ఆ సమయంలో విపరీతమైన నొప్పి.. ఎందుకిలా?

28 Mar, 2021 10:53 IST|Sakshi

సందేహం

మా అమ్మాయి వయసు 13 ఏళ్లు. ఏడాది కిందట రజస్వల అయింది. నెలసరి వచ్చినప్పుడల్లా విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. చదువు మీద దృష్టి పెట్టలేకపోతోంది. దయచేసి పరిష్కారం సూచించగలరు.– రత్నమాల, పెదపాడు
సాధారణంగా పీరియడ్స్‌ సమయంలో ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ తగ్గిపోయి, ఆ నెలలో అప్పటి వరకు పెరిగిన ఎండోమెట్రియమ్‌ పొరకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. దానివల్ల ఎండోమెట్రియమ్‌ పొర గర్భాశయం నుంచి విడిపోయి, నొప్పితో పాటు బ్లీడింగ్‌ రూపంలో బయటకు రావడం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో ప్రోస్టాగ్లాండిన్‌ హార్మోన్స్‌ విడుదలవుతాయి. ఈ హార్మోన్స్‌ వల్ల గర్భాశయాన్ని కుంచించుకుని, బ్లీడింగ్‌ బయటకు రావడం జరుగుతుంది. దాని వల్ల కూడా నొప్పి ఉండవచ్చు. కొందరిలో నొప్పి ఒకరోజు ఉంటుంది. కొందరిలో బ్లీడింగ్‌ అయినన్ని రోజులూ నొప్పి ఉండవచ్చు. 

ప్రోస్టాగ్లాండిన్స్‌ విడుదలయ్యే మోతాదును బట్టి నొప్పి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కొందరిలో అసలు ఎలాంటి నొప్పీ ఉండదు. కొందరిలో తక్కువ నొప్పి, కొందరిలో ఎక్కువ నొప్పి ఉండవచ్చు. ప్రోస్టాగ్లాండిన్‌ హార్మోన్లు వేరే అవయవాల మీద కూడా ప్రభావం చూపడం వల్ల కొందరిలో పొత్తికడుపులో నొప్పితో పాటు నడుంనొప్పి, వాంతులు, మోషన్స్, తలనొప్పి వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. ఈ కారణాల వల్ల వచ్చే నొప్పి వల్ల అసౌకర్యం, ఇబ్బంది తప్ప వేరే ప్రమాదమేమీ ఉండదు. కాబట్టి ఈ సమయంలో నొప్పి ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతుంటే, నొప్పి ఉన్నన్ని రోజులు రోజుకు రెండుసార్లు నొప్పి నివారిణి మాత్రలు వేసుకోవచ్చు. అలాగే పొత్తికడుపు మీద వేడినీటితో కాపడం పెట్టుకోవచ్చు. ప్రాణాయామం వంటి బ్రీతింగ్‌ వ్యాయామాలు చేయడం మంచిది. 

ఈ వయసులో అరుదుగా గర్భాశయ నిర్మాణంలో తేడాల వల్ల బ్లీడింగ్‌ గర్భాశయంలోకి వెలువడినట్లే పొత్తికడుపులోకి వెళ్లవచ్చు. అలా కొందరిలో ఎండోమెట్రియమ్‌ పొర పొత్తికడుపులో పాతుకుని, ఎండోమెట్రియాసిస్‌ అనే సమస్య మొదలు కావచ్చు. దీనివల్ల కూడా నొప్పి తీవ్రత పెరగవచ్చు. ఏది ఏమైనా పైన చెప్పిన సలహాలను పాటిస్తూ, ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి వారి సలహాలను పాటించడం మంచిది. 

నా వయసు 23 ఏళ్లు. ఎత్తు 5.1, బరువు 78 కిలోలు. పెళ్లి కాలేదు. నేను హాస్టల్‌లో ఉంటూ జాబ్‌ చేసుకుంటున్నాను. ఏడు నెలలుగా నాకు నెలసరి రావడం లేదు. ఇదివరకు బాగానే వచ్చేది. ఇలా ఎందుకు జరుగుతోంది. నాకు భయంగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు. –నాగజ్యోతి, విశాఖపట్నం

మీ ఎత్తుకి 47 కిలోల నుంచి 55 కిలోల వరకు బరువు ఉండవచ్చు. మీ బరువు 78 కిలోలు– అంటే, ఉండాల్సిన దాని కంటే దాదాపు ఇరవై కిలోలకు పైగానే బరువు ఉన్నారు. అధిక బరువు వల్ల హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్, పీసీఓడీ వంటి సమస్యలు ఏర్పడి పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవచ్చు. అలాగే అధిక బరువు వల్ల చిన్న వయసులోనే బీపీ, సుగర్, ఆయాసం, నడుంనొప్పి, మోకాళ్ల నొప్పులు వంటివి రావచ్చు. కాబట్టి నువ్వు మొదట బరువు తగ్గడానికి ఆహార నియమాలను పాటిస్తూ, యోగా, వాకింగ్‌ లేదా ఏరోబిక్స్‌ వంటి వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. 

కాకపోతే ఏడునెలల నుంచి పీరియడ్స్‌ రాలేదు కాబట్టి ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి సీబీపీ, ఆర్‌బీఎస్, ఎస్‌ఆర్‌టీఎస్‌హెచ్‌ వంటి రక్తపరీక్షలు, పెల్విక్‌ అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించుకుని, సమస్యను బట్టి బరువు తగ్గడంతో పాటు ఇతర చికిత్సలు తీసుకోవడం మంచిది.
-డా‘‘ వేనాటి శోభ, గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు