షడ్రుచుల సమ్మేళనం.. ఉగాది పచ్చడి

13 Apr, 2021 10:43 IST|Sakshi

తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ వచ్చిందంటే చాలు.. మనవాళ్ళు.. ముఖ్యంగా మన తెలుగు వారు.. మామిడాకులతో తోరణాలు, రకరకాల రంగవళ్లులు, పిల్లల అల్లరి చేష్టలు, పెద్దల హడావుడి, కొత్త బట్టలతో ఇంచుమించు అందరి ఇళ్లు కళకళలాడుతూ ఉంటాయి. పల్లెటూళ్లలో అయితే ఇక చెప్పనవసరం లేదు. ఉగాది పండుగ రోజు నుంచి, శ్రీరామనవమి వరకు ఏడు రోజుల పాటు చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుతుంటారు. ఉగాది పండుగకే ప్రత్యేకంగా నిలిచేది ఉగాది పచ్చడి. షడ్రుచుల మేళవింపుతో తయారు చేసే ఈ పచ్చడి మనిషి జీవితంలోని అనేక జ్ఞాపకాలకు ప్రతీక అని చెప్పవచ్చు. మానవ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, సంతోషం, బాధ, అవమానాలు అన్ని ఉంటాయి. వీటిన్నంటిని ఒక్కో రుచితో మేళవించారు పెద్దలు. షడ్రుచుల మిళితమైన శ్రేష్ట పదార్ధమే ఉగాది పచ్చడి.

ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత కలదో.. ఆహార, ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్యనిపుణుల మాట. మన పుర్వీకులు గ్రంధాల్లో ప్రస్తావించిన ఆ షడ్రుచులు.. పేరు వినటమే గాని, ఆ రుచులేమిటో చాలా మందికి నిజంగా తెలియదు. ఇక ప్రస్తుత కాలంలో ఉగాది పచ్చడి కూడా నూతన పోకడలు పోతుంది. అసలు ఉగాది పచ్చడిని తయారు చేసే పదర్థాలు ఏవి అంటే బెల్లం, చింతపండు, మిరియాలు, వేప పువ్వు, ఉప్పు, మామిడి. ఈ పదార్థాలన్నింటిని కొత్త కుండలో కలిపి.. అచ్చమైన ఉగాది పచ్చడి తయారు చేస్తారు. 

షడ్రుచులు దేనికి సంకేతం అంటే..

  • బెల్లం తీపి - ఆనందానికి సంకేతం 
  • ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం 
  • వేప పువ్వు - చేదు -బాధకలిగించే అనుభవాలు 
  • చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు 
  • పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు 
  • మిరియాలు - కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు
మరిన్ని వార్తలు