Diwali Special 2021: గోరంత దీపం జగమంత వెలుగు

31 Oct, 2021 13:12 IST|Sakshi

దీపావళి అంటే సరదాలు... సంబరాలు. చిటపటలాడే సీమటపాకాయలు... వెలుగులు చిమ్మే విష్ణుచక్రాలు... ముఖంలోకి వెలుగులు తెచ్చే మతాబాలు కొంటెగా కాళ్ల కిందికొచ్చి కితకితలు పెట్టే భూచక్రాలు ఉగాదికి కవి సమ్మేళనాలు... పంచాంగ శ్రవణాలు అయితే దీపావళికి కథలు.... కవితల పోటీలు కొత్తబట్టల మెరుపులు.. మిఠాయిల ఘుమఘుమలు. పిల్లలు పెద్దలుగా... పెద్దలు పిల్లలుగా మారి చేసుకునే వేయి దీపాల వెలుగుల పండగ. ఇవన్నీ పండగలోని విశేషాలు... 

దీపావళిరోజు పిల్లలకు తలంటు పోసి కొత్తబట్టలు తొడిగి, రకరకాల పిండివంటలతో అన్నం తినిపించి సాయంత్రం పూట దీపాలు వెలిగించి, దగ్గరుండి మరీ వారిచేత కాకరపువ్వొత్తులూ, చిచ్చుబుడ్లూ, మతాబులూ కాల్పించడం పెద్దలందరూ చేసే పనే! అయితే అసలు ఈ పండుగను ఎందుకు చేసుకుంటున్నామో మాత్రం వాళ్లకి చెప్పడం లేదు. ఏ పండుగనైనా, పర్వదినాన్నయినా సరే... ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకుని చేసుకోవడం వల్ల ఎన్నో రెట్లు ప్రయోజనం కలుగుతుందనడంలో సందేహం లేదు. 

చదవండి: Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!!

ధన త్రయోదశి లేదా ధన్‌తేరాస్‌
దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ‘ధన్‌తేరాస్‌’ లేదా ‘ధన త్రయోదశి’ లేదా ‘ఛోటీ దివాలీ’ అని అంటారు. ధనత్రయోదశి అంటే సంపదను, శ్రేయస్సును పెంపొందించే త్రయోదశి అని అర్థం. పురాణాల్లో చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్వయుజ మాసంలోని బహుళపక్ష త్రయోదశికి ‘ధనత్రయోదశి’ అనిపేరు. ఈ రోజు ప్రత్యేకంగా బంగారం, వెండి, వస్త్రాలు, ఆభరణాలు లేదా ఇతర గృహోపకరణాలను కొనుగోలు చేసి, ఆ సాయంత్రం దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. మహిళలు అందమైన రంగవల్లికలు వేసి, భక్తి గీతాలు పాడుతూ, నైవేద్యం సమర్పించి, మంగళహారతి ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండి, సిరిసంపదలతో తులతూగుతారని నమ్మకం. ప్రతి ఒక్కరూ తమ తాహతుకు తగినట్లు బంగారం, వెండి, కొత్త బట్టలు, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ధన త్రయోదశి నాడు ఏదైనా కొత్త వస్తువును కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందని నమ్ముతారు.

పురాణాల్లోని ఓ కథ దీని గురించి తెలియజేస్తుంది. హేమ రాజు అనే రాజుకు లేక లేక ఓ కొడుకు పుట్టాడు. అతడి పదహారవ ఏట మరణం తథ్యమని జ్యోతిషులు పేర్కొంటారు. అయితే సుమంగళి యోగం ఉన్న ఓ రాజకుమారితో అతడికి వివాహం జరిపించడం వల్ల అతడికి ప్రాణగండం తప్పిపోతుందని తెలుసుకున్న రాజు ఏరికోరి ఆ యోగం ఉన్న ఓ రాజకుమార్తెతో అతడికి వివాహం జరిపించాడు. కుమారుడి ప్రాణగండం గురించి కోడలికి వివరించాడు. పెళ్లైన మూడో రోజు తన భర్తను మృత్యువు నుంచి కాపాడేందుకు ఆమె లక్ష్మీదేవిని పూజించి, జాగారం చేసింది. విలువైన బంగారు, వజ్రాభరణాలను ఓ పెట్టెలో ఉంచి, ప్రవేశ ద్వారం దగ్గర ఉంచింది. దాని చుట్టూ దీపాలు వెలిగించి, భగవంతుని స్మరిస్తూ, తన భర్తను నిద్రలోకి జారుకోకుండా ఉంచింది.

