‘డిజిటల్‌ లెర్నింగ్‌’ గురించి మీకీ విషయాలు తెలుసా?

21 Mar, 2021 11:01 IST|Sakshi

ఎడ్యు ట్రెండ్స్‌

డిజిటల్‌ లెర్నింగ్‌.. ఇప్పుడు దీని గురించి పెద్దగా తెలియని వారుండరు. కొంతకాలం క్రితం వరకూ.. కొన్ని విద్యాసంస్థలు మాత్రమే డిజిటల్‌ పాఠాలు చెప్పేవి. బ్లాక్‌ బోర్డు మీద చాక్‌పీస్‌తో రాసి.. బొమ్మలు గీసి.. పాఠ్యాంశాలను వివరించేవారు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం డిజిటల్‌ మయంగా మారింది. విద్యావ్యవస్థలో డిజిటల్‌ లెర్నింగ్‌కు ప్రాధాన్యం పెరిగింది. కరోనా కారణంగా ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ తప్పనిసరిగా మారింది. ఇలాంటి తరుణంలో డిజిటల్‌ లెర్నింగ్‌ ప్రాధాన్యత.. ఈ లెర్నింగ్‌ ప్రయోజనాలపై ప్రత్యేక కథనం..

అదో గొడుగు
డిజిటల్‌ లెర్నింగ్‌ అనేది గొడుగు లాంటిది. మనం నేర్చుకోవాలనుకున్నది ఏదైనా కూడా అందులో డిజిటల్‌ టెక్నాలజీ పాత్ర తప్పక ఉంటుంది. ఉదాహరణకు విద్యార్థులు ఆన్‌లైన్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ క్లాసులను వీడియో ద్వారా వీక్షించడం.. అలాగే ఉపాధ్యాయులు డిజిటల్‌ టూల్స్‌ అంటే స్మార్ట్‌ బోర్డ్స్, టాబ్లెట్స్‌ ఆధారంగా బోధించడం. ఇలాంటివి అన్నీ డిజిటల్‌ లెర్నింగ్‌ కిందకు వస్తాయి. 

ఆన్‌లైన్‌ లెర్నింగ్‌
విద్యార్థులకు ఇంట్లోనే తరగతి గది లాంటి వాతావరణాన్ని కల్పించేదే ఆన్‌లైన్‌ లెర్నింగ్‌. ఇందులో విద్యార్థులు క్లాసులను వినడమే కాదు. ప్రత్యక్షంగా నేర్చుకుంటున్న పాఠ్యాంశాల్లో ఎలాంటి సందేహాలు ఉన్నా.. అడిగి వాటిని నివృత్తి చేసుకునే సౌకర్యం ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ క్లాసుల ద్వారా సాధ్యమవుతుంది. విద్యార్థులు–టీచర్‌ మధ్య పరస్పర సంభాషణకు అవకాశం ఉన్న వేదికనే.. ఆన్‌లైన్‌ లెర్నింగ్‌!

ఈ లెర్నింగ్‌
ఈ లెర్నింగ్‌ని వర్చువల్‌ లెర్నింగ్‌ అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా ఇంటర్నెట్‌ ఆధారంగా.. ఏదైనా కోర్సు నేర్చుకోవాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యక్షంగా కలవనవసరం లేకుండా.. ఇంటర్నెట్‌ ఆధారంగా అంటే ఈ–మెయిల్, చాటింగ్, వీడియోలు వంటివి ఈ–లెర్నింగ్‌కు దోహదపడతాయి. 

స్వయం
చదువుకోవాలనే ఆలోచన ఉండాలేకాని ప్రస్తుతం మార్గాలు అనేకం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్వయం ఆన్‌లైన్‌ కోర్సులను నేర్చుకోవడానికి విద్యార్థులను ప్రొత్సహిస్తుంది. జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ విద్యను ప్రొత్సహించే ఉద్దేశంతో మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సు (మూక్స్‌) తరహాలో స్వయం పేరిట ఈ ఆన్‌లైన్‌ వేదికను ఏర్పాటు చేశారు. ఇది వివిధ కోర్సుల విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 

ఉచితంగానే నేర్చుకోవచ్చు
కరోనా కారణంగా విద్యాసంస్థల మూసివేయడంతో ఆన్‌లైన్‌ కోర్సులకు డిమాండ్‌ ఏర్పడింది. పూర్తిగా ఉచితంగా కోర్సులను అందించడంతో ఎక్కువ మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానం వైపు వస్తున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలోని దీక్ష, ఈ–పాఠశాలతోపాటు ఈతంత్ర, వర్చువల్‌ ల్యాబ్స్, స్పోకెన్‌ ట్యుటోరియల్, ఎన్‌పీటీఈఎల్‌ లాంటి వాటిని విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు. 

టీచర్లూ నేర్చుకోవచ్చు
ఉపాధ్యాయలు సైతం ఆన్‌లైన్‌ వేదికగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. ఆయా బోధనాంశాల్లో, పద్ధతుల్లో మరింత మెరుగవడానికి, ఆయా రంగాల్లో జరుగుతున్న మార్పులు, కొత్త పరిశోధనలు, పరిణామాలు తెలుసుకోవడానికి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ చక్కగా ఉపయోగపడతాయి. ఆన్‌లైన్‌ విద్యవైపు విద్యార్థులను ప్రోత్సహించడానికి డిజిటల్‌ లెర్నింగ్‌ దోహదపడుతుంది. 

ప్రోత్సహించాలి
ప్రస్తుతం కొత్త జనరేషన్‌ మొత్తం ఆన్‌లైన్‌లో మునిగితేలుతోంది. చిన్నారులు స్కూల్‌ గ్రౌండ్‌లో ఆడే ఆటలకంటే.. మొబైల్‌ ఫోన్లలో వీడియో గేముల్లోనే ఎక్కువగా లీనమవుతున్నారు. నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉండే ఈ వయసులోనే విద్యార్థులను ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ వైపు ప్రోత్సహించాలి. సమయాన్ని వృథా చేసుకోకుండా.. ఆన్‌లైన్‌ వేదికగా ఉన్న సౌకర్యాలను వినియోగించుకుంటూ.. సబ్జెక్టులపై అవగాహన పెంచుకునేలా చూడొచ్చు!!

చదవండి: 

మరిన్ని వార్తలు