధార్మికతను శోషించుకుని విద్యుత్తుగా మార్చగలదు. సిలికాన్‌ మాదిరిగా తయారీ కష్టం కాదు. ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జర్మనీలోని హెల్మ్‌హోల్ట్‌ –జెంట్రమ్‌ శాస్త్రవేత్తలు తయారు చేసిన పెరోవెక్సైట్‌‌ సోలార్‌ సెల్స్‌ 30 శాతం సామర్థ్యాన్ని సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదేళ్ల కింద ఈ సెల్స్‌ సామర్థ్యం 13.7 శాతం మాత్రం ఉంది.

మరిన్ని వార్తలు