ఆ మర్నాడు ఉదయం యమ ధర్మరాజు సర్పరూపంలో ఆ ఇంటికి వచ్చేటప్పటికి ఆ దీపాల వెలుగులో ఆయన చూపు మసకబారిపోవడమే కాదు, లోనికి ప్రవేశించలేకపోయాడు. దీంతో ఆ ప్రాంతం నుంచి యముడు మెల్లగా వెళ్లిపోయాడు. తెలివిగా వ్యవహరించిన ఆ రాజకుమారి తన భర్త ప్రాణాలు దక్కించుకుంది. ఇది దీపావళికి ముందు త్రయోదశి నాడు జరగడంతో ఆ రోజు నుంచి ‘ధనత్రయోదశి’ని నిర్వహిస్తున్నారు.

చదవండి:  ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే..

మరో కథ..
పాలకడలిలో శేషతల్పంపై పవళించే మహావిష్ణువు చెంత ఉండే మహాలక్ష్మి భూమిపైకి వచ్చిన రోజు ఈ ధన త్రయోదశిగా పురాణాలు చెబుతున్నాయి. తన నివాసమైన విష్ణుమూర్తి వక్షస్థలంపై ఓ ముని కాలితో తన్నడం నచ్చని లక్ష్మీదేవి అలిగి భూమిపైకి వస్తుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆమె భూమిపై ఉన్న కరవీరపురానికి (మహారాష్ట్ర కొల్హాపూర్‌) చేరుకుందట. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన విషయాన్ని గమనించిన కుబేరుడు ఆ వెంటనే ఆమెను పూజించి.. లక్ష్మీదేవి కరుణను పొందాడు. లక్ష్మి వచ్చిన త్రయోదశి కాబట్టి, అది ‘ధన త్రయోదశి’ అయింది.

ఇవాళ ఆది వైద్యుడైన ధన్వంతరి జయంతి కాబట్టి ‘ధన్వంతరి త్రయోదశి’గానూ భావిస్తారు. అందుకే వైద్యులు ధన్వంతరిని ఘనంగా పూజిస్తారు. ధన్వంతరికి ప్రతిరూపంగా మనకు ప్రాణదానం చేసే వైద్యులను సన్మానించడం, సంభావించడం మంచిది. మహావిష్ణువు వామనావతారం ధరించి, బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కిందీ ఈరోజేనని ప్రతీతి. అందుకే ‘త్రివిక్రమ త్రయోదశి’గా పిలవడమూ పరిపాటి. ఈరోజుకు కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి అనే ఇతర పేర్లూ ఉన్నాయి.

ఈ పర్వదినాన ఏం చేయాలి?
బంగారం కొనుగోలుకు అత్యంత శుభప్రదమైన దినాల్లో ధన త్రయోదశి కూడా ఒకటి. నేడు శుచిగా స్నానాదులు ముగించిన తరువాత, ఏమీలేని పేదలకు భోజనమో, వస్త్రమో, రొక్కమో దానం చేయాలి. ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీ స్వరూపులుగా భావించి వారికి కానుకలు ఇవ్వాలి. లక్ష్మీదేవిని స్వర్ణ పుష్పాలతో అర్చించాలని చెబుతుందీ పండగ. స్వర్ణపుష్పాలు లేనప్పుడు, బంగారమంటి మనసుతో అర్చించినా లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. 

