ఎంత గొప్ప ఐడియా అయినా సరే, కష్టంతోనే సాకారం..

18 Jun, 2022 15:22 IST|Sakshi

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది... అంటారు.  చాలామంది ఐడియాను మాత్రమే నమ్ముకొని కష్టాన్ని మరిచిపోతారు. ‘ఎంత గొప్ప ఐడియా అయినా సరే, కష్టంతోనే సాకారం అవుతుంది’ అని నమ్మే దివాన్షు కుమార్‌ దివ్యమైన ఆవిష్కరణకు తొలి బీజం వేశాడు...

అవసరాల నుంచి మాత్రమే కాదు విషాదాల నుంచి కూడా ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. ‘హోమో సెప్‌’ రెండో కోవకు చెందిన ఆవిష్కరణ. మనదేశంలో ప్రతిసంవత్సరం సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రపరిచే క్రమంలో అందులోని విషపూరితాల వల్ల ఎంతోమంది చనిపోయారు. చనిపోతున్నారు.


అనేక రంగాలలో రోబోలను విజయవంతంగా ఉపయోగిస్తున్నారు, సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రపరచడంలో ఎందుకు ఉపయోగించకూడదు! అని ఆలోచించాడు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాస్‌ విద్యార్థి దివాన్షు కుమార్‌. ఫైనల్‌ ఇయర్‌ మాస్టర్స్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రపరిచే మానవరహిత రోబోకు రూపకల్పన చేశాడు. దీనికి ప్రొ.ప్రభురాజగోపాల్‌ మార్గదర్శకం వహించారు.

రోబోను మరింత అభివృద్ధి పరిచే క్రమంలో ఒక డైనమిక్‌ టీమ్‌ తయారైంది. ఈ టీమ్‌ రాత్రనకా పగలనకా ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. ఎన్నో మాక్‌–అప్‌ ట్రయల్స్‌ చేసింది. అనుకున్నది సాధించింది. ఈ ప్రాజెక్ట్‌కు ఎంతోమంది సీఎస్‌ఆర్‌ డోనర్స్‌ అండగా నిలిచారు.


దివాన్షు ఆలోచనలో నుంచి పుట్టిన రోబోకు ‘హోమో సెప్‌’ అని నామకరణం చేశారు.
తొలిసారిగా ఈ రోబోలు తమిళనాడులో పనిలోకి దిగబోతున్నాయి.

ఒక ఐడియా రాగానే ‘ఆహా! ఎంత గొప్పగా ఉంది’ అనుకుంటాం. ఉద్వేగంలో ఒక నిర్ణయానికి రాకుండా, అది ఏ రకంగా గొప్పదో ఒకటికి పదిసార్లు ఆలోచించుకున్నప్పుడే, అందులో గొప్పదనం ఎంతో తెలుస్తుంది.

అందుకే ‘ఐడియాలు గొప్పవే అయినప్పటికీ, ఉత్తుత్తి ఐడియాలు, సాధారణ ఐడియాలపై శ్రమ వృథా చేయవద్దు’ అనే మంచిమాటను నమ్ముతున్న దివాన్షు నుంచి భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణలు జరగాలని ఆశించవచ్చు. (క్లిక్‌: పురుషులకు అండగా స్త్రీ గొంతుక)

మరిన్ని వార్తలు