‘అమ్మా నన్ను కన్నందుకు’.. మేడమ్‌ మీవల్లే

6 Mar, 2021 00:35 IST|Sakshi

8న ఉమెన్స్‌ డే సందర్భంగా

మార్చి 8 మహిళాశక్తి బర్త్‌ డే! బాయ్స్‌ అండ్‌ బిగ్‌ బాయ్స్‌.. ఆరోజు మీరు మీ మహిళకు.. మీ బాస్, మీ కొలీగ్, మీ టీచర్, మీ మదర్, వైఫ్, సిస్టర్‌ .. వారెవరైనా సరే.. శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోకండి. ‘మేడమ్‌ మీవల్లే’ ‘అమ్మా నన్ను కన్నందుకు’ ‘సోదరీ తోడున్నావు’ ‘సహచరీ నీడవయ్యావు’ కృతజ్ఞతగా ఒక్కమాట. ఒక్క ప్రణామం. ప్లస్‌.. వాళ్లను రెస్పెక్ట్‌ చేస్తూ ఒక ‘ఉమెన్స్‌ డే’ గిఫ్ట్‌! బార్బీ బొమ్మల తయారీ కంపెనీ ‘మటెల్‌’ కూడా ఈ ఏడాది ఉమెన్స్‌ డే కి మహిళాశక్తిని రెస్పెక్ట్‌ చేస్తూ డీజే  క్లారా గా ఒక కొత్త బార్బీని మార్కెట్‌ లోకి తెస్తోంది. 36 ఏళ్ల  క్లారా బ్రిటిష్‌ రేడియో ప్రెసెంటర్‌. ‘పవర్‌ గర్ల్‌’ బార్బీ, ‘సూపర్‌ ఉమన్‌’ క్లారా ప్రతి మహిళలోనూ ఉంటారు. మహిళే మన రోల్‌ మోడల్‌.

అమ్మాయిలూ..
(లేదా)
మహిళలూ..
మీరొక సెలబ్రిటీ అనుకుందాం. ‘అనుకోవడం ఏంటీ! నేను సెలబ్రిటీనే’ అంటారా! మరీ మంచిది.
‘ఉమెన్స్‌ డే’ కి మీకు రెండు గిఫ్టులు.
అయితే రెండూ కాదు.
ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాలి.

మొదటిది: ఆస్కార్‌ అవార్డు.
రెండోది: మీ తెలివి తేటలతో, మీ రూపలావణ్యాలతో, మీ ప్రొఫెషనల్‌ ప్రతిభా సామర్థ్యాలతో, అచ్చంగా మీలా ఉండే బార్బీ డాల్‌ మీ పేరిట మార్కెట్‌లో రిలీజ్‌ అవడం.