నరకచతుర్దశి
ఆ పేరెందుకు వచ్చింది? 

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. మనం ఆచరించే  పండుగలలో ఒక రాక్షసుడి మరణాన్ని ఆనందంగా పండుగ చేసుకోవడం – నరక చతుర్దశి విశిష్టత. 

నరక చతుర్దశి ఆచరణ వెనక ఉన్న గాథల్లో నరకాసురుడి గాథ ప్రధానమైంది. హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. నరకుడు ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలోపడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి మూలంగా తప్ప మరేవిధంగానూ మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. ఆ వరగర్వంతో అతను కావించిన దుష్కార్యాలు పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేశాయి. విష్ణుద్వేషియై దేవతలను హింసించసాగాడు. దేవమాత అదితి కుండలాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణుడు ఇతనిని ద్వంద్వయుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేశాడు.

చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్‌ ఐలాండ్‌.. లక్షల కోట్ల సంపద!

మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూ వారనే విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన చెరలో ఉంచడం  ఇతనికొక వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్టనందుకుంది. ఇంద్రుడు ఆపద రక్షకుడైన శ్రీ కృష్ణుని శరణు వేడగా గోపాలుడు నరకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీ కృష్ణుడు ఒక క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయన  వెన్నంటే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాలతో అతడిని నిలువరించింది. ఆ తర్వాత కృష్ణుడు నరకుడిపై సుదర్శనాన్ని ప్రయోగించడంతో అతడి శిరస్సు నేలరాలి, మరణం సంభవించింది. ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. 

తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా గుర్తింపు పొందుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీ కృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో, చీకటిని పారదోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే నరక చతుర్దశిగా మారింది. 

ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నాయి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణం చేయడం మంచిదని పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం. యముని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ఇంటి ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు.

ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగన స్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.

చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వాసం. సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ విశ్వాసం.

అజ్ఞానాన్ని, అవిద్యను పారదోలే దీపతోరణాలు
లోకంలోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం ఇది. భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. ఆయన అన్నిరకాలైన చీకట్లను, అంటే.. అవిద్యను, అజ్ఞానాన్ని, అవివేకాన్ని పారదోలగల సమర్థుడు, జ్ఞానప్రదాత. దీపం వల్లనే సమస్త కార్యాలూ సాధ్యమవుతాయి. మహాలక్ష్మి దీపకాంతులలో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. అందుకే దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. నిత్యం హారతి పాటలు, శంఖం, ఘంటానాదాలు వినిపించే ఇంట్లోనూ, పరిశుభ్రంగానూ, అందంగానూ కనిపించే ఇంటిలోనూ, గోవులు, గోశాలలు, çపుష్పగుచ్ఛాలు, వజ్రవైఢూర్యాలు, సుగంధ ద్రవ్యాలు, సమస్త శుభప్రద, మంగళకరవస్తువులయందు, వేదఘోష వినిపించే ప్రదేశాలలోనూ, స్త్రీ సుఖశాంతులతో తులతూగే చోట, శ్రీమన్నారాయణుని, తులసిని పూజించే ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని శాస్త్రోక్తి్త. పరధనం కోరని వారు, అబద్ధాలాడని వారు, అప్రియంగా మాట్లాడనివారు.. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రులు. సమాజానికి దుష్టుని పీడ వదిలిందన్న ఆనందోత్సాహాలతో దీపావళినాడు బాణసంచా కాల్చడం ఆనవాయితీ. టపాసులు కాల్చేముందు పిల్లలు గోగుపుల్లలకు నూనెతో తడిపిన వస్త్రాన్ని చుట్టి, దానిని కాలుస్తూ దుబ్బూ దుబ్బూ దీపావళీ మళ్లీ వచ్చే నాగులచవితి.. అని దివిటీలు కొట్టడం ఆనవాయితీ. దీపాలు వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్త్రీదైతే, ఉన్నంతలో పేదవారికి దానధర్మాలు చేయడం, సాటివారికి సాయపడే బాధ్యత పురుషులది, బాణాసంచా కాల్చి పరిసరాలను వెలుగులతో నింపే ఉత్సాహం పిల్లలది. దీపాలను మన ఇంటిలోనే కాదు, ఇరుగు పొరుగు ఇళ్లలోనూ, దేవాలయాలలోనూ కూడా ఉంచి, పరహితంలో పాలు పంచుకోవటం  బాధ్యత.

