Tips To Grow Hair Naturally: మీకో విషయం తెలుసా? రోజూ ఈ సంఖ్యలో వెంట్రుకలు రాలడం సహజమేనట!

12 Sep, 2021 12:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పొడవైన, ఒత్తైన జుట్టు ప్రతి అమ్మాయికి ఉండే కల. జుట్టు వత్తుగా ఏవిధంగా పెరుగుతుంది? చుండ్రు సమస్యను అరికట్టడం ఎలా? జుట్టు రాలిపోకుండా ఎట్లా కాపాడుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెదకనివారుండరు. అయితే జుట్టు ఆరోగ్యం, పెరుగుదల విధానం మన జెనెటిక్స్‌ నిర్మాణాన్నిబట్టి ఉంటుందని, తలపై దాదాపుగా లక్ష రంధ్రాలుంటాయని, వాటి నుంచే వెంట్రుకలు పెరుగుతాయని, రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజమేనని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ డెర్మటాలజీ వెల్లడించింది. వెంట్రుకల కుదుళ్లకు రక్తప్రసరణ సక్రమంగా జరిగితే జట్టురాలడం తగ్గి, ఆరోగ్యంగా పెరుగుతుందని ఆ అకాడెమీ తెలిపింది. 

కాగా కొన్ని ఆహారపు అలవాట్లతో జుట్టును ఆరోగ్యంగా పాకాడుకోవడం వల్ల కూడా సహజపద్ధతుల్లో వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం
జుట్టు పెరుగుదలకు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం ఎంతో ఉపకరిస్తుంది. 95శాతం కెరటీన్‌ ప్రొటీన్‌, 18 శాతం అమైనో యాసిడ్‌లు వెంట్రుకల పెరుగుదలకు అవసరమవుతాయి. అయితే మన ఆహారపు అలవాట్లలో కార్బొహైడ్రేట్లు ఉండేవే ఎక్కువ. కానీ ప్రొటీన్‌ల గురించి అంతగా పట్టించుకోం. ఫలితంగా జుట్టు బలహీనపడి ఊడిపోయే అవకాశం ఉంటుంది. గుడ్డు, పాలు, పన్నీర్‌, పెరుగు, వెన్న, చికెన్‌, తృణధాన్యాలు.. వంటి ఇతర పధార్థాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకుంటే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

‘బి’ విటమన్‌ ఉండే ఆహారం
జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ‘బి’ విటమన్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. బాదం, వాల్‌నట్స్‌ వంటి కాయధాన్యాలు, క్యాలీఫ్లవర్‌, క్యారెట్లను మీ రోజువారి ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి. చదవండి: అతిపిన్న వయసులోనే పైలట్‌ అయిన పేదింటి బిడ్డ!!

ఐరన్‌ అధికంగా ఉండే ఆహారం
ఐరన్‌ లోపం వల్ల వెంట్రుకల కుదుళ్లలోని కణాలకు ఆక్సిజన్‌ తగు మోతాదులో అందదు. ఐరన్‌తోపాటు ఫెర్రిటిన్‌ కూడా జుట్టు రాలడాన్ని అరికట్టి, పెరుగుదలకు ఉపయోగపడుతుంది. మాంసం, గుడ్డు, ఆకు పచ్చ కూరగాయలు, జామ వంటి ఫలాల్లో ఫెర్రిటిన్‌ ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది.

బి12, బి6, ఫోలెట్స్‌ విటమిన్లు
రక్తహీనతను నిర్మూలించడంలో విటమిన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. జుట్టు కుదుళ్లను బలంగా ఉంచడానికి ఇవి సహాయపడతాయి. రాజ్మా, బీన్స్‌, పాలల్లో ‘బి’ విటమిన్‌ నిండుగా ఉంటుంది.

ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు
చేపలు, అవిసెగింజల్లో ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. తల మీద చర్మం పొడిగా ఉంటే జుట్టు బలహీనపడి రాలిపోతుంది. ఈ ఒమేగా - 3 నూనెలు పొడి చర్మాన్ని అరికట్టి, జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.

విటమిన్‌ ‘సి’
విటమిన్‌ ‘సి’చర్మ ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన పోషకం. తలపై వెండ్రుకలు ఆరోగ్యంగా పెరగడానికి మాత్రమే కాకుండా, రక్తహీనతకు, ఐరన్‌ పెరుగుదలకు తోడ్పడుతుంది. సిట్రస్‌ ఫలాలు, క్యాప్సికం, నిమ్మ రసం.. ఇతర పధార్ధలను మీ ఆహారంలో భాగంగా తీసుకుంటే సరిపోతుంది.

జింక్‌ ఉండే ఆహారం
మన శరీరానికి జింక్‌ అతి తక్కువ మోతాదులో అవసరమైన ఖనిజమైనప్పటికీ, అది నిర్వహించే పాత్ర చాలా కీలకమైనది. శిరోజాల విషయంలో కుదుళ్లను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మన శరీరంలో ప్రొటీన్ల నిల్వకు ఉపకరిస్తుంది. తృణ ధాన్యాలు, చిక్కుల్లు, వేరుశనగ, పొద్దు తిరుగుడు విత్తనాల్లో జింక్‌ అధికంగా ఉంటుంది.

ఈ సూచలను పాటించడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలకు చెక్‌ పెట‍్టవచ్చనేది నిపుణుల మాట.

చదవండి: Eye Health: స్మోకింగ్‌ చేసేవారికి పొంచి ఉన్న ప్రమాదం.. ఈ సమస్యలు మూడు రెట్లు ఎక్కువే..

మరిన్ని వార్తలు