ఆశల దీపాలు వెలిగిద్దాం

2 Nov, 2021 04:01 IST|Sakshi

వెలుతురు కావాలి జీవితాల్లో. చీకటిని దూరంగా నెట్టేయాలి. చేదు జ్ఞాపకాలని చెరిపేయాలి. వేదనను తరిమికొట్టాలి. కోవిడ్‌ కాలంలో ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా పరోక్షంగా సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఎందరో ఆప్తులు రోజుల తరబడి ఆస్పత్రుల్లో ఉండి దక్కుతారా లేదా అని ప్రాణాలు ఉగ్గబట్టేలా చేశారు.

కోవిడ్‌ బారిన పడి విజేతలైన వారందరికీ ఇది ఆనందమయ దీపావళి. అందుకే దీనిని అద్భుతమైన జ్ఞాపకంగా మలుచుకోవాలి. సంబరాల వెన్నముద్దల్ని వెలిగించాలి. హ్యాపీ దీపావళి.

ఆ రోజులు ఇక వద్దనే వద్దు. అలాంటి రోజులు ఇక మీదట ఎవరికీ వద్దు. అలా అనుకుని సంకల్పం చేసుకుని ప్రతి ముంగిలిలో ఒక దీపం వెలిగించాలి ఈ పండక్కు. ఆ భయం ఇక ఎవరికీ రాకూడదు. టెస్ట్‌ల కోసం బారులు తీరిన ఎదురు చూపులు ఎదురు పడకూడదు. ల్యాబ్‌లకు పరిగెత్తి పోవడాలు.. సిటి స్కాన్‌లను అదురుతున్న గుండెలతో పరిశీలించడాలు... ఆస్పత్రి బిల్లులకై హైరానాలు... దొరకని మందుల కోసం కార్చిన కన్నీళ్లు... పునరావృత్తం కాకూడదని ఆశిస్తూ ఆకాశచువ్వలను ఎగరేయాలి ఈ దీపావళికి. క్రిమి తెచ్చిన చీకటిని దేశమంతా దీపాలతో నింపి ఓడించాలి. అవును. గోరంత దీపమే కొండంత వెలుగు. చిగురంత ఆశ జగమంత వెలుగు.

మళ్లీ మళ్లీ చూడాలి దీపావళి
కోవిడ్‌ని ఎదిరించి విజేతలైన వారు ఇవాళ కోట్లలో ఉన్నారు. అలా విజేతలు కావడానికి కోవిడ్‌ని ఓడించడానికి వారు పెద్ద యుద్ధమే చేశారు. కొందరు అతి సులువుగా గెలిచారు. మరికొందరు చాలా కష్టపడి విజయహాసం చేయగలిగారు. కోవిడ్‌ నుంచి బయటపడినా ఎన్నో చికాకుల్లో ఉన్నవారు నేడు ఉన్నారు. చోటా మోటా ఆరోగ్య సమస్యలు వారిని వేధిస్తున్నాయి.

ఈ దీపావళి నాడు అలాంటి మన కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు తప్పనిసరిగా ఉత్సాహభరితమైన దీపావళి శుభాకాంక్షలు చెప్పాలి. ఈ దీపావళిని చూశాం... మున్ముందు మరిన్ని దీపావళులను మనందరం చూస్తాం... ఒక దశను దాటాం... అంతిమ విజయాన్ని కూడా చూస్తాం అని ధైర్య వచనాలతో శుభాకాంక్షలు చెప్పాలి. కానుకలు ఇచ్చి వారిని ఉత్సాహ పరచాలి. కోవిడ్‌ సమయంలో ప్రత్యక్ష సహాయం చేయలేకపోవచ్చు. కాని ఇప్పుడు ఒకరికి ఒకరున్నాం అని చెప్పగలగాలి. వారి కోసం మిఠాయి డబ్బాలతో పాటు, కొత్త వస్త్రాలతో పాటు, కొద్ది పాటి భరోసాను ఇస్తే అది నిజమైన దీపావళి. సమూహ దీపావళి. సందర్భ దీపావళి.