ఈ పండుగ సంప్రదాయం ఇది...
దీపావళి అంటే దివ్వెల వరుస. దీపావళి రోజు సాయంకాలం...
నువ్వులనూనె లేదా ఆవునేతిని మట్టి ప్రమిదెలలో నింపి, దీపాలు వెలిగించాలి. అనంతరం దీపతోరణాలతో గృహాన్ని అలంకరించాలి. అందరికీ మిఠాయిలు పంచాలి. పిల్లలు, పెద్దలు అందరూ మందుగుండు సామగ్రిని కాలుస్తూ అమావాస్య చీకట్లను తరిమికొట్టాలి. దారిద్య్రబాధలు తొలగి, ధనలాభం పొందడానికి ఈ వేళ తప్పనిసరిగా లక్ష్మీపూజ చేయాలి.

దీపావళి పండుగ వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణ, భారత భాగవతాలను చదివితే ఆ కథలు తెలుస్తాయి.
రామాయణంలో తండ్రి దశరథుని కోరిక మేరకు శ్రీరాముడు, సీతాలక్ష్మణ సమేతుడై పద్నాలుగేళ్ళు అడవిలో నివసించేందుకు వెళతాడు. వనవాసం చేస్తుండగా లంకాధీశుడైన  రావణాసురుడు మాయోపాయంతో సీతను ఎత్తుకు వెళతాడు.
ఆ తర్వాత రావణాసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆరోజు అమావాస్య. అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాం.

ఇక రెండవ కథగా నరకాసుర సంహారాన్ని గురించి మనం ముందే తెలుసుకున్నాం కదా... 
మూడవ కథగా పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మిదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. అమృతం కోసం దేవ దానవులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజు లక్ష్మీదేవి ఉద్భవించింది. సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తారు.
నాలుగవ కథగా భారతంలోని ఇతివృత్తాన్ని చెప్పుకుందాం. కౌరవులు సాగించిన మాయా జూదంలో ఓడిన పాండవులు పదమూడేళ్ళు వనవాసం ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు.

ఐదవ వృత్తాంతంగా రైతుల గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు. 
నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.

బాణసంచా ఎందుకు కాలుస్తారు? 
దీపావళినాడు టపాసులు పేల్చడం వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. ఇప్పుడు భూమి నుంచి పుట్టే వివిధ రకాలైన క్రిమికీటకాలు రోగాలను కలిగిస్తాయి. దీపావళి నాటి రాత్రి కాల్చే మందుగుండు సామగ్రి నుంచి వెలువడే పొగ, వాసన ఈ కాలంలో వ్యాపించే దోమలను, క్రిములను హరింపజే స్తాయి. అలాగని మరీ ఎక్కువగా కాలిస్తే, ఆ పొగ మనకూ హాని చేస్తుంది, శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. 

బలిపాడ్యమి
దీపావళి మరునాటినుంచి కార్తీకమాసం ఆరంభమవుతుంది. కార్తీక శుద్ధపాడ్యమికే బలి పాడ్యమి అని పేరు. ఈరోజు బలిచక్రవర్తిని పూజించి ‘బలిరాజ నమస్తుభ్యం విరోచన సుతప్రభో భవిష్యేంద్ర సు రారాతే పూజేయం ప్రతిగృహ్యతాం అనే శ్లోకాన్ని పఠించి నమస్కరించాలి. 

