Divyani Rai: నాలుగడుగులు.. పొట్టీ అంటూ వెక్కిరింపులు.. ఆత్మవిశ్వాసంతో అందనంత ఎత్తుకు!

16 Nov, 2021 03:47 IST|Sakshi

కాస్త బొద్దుగా ఉంటే ఏయ్‌ లడ్డు అని! సన్నగా ఉంటే పీలగా అస్థిపంజరంలా ఉన్నావనీ! పొట్టిగా ఉంటే..! అసలు పేరు వదిలేసి ఏయ్‌ పొట్టి... అని పిలుస్తుంటారు. పుట్టుకతో వచ్చే వాటిని మార్చుకోలేమని తెలిసినా పొట్టివారు కనిపించిన ప్రతిసారి రకరకాల కామెంట్లు చేస్తూ అవహేళన చేస్తుంటారు.

అవతలి వాళ్లు ఎంత బాధపడుతున్నారో కూడా చూడరు. వాళ్లని విమర్శించడం జన్మతః వచ్చిన హక్కులా ఫీల్‌ అవుతుంటారు. ఇలాంటి మాటలెన్నో పడిన దివ్యాణి.. మౌనంగా భరించిందే గానీ, ఎప్పుడూ తిరిగి ఒక్క మాట అనలేదు. తన పని తాను చేసుకుంటూ పోతూ తనని కామెంట్లు చేసిన వాళ్ల నోళ్లను తాను సాధించిన సక్సెస్‌తోనే మూయించి ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.  

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన దివ్యాణి రాయ్‌ వయసు 29 ఏళ్లు. ఎత్తు మాత్రం నాలుగడుగుల లోపే. ఇంట్లో అందరికంటే చిన్నది కావడంతో అంతా ఎంతో ప్రేమగా చూసుకునేవారు. దివ్యాణి చిన్నప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పుడు బయటకు వచ్చినా ఆమె ఎత్తు మీద జోక్‌లు, కామెడీ పంచ్‌లు బాగా వినిపించేవి. అప్పుడు దివ్యాణి కన్నీటిని దిగమింగుతూ ముందుకు వెళ్లిపోయేది. వాటిని మనసుకు తీసుకోకుండా తన చదువు మీద దృష్టిపెట్టి శ్రద్దగా చదువుకునేది.
 
ఎత్తులేదనీ..
చిన్నప్పటి నుంచి బొమ్మలు బాగా వేసే అలవాటున్న దివ్యాణి..తన నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోయింది. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ డిగ్రీ పూర్తయ్యాక, పీజీ చేసి ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా చేరింది. అక్కడ ఉన్న విద్యార్థులు ఎత్తుగా ఉండడం, దివ్యాణి మరి పొట్టిగా ఉండడంతో వారికి పాఠాలు బోధించలేవు అని చెప్పి కాలేజీ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. అప్పుడు దివ్యాణికి చెప్పలేనంత బాధ కలిగింది. ఏళ్లుగా ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్న ఆమెకు ఆ క్షణం సర్వ కోల్పోయినట్లు అనిపించింది. ఆ కొద్దిసేపు ఫీల్‌ అయినప్పటికీ తర్వాత తనకి తనే ధైర్యం చెప్పుకుంది.

అంతకు మించి..
 ఉద్యోగం పోయిన బాధ నుంచి కోలుకుని, తర్వాత బిఈడీ చేసింది. యూజీసీ నెట్‌ రాసి క్వాలిఫై అయ్యి,  ప్రొఫెసర్‌ రాజేంద్ర సింగ్‌ (రాజు భయ్య) స్టేట్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగాన్ని సాధించింది. తనకొచ్చే జీతంతో పేదరికంలో మగ్గిపోతూ చదువుకునే స్థోమత లేని పిల్లల్ని చదివిస్తోంది. ‘షురువాత్‌ ఏక్‌ జ్యోతి శిక్షాకి’ సంస్థతో కలిసి పనిచేసి నిరుపేద విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతోంది. పిల్లలకు పెయింటింగ్‌ను ఉచితంగా నేర్పిస్తోంది.  

ఆమే ఆదర్శం..
‘‘అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా సెలక్ట్‌ అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను పొట్టిగా ఉన్నప్పటికీ ఇంట్లో అమ్మా నాన్న, అన్నయ్య, తాతయ్య వాళ్లు నన్ను ప్రోత్సహించేవారు. వారి మద్దతుతోనే నేను ఈస్థాయికి వచ్చాను. నా ఎత్తు గురించి ఎప్పుడు బాధపడలేదు. కానీ నేను బయటకు వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరు కామెంట్లు చేసినప్పుడు మాత్రం మనస్సు చివుక్కుమనేది. ఆ సమయంలో ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఆర్తి డోగ్రాను ఆదర్శంగా తిసుకునేదాన్ని.

ఆమె ఎత్తు కూడా నాలుగడుగులే. అయినా ఆమె యూపీఎస్‌సీ సర్వీస్‌ పోటీ పరీక్షను తొలి ప్రయత్నంలోనే ఛేదించి ఐఏఎస్‌గా అధికారి అయ్యారు. అందం, ఎత్తు వంటి వాటిని కాదు, మనలో ఉన్న నైపుణ్యాలు, ప్రతిభకే పట్టం కడతారని ఆర్తి నిరూపించారు. అందువల్ల ఆమెను ఆదర్శంగా తీసుకునే ఈ స్థాయికి వచ్చాను.  భవిష్యత్‌లో వైస్‌ఛాన్సలర్‌ అయ్యి విద్యారంగంలో సరికొత్త మార్పులు తీసుకొస్తాను.’’అని ఎంతో గర్వంగా చెప్పింది దివ్యాణి.

మరిన్ని వార్తలు