వేక్సిన్‌ దీపావళి
నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి సంహరించాడు. ఆయుధాలు లేకుండా దుష్ట సంహారం జరగదు. స్త్రీ పురుషులు కలవకుండా కొన్ని చెడులు నాశనం కావు. ఇప్పుడు ప్రతి ఇంటి భార్యాభర్తలు బాధ్యతగా ఉండి వేక్సిన్‌ అనే ఆయుధంతో కోవిడ్‌పై కుటుంబానికి విజయాన్ని సిద్ధింప చేయాలి. నిజమైన వెలుతురు ఇంటికి రావాలంటే నిజమైన వెలుతురు కింద మనం ఉన్నామని ధైర్యం కలగాలంటే కుటుంబంలోని అందరూ వేక్సిన్‌ వేసుకున్నారా లేదా అని ఈ పండగ సందర్భంగా చెక్‌ చేసుకోవాలి. ఒక్క డోస్‌ కూడా వేసుకోని వారిని వెంటనే కదిల్చి తీసుకెళ్లాలి. రెండోడోస్‌ అక్కర్లేదనుకుని పాలుమారిన వారిని ఒక్క డోస్‌తో నరకాసురుడు సగమే చస్తాడని చెప్పి పూర్తి చేయించాలి. రెండు డోస్‌ల వేక్సిన్‌ వేయించుకున్నాక కలిగే సురక్ష భావనలో ఈ దీపావళి జరుపుకుంటే ఆ కళ వేరు. ఆ కాంతి వేరు.

బాలల దీపావళి
పిల్లలు చిచ్చుబుడ్లు. భలే వెలుగుతారు. వారు నవ్వితే వెలుతురు పూలు పూస్తాయి. అలాంటి బాలలకు ఇంకా పూర్తి రక్షణ దొరకలేదు. వేక్సిన్‌ కనుచూపు మేరలో ఉంది. మరోవైపు స్కూళ్ల వారు వెళ్లక తప్పని పరిస్థితి. ఈ సందర్భంలో ప్రమాదకరమైన టపాకాయలకు వారిని దూరం పెట్టినట్టుగా కోవిడ్‌ నుంచి దూరం పెట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ వారికి పదే పదే చెప్పాలి. వారి కోసం జాగ్రత్తలు పదే పదే పాటించాలి. నిజానికి వారు అలసిపోయి ఉన్నారు. విసిగిపోయి ఉన్నారు. దీపావళి వారి పండగ. వారికి ఈ సమయంలో ఆటవిడుపు ఇచ్చి వారితో సమయం గడపాలి. బంధువుల్లో, తెలిసినవారిలో ఎవరైనా పిల్లలు దురదృష్టవశాత్తు తల్లిదండ్రుల్లో ఎవరినో ఒకరిని కోల్పోయి ఉంటే అలాంటి పిల్లల్లో తప్పక ఆశను నింపాలి. వారికి కావల్సిన కానుకలిచ్చి సంతోష పెట్టాలి. వారి చేతుల్లో తప్పక ఒక దీపావళి టపాసు పెట్టాలి.

సమాజ దీపావళి
కోవిడ్‌ ఇంకా ముగిసిపోలేదు. ఆ పాము తోక ముడిచిందో లేదో తెలియదు. మనల్ని మనం కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడుకుంటే మన వెలుతురు సమాజ వెలుతురు కలిసి స్వస్థ కాంతి అవుతుంది. కోవిడ్‌ జాగ్రత్తలు మరి కొన్నాళ్లు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించి మన ద్వారా ముప్పు పెరగకుండా ఉండాలని సంకల్పం చెప్పుకుంటూ దివ్వెను వెలిగించాలి. అంతే కాదు... ఈ సందర్భంలో రకరకాల చిక్కుల్లో ఉన్నవారికి చేతనైన సహాయం చేయడం అవసరం అని భావించాలి. చేయాలి.

దీపావళి అంటే ఒక దివ్వె నుంచి ఇంకో దివ్వె వెలగడం.
మనిషిగా మనం సాటి వారి కోసం కొంచెమైనా వెలుగు ఇవ్వగలిగితే అదే ఈ కాలంలో మానవీయ దీపావళి.
కోవిడ్‌ ఇంకా ముగిసిపోలేదు. ఆ పాము తోక ముడిచిందో లేదో తెలియదు. మనల్ని మనం కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడుకుంటే మన వెలుతురు సమాజ వెలుతురు కలిసి స్వస్థ కాంతి అవుతుంది. కోవిడ్‌ జాగ్రత్తలు మరి కొన్నాళ్లు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించి మన ద్వారా ముప్పు పెరగకుండా ఉండాలని సంకల్పం చెప్పుకుంటూ దివ్వెను వెలిగించాలి.

మరిన్ని వార్తలు