భారత్‌లో సూర్యుడు ముందుగా ఉదయించే గ్రామం ఏదో తెలుసా?

17 Jul, 2021 10:42 IST|Sakshi

దేశానికి మేలుకొలుపు

మన దేశంలో అందరికంటే ముందు నిద్రలేస్తుందా గ్రామం. మిగిలిన దేశమంతా పనుల్లో ఉండగానే నిద్రకు ఉపక్రమిస్తుంది. సూర్యుడు ఐదింటికే వచ్చి పలకరిస్తాడు. సాయంత్రం కూడా అంతే తొందరగా డ్యూటీ ముగించేస్తాడు. శీతాకాలం, వర్షాలతో ఆకాశం మబ్బుపట్టి ఉన్న రోజుల్లో అయితే సాయంత్రం నాలుగున్నరకే సూర్యుడు ముసుగు తన్నేస్తాడు. ఈ భౌగోళిక విచిత్రాన్ని చూడడానికే పర్యాటకులు ఆ ఊరి బాట పడుతుంటారు. ఆ ఊరి పేరు దోంగ్‌. 

దోంగ్‌ గ్రామం అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉంది. దేశంలో తొలి సూర్యకిరణాలు తాకే చోటును, ఆ చోటు నుంచి సూర్యకిరణాల నులివెచ్చదనాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు క్యూ కడతారు. దోంగ్‌ చాలా చిన్న గ్రామం. పదేళ్ల కిందట అయితే అక్కడ ఇల్లు కట్టుకుని స్థిరంగా నివసిస్తున్న వాళ్లు పదిహేను మంది మాత్రమే. ఈ పదేళ్లలో కొంత జనాభా పెరిగింది. కానీ పర్యాటకులకు బస సౌకర్యాలు లేవు. సమీపంలోని తేజు, వాలాంగ్‌ పట్టణాల్లో బస చేసి తెల్లవారు జామున మూడు గంటల నుంచి దోంగ్‌కు ప్రయాణమవుతుంటారు. వాలాంగ్‌ నుంచి ట్రెకింగ్‌ రూట్‌ మొదలు.

కొంతమంది ట్రెకింగ్‌ను ఇష్టపడితే, అంతటి సాహసం చేయలేని వాళ్లు వాహనాల్లోనే దోంగ్‌ చేరుతుంటారు. సముద్రమట్టానికి 1, 240 మీటర్ల ఎత్తులో ఉంది దోంగ్‌. ఓ వైపు చైనా, మరో వైపు మయన్మార్‌ దేశాలు. దోంగ్‌ మన దేశానికి తూర్పు ముఖద్వారమే కానీ, ఇక్కడ పర్యటిస్తుంటే మన దేశంలో ఉన్నామనే భావన కలగదు. ఈశాన్య రాష్ట్రాల వైవిధ్యతను ఈ దోంగ్‌ టూర్‌లో ఆకళింపు చేసుకోవచ్చు. 

ఇటు కూడా చూడండి!
అందరూ ఉదయిస్తున్న సూర్యుడి కోసం కళ్లు విప్పార్చి చూస్తుంటారు, వెళ్లింది సూర్యోదయం కోసమే కాబట్టి. అదే సమయంలో ఓ క్షణం తల వెనక్కి తిప్పి చూస్తూ తొలి కిరణాలతో నారింజ రంగు సంతరించుకున్న పర్వత శ్రేణులు కనువిందు చేస్తాయి. వర్షాకాలం లో అయితే నిర్మలమైన వినీల ఆకాశం కింద, దట్టమైన మబ్బులు ఆవరించిన మేఘావరణం మీదుగా ప్రకృతితో పోరాటం చేస్తూ విజేతగా ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ పర్వతాలు ‘తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ!’ అని దేశానికి మేలుకొలుపు పాడుతున్నట్లుంటాయి.  

        

మరిన్ని వార్తలు