ఇంటి పంట: తీగకు కాచే ‘దుంప’!

6 Oct, 2020 08:23 IST|Sakshi

దుంప అనగానే మట్టి లోపల ఊరుతుందని అనుకుంటాం. అయితే, ఈ దుంప విభిన్నమైనది. తీగకు కాస్తుంది. అవును! ఎయిర్‌ పొటాటో, అడవి పెండలం, గాయి గడ్డలు, అడవి దుంపలు, అప్ప గడ్డలు.. అని దీన్ని రకరకాలుగా పిలుస్తున్నారు. అరుదైన ఈ కూరగాయ మొక్క అటవీ ప్రాంతాల ప్రజలకు చిరపరిచితమైనదే. నగరాలు, పట్టణాల్లో పుట్టి పెరిగిన వారికి దీనికి గురించి తెలియదు. వైవిధ్యభరితమైన సేంద్రియ ఇంటిపంటలను మక్కువతో పండించుకునే అభిరుచి కలిగిన సీనియర్‌ సిటీ ఫార్మర్‌ లత గాల్లో తేలాడే ఈ దుంప మొక్కను ఏడాదిగా తన మేడ మీద కుండీలో పెంచుతున్నారు. హైదరాబాద్‌ బిహెచ్‌ఇఎల్‌ ప్రాంతంలోని బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో స్వగృహంలో నివాసం ఉంటున్న ఆమె తమ ఇంటిపైన కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ఏడాది క్రితం శిల్పారామంలో గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నిర్వహించిన మేళాలో ఆదిలాబాద్‌ అటవీ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నిర్వహిస్తున్న స్టాల్‌లో ఎయిర్‌ పొటాటో దుంప విత్తనాన్ని ఆమె కొనుగోలు చేశారు.

తెచ్చిన వారం వరకు నాట లేదు. అప్పటికే దుంపకు మొలక వచ్చింది. జీడిమామిడి మొక్క పెరుగుతున్న డ్రమ్ములో ఈ దుంపను నాటారు. ‘ఈ మొక్క ఆకు తమలపాకును పోలి ఉంటుంది. నాలుగు నెలలకోసారి ఈ దుంపలు కోతకు వస్తున్నాయి. పులుసు లేదా ఇగురు కూరగా వండుకోవచ్చు. రుచి కంద, బంగాళదుంపలతో పోలిక లేకుండా విభిన్నంగా ఉంది..’ అంటున్నారు లత (89194 97262). 
భద్రాచలం గిరిజన ప్రాంతాల వారికి ఈ తీగ జాతి కూరగాయ మొక్క చిరపరిచితమైనదేనని చెబుతున్నారు. కాపు పూర్తయ్యాక తీగ ఎండిపోతుందని, ఈ మొక్క పాదిలో భూమి లోపల ఉండే దుంప నుంచి కొన్నాళ్లకు మళ్లీ తీగ పెరిగి దుంపలు కాస్తుందట. 

మరిన్ని వార్తలు