భగినీహస్త భోజనం
కార్తీక శుక్ల విదియ తిథి రోజున ‘భగినీ హస్త భోజనం’ పేరిట పండుగను జరుపుకుంటారు.
ఈనాడు యమధర్మరాజుని, చిత్రగుప్తుని పరివారంతో సహా పూజించి తల్లి యమునా దేవి (నది)ని స్మరించి పూజించాలి. సూర్యుని బిడ్డలైన యమునా నది, యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునకి ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలచి సత్కారం చేయాలని కోరిక, ఆమె పిలవగా పిలవగా యమధర్మరాజు ఓరోజున యమున ఇంటికి సకల పరివార సమేతంగా వచ్చాడు. ఆరోజు కార్తీక శుక్ల విదియ. ఇంటికి వచ్చిన సోదరుని చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించింది. తన చేత్తో చక్కని వంట చేసి వడ్డన చేసింది. అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో ఏదైనా వరం కోరుకోమనగా.

యమున ఆనాటి నుండి కార్తీక శుక్ల విదియ నాడు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరునికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం లేకుండా ఉండేటట్టు వరమియ్యమని కోరగా, యమధర్మరాజు ఆమె కోర్కెని విని ఆనందించి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరునికి తన చేతి వంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా పుణ్యవతిగా, అఖండ దీర్ఘ సౌమాంగల్యంతో వృద్ధినొందుతుందని వరమిచ్చాడు. అందువలనే ఈ తిథికి యమ ద్వితీయ అని పేరు వచ్చింది. తరవాత యమునను పరివార సమేతంగా తన పురానికి మరునాడు ఆహ్వానించి కానుకాదులిచ్చి, చక్కని షడ్రసోపేతమైన విందు చేసి సారె పెట్టి పంపాడు.

దీన్నే భాయ్‌ దూజ్‌ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్‌ టీక అనీ ఈశాన్య, ఉత్తర, పశ్చిమ భారతంలో చేసుకునే పండుగ. 

చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..!

దేశవిదేశాల్లో దీపావళి
►దీపావళికి చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత, విశిష్టత ఉన్నాయి. విశాఖదత్తుడు తన ముద్రారాక్షస నాటకంలో దీపావళిని ‘కౌముదీ మహోత్సవం’గా వర్ణించాడు. కౌముది అంటే వెన్నెల. కార్తీక మాసాన్ని కౌముదీ మాసంగా పరిగణిస్తారు. కార్తీక మాస ప్రారంభంలో దీపాల వెలుగులతో నిండి ఉంటుంది కదా! అంతేకాక ఆ మాసమంతా ముత్తైదువులు దీపాలను వెలిగించి చివరగా జీవ నది ద్వారా స్వర్గానికి చేర్చటం వల్ల తమకు మాంగల్యబలంతోపాటు పాడిపంటల సమృద్ధి, సంతానాభివృద్ధి చెందుతాయని హైందవుల ప్రగాఢ విశ్వాసం.

►ఈ దీపావళి రోజునే విక్రమార్కుడు పట్టాభిషిక్తుడయ్యాడని చారిత్రక కథ. ఈ దీపావళిని స్వర్ణ దీపావళిగా ఋగ్వేదం విశదీకరించింది. భోజమహారాజు దీనిని ‘సుఖరాత్రి’గా అభివర్ణిస్తే, హర్ష చక్రవర్తి దీపావళిని ‘దీపప్రతి పాదోత్సవం’గా వ్యవహరించాడని నైషధ కావ్యం చెబుతోంది.

►సిక్కులు అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించి ప్రార్థనలు జరుపుతారు. వారి మతగురువైన గురు హరగోవింద్‌ సాహిబ్‌ మొగల్‌ చక్రవర్తుల చెరనుంచి విడుదలైన రోజు కనుక గొప్ప ఉత్సాహంగా జరుపుకుంటారు.

