దివ్యమైన ఫుడ్‌చైన్‌: వారసత్వంగా అందుకున్నదా?...! లేదా పూర్తిగా ఆమె ఆలోచనేనా..?

28 Feb, 2024 07:46 IST|Sakshi

కందిపొడితో కలిసిన తాజా నేతి వాసన. కొబ్బరి పచ్చడిలో తాజా కరివేపాకు, మినపప్పుతో వేసిన పోపు వాసన వీధి చివరకు వస్తోంది. ముక్కు చెప్పినట్లు నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఓ రెస్టారెంట్‌. లోపలకి వెళ్లేవాళ్లు, సంతృప్తిగా బయటకు వచ్చే వాళ్లు, క్యూలో ఉన్న వాళ్లను చూస్తే లోపల టేబుల్‌ దొరకడం కష్టమే, రష్‌ బాగానే ఉందనిపిస్తోంది. తలెత్తి చూస్తే విశాలమైన బోర్డు కుడివైపు ‘ద రామేశ్వరం కేఫ్‌’ అని ఇంగ్లిష్‌లో ఉంది.

తమిళ రుచి అనుకునే లోపే ఎడమవైపు అదే పేరు కన్నడ భాషలో ఉంది. మధ్యలో చక్కటి ముగ్గుతో మూర్తీభవించిన దక్షిణాది సంప్రదాయం కనువిందు చేస్తోంది. బెంగళూరులో ఉన్న ఈ రెస్టారెంట్‌ తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకు వేడి వేడిగా వడ్డిస్తూనే ఉంటుంది. ఈ రెస్టారెంట్‌ల యజమాని పాతికేళ్లు కూడా నిండని దివ్య. తాత, తండ్రుల వ్యాపార సామ్రాజ్యాన్ని ఈ అమ్మాయి వారసత్వంగా అందుకున్నదేమో అనుకుంటాం. కానీ ఇది పూర్తిగా ఆమె ఆలోచనే.

మెక్‌డీ... కేఎఫ్‌సీలేనా!
ఫుడ్‌ చైన్‌ను మించిన వ్యాపారం మరొకటి ఉండదని నమ్మింది దివ్య. సీఏ చేసిన తర్వాత ఐఐఎమ్‌ అహ్మదాబాద్‌లో ఎంబీఏలో చేరినప్పటి నుంచి ఫుడ్‌ చైన్‌ బిజినెస్‌లో నెగ్గుకురావడం గురించిన మెళకువలు నేర్చుకోవడంలో మునిగిపోయింది. పాశ్చాత్య దేశాల్లో పుట్టిన మెక్‌ డీ, కేఎఫ్‌సీలను మనం ఆదరిస్తున్నాం. అలాగే దక్షిణాది రుచులను దేశమంతటా విస్తరించడం ఎందుకు సాధ్యం కాదు... అనుకుంది. మార్కెటింగ్‌ వ్యూహాలను తెలుసుకుంది. కోర్సు పూర్తి అయిన వెంటనే తన ఆలోచనను ఇంట్లో వాళ్ల ముందు బయటపెట్టింది.

భర్త రాఘవరావు ఆహార పరిశ్రమల రంగానికి చెందిన వ్యక్తి కావడంతో అతడు మాత్రమే ఆమెకు మద్దతుగా నిలిచాడు. ఇక మిగిలిన వారంతా – ‘సీఏ, ఐఐఎమ్‌లో పీజీ చేసిన అర్హతలకు పెద్ద కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగం దొరుకుతుంది, హాయిగా ఉద్యోగం చేసుకోక ఇంత చదువూ చదివి ఇడ్లీలు, దోశెలు, ఊతప్పాలా’ అన్నారు. ఎవరెన్ని చెప్పినా ఆమె తన అభీష్టాన్ని నెరవేర్చుకుని తీరాలని నిర్ణయించుకుంది. ఇపుడామె కారం పొడి చల్లిన నెయ్యి దోశెలు, స్పాంజిలాగ మెత్తని ఇడ్లీలు, ఊతప్పం, గుంత పొంగనాలు, మూడు రకాల చట్నీలు, సాంబారు... ఈ ఘుమఘుమలు బెంగళూరు నుంచి మన హైదరాబాద్‌ను తాకి, దేశందాటి దుబాయ్‌కి కూడా చేరాయి.

ఇకపై సింగపూర్‌కి విస్తరించాలనేది దివ్య లక్ష్యం. తన ఫుడ్‌ చైన్‌కి ‘ద రామేశ్వరం కేఫ్‌’ అని పెట్టడానికి కారణం తాను అత్యంత ఎక్కువగా గౌరవించే మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ సొంతూరు రామేశ్వరం (తమిళనాడు రాష్ట్రం) కావడమే అంటోంది. పెద్ద కలలు కనమని చెప్పిన కలామ్‌కి తన విజయాన్ని అంకితం చేసింది దివ్య.

ఇది చదవండి: ఆన్‌లైన్‌ ప్రేమలు.. డేటింగ్‌ విత్‌ డిప్రెషన్‌!

whatsapp channel

మరిన్ని వార్తలు