వారిద్దరి ఆలోచనలే ఆలంబనగా.. అన్నదాతకు తోడుగా...

28 Dec, 2022 19:38 IST|Sakshi

సక్సెస్‌ స్టోరీ 

‘ప్రయోగాలు మనకు పట్టెడన్నం పెట్టే రైతుకు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి?’ అనేదాని గురించి ఆలోచించారు సాయి గోలె, సిద్ధార్థ్‌  దైలని. సాంకేతిక జ్ఞానానికి, వ్యవసాయానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి, ఎప్పటికప్పుడు రైతులకు నిర్మాణాత్మక సలహాలు అందించడానికి ‘భారత్‌ అగ్రి’ స్టార్టప్‌ మొదలు పెట్టి విజయకేతనం ఎగురవేశారు...

సాయి గోలె, సిద్ధార్థ్‌ దైలని ఐఐటీ–మద్రాస్‌ విద్యార్థులు. ఇన్‌స్టిట్యూట్‌లోని ‘సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌’లో విద్యార్థులు రకరకాల ప్రయోగాలు, పరిశోధనలు చేస్తుంటారు. అయితే సాయి, సిద్ధార్థ్‌లకు వీటి మీద వ్యతిరేకత లేకపోయినా ‘బహుమతులు గెలుచుకునే, పేరు తెచ్చుకునే ప్రయోగాల కంటే ప్రజలకు ఉపయోగపడే ప్రయోగాలు కావాలి’ అనేది వారి బలమైన అభిప్రాయం.

అలా ఇద్దరి ఆలోచనలో నుంచి వచ్చిందే భారత్‌ అగ్రీ.
సాంకేతిక జ్ఞానం, వ్యవసాయానికి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేయడానికి ప్రారంభమైన ఈ స్టార్టప్‌ తన లక్ష్యసాధనలో ముందుకు దూసుకువెళతోంది. అంతర్జాతీయస్థాయి స్టార్టప్‌ పోటీలలో గెలిచింది. ‘భారత్‌ అగ్రీ’ అయిదు భాషల్లో మొబైల్‌ అప్లికేషన్‌లను లాంచ్‌ చేసింది. దీనికి రైతుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇది స్టెప్‌–బై–స్టెప్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు భూమి, నీరు, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన నిర్మాణాత్మకమైన సలహాలను రైతులకు ఇస్తుంది. దీని ద్వారా పంట ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుల ఆదాయం పెరిగింది.

స్టార్టప్‌కు ముందుగా తాము చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పుణెకు సమీపంలోని ఒక గ్రామంలో సంవత్సర కాలం ఉండి వ్యవసాయరంగ పరిస్థితులను అధ్యయనం చేశారు. ఎంతోమంది రైతులతో మాట్లాడారు. సాయి గోలె కుటుంబానికి వ్యవసాయంలో మూడు దశాబ్దల అనుభం ఉంది. గోలెకు వ్యవసాయరంగం గురించి మంచి అవగాహన ఉన్నప్పటికీ, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ క్షేత్రస్థాయి అధ్యయనం వారికి తోడ్పడింది.

‘మన దేశంలో నిర్లక్ష్యానికి  గురవుతున్న రంగం వ్యవసాయం. మనం రైతుల గురించి చేయాల్సింది ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌ అగ్రి ప్రాధాన్యత సంతరించుకుంది. రైతులకు ఉపయోగపడే శాస్త్రీయ సలహాలు అందించడం ఒక ఎత్తయితే, వారి విశ్వాసాన్ని చూరగొనడం మరో ఎత్తు. ఈ రెండు విషయాల్లో భారత్‌ అగ్రి విజయం సాధించింది’ అంటున్నాడు ‘భారత్‌ అగ్రి’ ఇన్వెస్టర్‌లలో ఒకరైన ఆనంద్‌ లూనియా. (క్లిక్‌ చేయండి: ఉందిలే మంచి టైమ్‌ ముందు ముందూనా...)

మరిన్ని వార్తలు