రెండిట్లో ఏది కోరుకుంటారు?
పైకి చెప్పక్కర్లేదులెండి. డీజే క్లారా సంతోషాన్ని చూసినవాళ్లు ఎవరైనా ఏమంటారంటే.. మీరసలు ఆస్కార్‌ వైపే చూడరని! ‘ఎలా చెప్పగలరు మీరలా!’.. అంటారా?
డీజే క్లారా ప్రస్తుతం ఆకాశం పట్టనంత సంతోషంగా ఉన్నారు. ఆమెను రోల్‌ మోడల్‌గా చూపుతూ.. బార్బీ బొమ్మలు తయారు చేస్తుండే ప్రపంచ ప్రసిద్ధ ‘మటెల్‌’ టాయ్స్‌ కంపెనీ ‘డీజే క్లారా బార్బీ’ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. సందర్భం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ‘ఒక మహిళకు ఇంతకన్నా గౌరవం ఏముంటుంది?’ అంటున్నారు క్లారా. తన రూపంలో ఉన్న ఆ కొత్త బార్బీ డాల్‌ను రెండు చేతులతో అందుకుని అపురూపంగా చూసుకుంటూ ఆమె మురిసిపోతున్నారు. 36 ఏళ్ల క్లారా యాంఫో (ఆమె పూర్తి పేరు) ఆఫ్రికన్‌ సంతతి బ్రిటిష్‌ మహిళ. లండన్‌లో బి.బి.సి. రేడియో ప్రెజెంటర్‌. బి.బి.సి టెలివిజన్‌  లో వ్యాఖ్యాత. క్లారాయాంఫో డాట్‌ కామ్‌లోకి వెళ్లి చూస్తే ఆమె గురించి అంతా తెలిసిపోతుంది. అంత ఓపిక లేకపోతే క్లారా బార్బీ డాల్‌ను చూసినా సరే. క్లారా బాహ్య సౌందర్యాన్ని, ఆమె అంతఃశక్తిని ప్రతిఫలించేలా ఉంది క్లారా బార్బీ. కంగ్రాట్స్‌ క్లారా. మీకు ఉమెన్స్‌ డే శుభాకాంక్షలు.
∙∙
బార్బీ ‘గర్ల్‌  పవర్‌’ అయితే, క్లారా ‘సూపర్‌ ఉమెన్‌’, ఇద్దరూ కలిసిన ‘పవర్‌ ఉమన్‌’.. మహిళ. ఫలానా మహిళ అని కాదు. ప్రతి మహిళా! మన మేడమ్, మన కొలీగ్, మన టీచర్, మన సహోద్యోగి, స్నేహితురాలు, అమ్మ, సోదరి, జీవిత సహచరి.. చుట్టూ ఎంత శక్తి! మనల్ని బతికిస్తున్న, మనల్ని నడిపిస్తున్న, మనిషంటే ఎలా ఉండాలో నేర్పిస్తున్న శక్తులు. ఆ శక్తులకు, సామర్థ్యాలకు ప్రతీకలే క్లారా, క్లారా బార్బీ. క్లారా మొదట డాన్సర్‌. తర్వాత డీజే (డిస్క్‌ జాకీ). బి.బి.సి. టీవీలో ‘స్ట్రిక్ట్‌లీ కమ్‌ డ్యాన్సింగ్‌’ అనే డాన్స్‌ పోటీల ప్రోగ్రామ్‌ వస్తుంటుంది. ఇప్పటికీ వస్తోంది. ‘స్ట్రిక్ట్‌లీ’ అంటారు షార్ట్‌కట్‌లో. ఆ ప్రోగ్రామ్‌ కంటెస్టెంట్‌గా వచ్చి, బి.బి.సి.లోనే రేడియో ప్రెసెంటర్‌గా ప్రసిద్ధి చెందారు క్లారా. అయితే బార్బీగా ఆమె అవతరించడానికి అదొక్కటే కారణం కాదు. జాతి వివక్షకు, జాత్యహంకారానికి వ్యతిరేకంగా గళమెత్తారు. తన జాతి హక్కుల కోసం నిలబడ్డారు. గత ఏడాది మేలో అమెరికాలో నల్లజాతి పౌరుడు జార్జి ఫ్లాయిడ్‌ హత్యకు నిరసనగా బ్రిటన్‌లో జరిగిన అనేక సభల్లో ఆమె ప్రసంగించారు. బి.బి.సి.లో ఉద్యోగం పోతుందనీ, ఉద్యోగం పోతే గుర్తింపు ఉండదని అనుకోలేదు. ఆమె నిబద్ధతని బ్రిటన్‌ గుర్తించింది. ‘ది ఫేసెస్‌ ఆఫ్‌ హోప్‌’ అంటూ బ్రిటిష్‌ ‘వోగ్‌’ పత్రిక 2020 సెప్టెంబర్‌ సంచిక కోసం తను ఎంపిక చేసిన 40 మంది సామాజిక కార్యకర్తల్లో ఒకరిగా క్లారాకు స్థానం కల్పించింది. బార్బీగా కూడా ఇప్పుడు స్థానం పొందడాన్ని క్లారా తన అదృష్టంగా భావిస్తున్నారు. ‘‘నా ప్రొఫెషనల్‌ లైఫ్‌కు లభించిన గౌరవమిది.  శక్తికి, ఆత్మవిశ్వాసానికి ఆదర్శవంతమైన ఒక బార్బీని అవడం కన్నా అదృష్టం ఏమంటుంది!’’ అంటున్నారు క్లారా ఎంతో గర్వంగా. ‘మిల్క్‌ హనీ బీస్‌’ అని లండన్‌లో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ నల్లజాతి మహిళలకు, బాలికలకు సృజనాత్మక రంగాలలో చేదోడుగా ఉంటుంది. ఆ సంస్థకు చేదోడుగా కూడా క్లారా ఉంటున్నారు.                  

కలలకు రూపం బార్బీ
ప్రపంచంలో ఎన్ని రంగాల్లోనైతే మహిళలు రాణిస్తున్నారో అన్ని రంగాల మహిళలకూ బార్బీలో రోల్‌ మోడల్స్‌ వచ్చేశాయి. ‘స్టెమ్‌’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమేటిక్స్‌) సహా దాదాపు 200 జాబ్‌ ఫీల్డ్స్‌లో బార్బీ బొమ్మలు ఉన్నాయి. ఆడపిల్లల ఆశలకు, వాస్తవాలకు మధ్య ఉండే ‘డ్రీమ్‌ గ్యాప్‌’ను చెరిపేయడానికే బార్బీ ఆవిర్భవించింది. తొలి బార్బీ 1959లో ఫ్యాషన్‌ డాల్‌గా అమెరికన్‌ మార్కెట్‌లోకి వచ్చింది. ఆ బార్బీ సృష్టికర్త రూత్‌ హ్యాండ్లర్‌ అనే మహిళ. ఆగమనంతోనే ఆడపిల్లలకు ఆత్మీయనేస్తం అయింది బార్బీ. తోబుట్టువు పుట్టినంతగా సంతోషించారు. ఆడపిల్లల్ని కనుక మనం సంతోషంగా ఉంచగలిగితే వాళ్లు ఏదైనా సాధించగలరు అని మార్లిన్‌ మన్రో అంటుండేవారు. ఒక బార్బీని కొనిచ్చినా వారు ఏదైనా సాధించగలరు. అయితే వారు కోరుకున్న బార్బీని మాత్రమే. ఎడ్యుకేషన్, మెడిసిన్, మిలటరీ, పాలిటిక్స్, ఆర్ట్స్, బిజినెస్, సైన్స్‌.. ఏ రంగలోని బార్బీని కోరుకుంటే ఆ బార్బీ. ‘స్పెషల్లీ ఏబుల్డ్‌’ బార్బీలు కూడా ఉన్నాయి. గత ఏడాది అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి (అక్టోబర్‌ 11) మానసి జోషీ బార్బీ విడుదలైంది. మానసి ప్యారా–బాడ్మింటన్‌ ప్లేయర్‌.

అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి గత ఏడాది వచ్చిన తన రోల్‌ మోడల్‌ బార్బీతో మానసి జోషి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు