Diabetes:: బార్లీ, కొర్రలు.. వేపుళ్లు, నేతి వంటకాలు.. ఏవి తినాలి? ఏవి వద్దు?

8 Oct, 2021 10:50 IST|Sakshi

ఇటీవలి కాలంలో ఎక్కువమందికి వస్తున్న జీవనశైలి వ్యాధులలో మధుమేహం ఒకటి. షుగర్‌ వ్యాధి పేరులోనే చక్కెర ఉంది కానీ, రుచికి మాత్రం చేదే. ఇది చాపకింద నీరులా కిడ్నీల పనితీరు మందగించేలా చేస్తుంది. ముఖ్యంగా కనుదృష్టిని క్షీణింపచేస్తుంది. అలాగని షుగర్‌ ఉన్న వారంతా భయపడాల్సిన పనిలేదు. చాలామంది మధుమేహం ఉన్నా దశాబ్దాల తరబడి చక్కగానే ఉంటున్నారు. అయితే ఏ వ్యాధినైనా వచ్చాక బాధపడేకంటే రాకుండా నివారించుకోవడమే చాలా మేలు. చిత్రం ఏమిటంటే బీపీ, షుగర్‌ చాలా మందికి అవి వచ్చినట్లే తెలియదు. ఏవో కొన్ని లక్షణాలను బట్టి డాక్టర్‌ దగ్గరకు వెళ్తే, వారి సలహా మేరకు పరీక్షలు చేయించుకుని ఉన్నట్లు తెలుసుకుని అప్పుడు చికిత్స తీసుకుంటున్నారు. అందువల్ల షుగర్‌ వ్యాధి లక్షణాలేమిటో, అది ఎందుకు వస్తుందో, అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం. 

లక్షణాలు 
►ఆరోగ్యవంతులు 24 గంటల కాలాన విసర్జించే మూత్ర ప్రమాణం 800 – 2500 మిల్లీలీటర్లు ఇంతకన్నాఅధికంగా మూత్రవిసర్జన జరిగితే దానిని అతి మూత్రవ్యాధిగా చెప్పవచ్చు. ఇలా అతిగా మూత్రం పోవడం అన్నది డయాబెటిస్‌కు ఒక సూచన.
►మొదటి ప్రధాన లక్షణం మాటిమాటికీ మూత్ర విసర్జన చేయాల్సి రావడం... అదీ ఎక్కువ ప్రమాణంలో. అంతేగాకుండా చెమట ఎక్కువ పట్టడం, నిద్ర పట్టకపోవడం, ఆకలి, నిస్సత్తువ, నిస్త్రాణ, ఎక్కువ దాహం కావడం, కళ్లు తిరిగినట్లుండటం, కంటిచూపు మసకబారటం వంటివి ఇందులో ప్రధాన లక్షణాలు. అలాగని ఈ లక్షణాలు ఉన్నవారందరికీ షుగర్‌ ఉందని కాదు. థైరాయిడ్‌ సమస్య ఉన్నవారిలోనూ ఇంచుమించు ఇటువంటి లక్షణాలే ఉంటాయి. అందులో అయితే గొంతు వద్ద వాపు, జుట్టు ఊడిపోవటం వంటివి అదనపు లక్షణాలు. 

యువ తరం నుంచి మధ్య వయసులోకి వస్తున్న వారు మధుమేహం, రక్తపోటు వంటివి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
►ఆఫీసుల్లో లేదా పని ప్రదేశాల్లో శారీరక శ్రమ లేకుండా అదే పనిగా కూర్చుండటం, ఎక్కువసేపు నిద్రించటం, పెరుగు, రెడ్‌ మీట్‌ ఎక్కువగా తీసుకోవడం, పాలు, బెల్లం, తీపివస్తువులు, అరటి, సపోటా, మామిడి లాంటి తీపి ఎక్కువగా ఉండే పండ్లను అధికంగా తినడం, కొవ్వుపదార్థాలు  తీసుకోవడం, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు తరచు తీసుకోవడం మధుమేహానికి ప్రధాన కారణాలు. స్థూలకాయం... షుగర్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అని గుర్తించాలి. 
►సక్రమమైన ఆహారాలు, క్రమం తప్పకుండా వ్యాయామం  వలన చక్కెర అదుపులో ఉంటుంది.

నివారణ
►మధుమేహ నివారణలో మందులతో పాటు ఆహార నియమాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి.
►ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయపు నడక లేదా సాయంత్రపు నడకను కచ్చితంగా అలవర్చుకోవాలి. 
పైన చెప్పిన నియమాలు పాటిస్తూ మధ్యాహ్న సమయంలో మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయని నంజుకొని తినడం మంచిది. అయితే పెరుగన్నం లేదా చిక్కటి మజ్జిగ బదులు పలుచటి మజ్జిగే మంచిది.
►పరగడుపునే ఒక లీటర్‌ నీటిని తాగడం, కాకర కాయ కూరను తరచు ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
►నెలకి ఒకసారి కచ్చితంగా ఉపవాసం చేయాలి. ఇది షుగర్‌ లేనివాళ్లకు మాత్రమే. 
►యోగాసనాలు, సూర్య నమస్కారాలు దినచర్యలో భాగం చేసుకుంటే దాదాపుగా మధుమేహం, రక్తపోటు  నుంచి బయటపడవచ్చు. 

తినవలసినవి..
బార్లీ, గోధుమలు , కొర్రలు , రాగులు, పాతబియ్యపు అన్నం , పెసలు , కాయగూరలు, ఆకుకూరలు , చేదుపొట్ల , కాకరకాయ , మెంతులు, దొండకాయ, వెలగపండు, మారేడు , నేరేడు గింజలు, ఉసిరిక పండు, పసుపు, పండ్లలో యాపిల్, బొప్పాయి, జామ, బత్తాయి. దానిమ్మ మంచిది.  

తినకూడనివి..
ఎక్కువగా పాలిష్‌ చేసిన బియ్యం, వేపుళ్లు, నేతి వంటకాలు, మద్యం, చెరుకు రసం, పుల్లటి పదార్థాలు, చింతపండు, పెరుగు, వెన్న , జున్ను , దుంప కూరలు, కొవ్వులు అధికంగా ఉండే పదార్థాలు వాడకూడదు. అదేవిధంగా రాత్రిపూట మేలుకొని పగలు ఎక్కువ నిద్రించటం, ధూమపానం, మద్యపానం మంచిది కాదు. మలమూత్రాలను ఆపుకోకపోవడం మంచిది.

తనంతట తానుగా మన శరీరం దాదాపు ప్రతి వ్యాధిని నివారణ చేసుకోగలదు. కానీ మధుమేహం వస్తే అది కుదరకపోవచ్చు. అందుకే డయాబెటిస్‌ విషయంలో నివారణకే ప్రాధాన్యం ఇవ్వాలి. 

చదవండి: ఈ హెర్బల్‌ టీతో ఇమ్యునిటీని పెంచుకోండి ఇలా..

మరిన్ని వార్తలు