►ఈ రోజు జైనులు మహావీరుని నిర్వాణదినంగా భావించి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. అంతేకాక జైన మత గ్రంథాలను పారాయణం చేస్తారని జైన హరివంశం చెబుతోంది.

►మొగల్‌ చక్రవర్తి అక్బరు ఈ దీపావళి పండుగను ఘనంగా జరిపించినట్లు అబుల్‌ ఫజల్‌ రాసిన ‘అక్బర్‌నామా’ ద్వారా విశదమవుతోంది.

►ఈ పండుగను ‘దివ్వెల పండుగ’గా రెడ్డి రాజుల కాలంలో వ్యవహరించే వారని ‘సింహాసన ద్వాత్రింశక’ ద్వారా తెలుస్తోంది.

►విజయ నగర రాజుల వైభవ కాలంలో అత్యంత వైభవోపేతంగా దీపావళి పర్వదినాన్ని జరుపుకొన్నట్లు చారిత్రక ఆధారాలవల్ల తెలుస్తోంది. అంతేకాక విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్‌ యాత్రికుడు ‘నికోలో కాంటి’ దీపావళిని విశదపరచాడు.

►ఈ పండుగను ‘యక్షరాత్రి’ గా జరిపినట్లు తెలుస్తోంది. ‘జ్యోతిష రత్నమాలను’ రచించిన ‘శ్రీపతి’ అనే మరాఠీ కవి దీపావళిని దాని ప్రాశస్త్యాన్ని వివరించాడు.

►జాతి కుల మత వర్గ విచక్షణలేకుండా సర్వమానవ సౌభ్రాతృత్వం వెల్లివిరిసి దశ దిశలా చాటే పండుగే దీపావళి పండుగ. భారతదేశ సంస్కృతికి ప్రతీకగా చాటే ప్రతీతి ఉంది.

►వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో జరుపుతారు. మానవునిలో దాగి ఉన్న విచారా (చీకటి)న్ని పోగొట్టి ఆనందాన్ని (వెలుగు) వికసింపచేసేది. దీపాలు వెలిగించడం సంతోషానికి సంకేతం. యావద్భారతదేశమే కాకుండా విదేశాల్లో కూడా జరుపుకోవడం విశేషం.

►గుజరాత్, బెంగాల్‌ రాష్ట్రాల్లో దీపావళిని రైతులు ‘పశుపూజారి’ దినోత్సవంగా జరుపుకుంటారు. ‘ధన్‌తేరాస్‌’ పేరున కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది.
ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల్లో గోవర్ధనగిరిని నిర్మించి పూజిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో ‘భారత్‌ మిలన్‌’ పేరిట దీపావళి జరుగుతుంది.

►రాజస్థాన్, హిమాచల ప్రదేశ్‌ రాష్ట్రాల్లో దీపావళి నాడు భూతబలి ఇస్తారు. అంటే కుక్కలకు, కాకులకు ఆహారాన్ని పెట్టి పసుపు కుంకుమలతో పూజిస్తారు.
‘అన్నకూట్‌’ అన్న పేరుతో మధుర ప్రాంతాల్లో నిర్వహిస్తారు. పశుపక్ష్యాదులకు ఆహారాన్ని పెట్టి ఆదరిస్తారు.‘గోవర్థనగిరి’ వారు నరక చతుర్దశి, దీపావళి రెండు రోజులు జరుపుతారు.

►పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో కాళీపూజలు జరుపుతారు. ఈ పూజను ‘జగద్ధాత్రి’ అనిపిలుస్తారు. కేరళలో బలిచక్రవర్తిని జయించిన రోజుగా పరిగణించి దీపావళి పండుగను జరుపుతారు.

ఇలా భారతదేశంలోనే కాక దేశవిదేశాల్లో అనాదిగా అన్ని మతాలవారు, అన్ని వర్గాల వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అతిముఖ్యమైన పండుగ దీపావళి పండుగ. 

– డి.వి.ఆర్‌. భాస్కర్‌

చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి..
 

మరిన్ని వార్తలు