ధర్మ దాన దీపోత్సవం

16 Nov, 2020 06:45 IST|Sakshi

బౌద్ధ వాణి

బౌద్ధం వల్ల ఎన్నో పండుగలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. వాటిలో దీపావళి ఒకటి. బౌద్ధ దీపావళికి ఒక ధార్మిక పునాది ఉంది. చారిత్రక నేపథ్యం ఉంది. అంతకుమించి ఒక మంచి సందర్భం కూడా ఉంది.అది ఇది కపిలవస్తు నగర రాజమందిరం. సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు భార్య గౌతమీ సమేతంగా శుద్ధోదన మహారాజు. ఆయన ఒక మంత్రి ని పిలిపించి –  ‘అమాత్య! నా కుమారుడు సిద్ధార్థుడు ఇల్లు విడిచి ఆరేళ్లు దాటింది. అతనిప్పుడు బోధి వృక్షం కింద సంబోధిని పొంది బుద్ధుడు అయ్యాడు. బుద్ధత్వం పొందటం అసాధారణ విషయం. అన్యులకు అసాధ్యం. ఇప్పుడు నా బిడ్డను చూడాలనే కోరిక ఉంది. వారిప్పుడు మగధ రాజధాని రాజగృహæ నగరం లోని వేణు వనంలో ఉన్నారు. మీరు వెంటనే వెళ్లి నా బిడ్డను తీసుకుని రండి’‘అన్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని ఆత్రుత. ఆనందం. 

‘ఈ అమ్మ మాట గా కూడా చెప్పండి. మీ తల్లి మిమ్మల్ని చూడాలని వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది అని చెప్పండి’ అంది గౌతమి. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు. 
రాజుగారి ఆజ్ఞ మేరకు ఆ మంత్రి రాజగృహకి వెళ్ళాడు. కానీ తిరిగి రాలేదు. ఆయన బుద్ధుని ప్రబోధం విని తాను కూడా బౌద్ధ సంఘంలో చేరి పోయాడు. భిక్షు గా మారిపోయాడు. అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత మరో మంత్రి వెళ్ళాడు. ఆయన కూడా అంతే. తిరిగి పోలేదు. అలా మొత్తం తొమ్మిది మంది మంత్రులు వెళ్లారు. ఏ ఒక్కరూ తిరిగి రాలేదు. చివరికి సిద్ధార్థుని చిన్ననాటి మిత్రుడు అయిన కాలు ఉదాయి ని పంపాడు. ఈ కాలు ఉదాయి బుద్ధుడు పుట్టిన రోజునే పుట్టాడు. సిద్ధార్థుని బాల్యమిత్రుడు. ఉదాయి వెళ్లి విషయం చెప్పి బుద్ధుని ఒప్పించాడు. అలా బుద్ధుడు తన బౌద్ధ సంఘంతో కలిసి తన జన్మ స్థలానికి బయలుదేరారు. 

జ్ఞానాన్ని పొందడం అంటే.. అజ్ఞానపు చీకట్లను పారద్రోలడం. అది చీకటి ని చీల్చి వెలుగులు విరజిమ్మే విజ్ఞానపు వెలుగు దీపం. కాబట్టి విజ్ఞానానికి  వెలుగుల దీపం  ప్రతీక కాబట్టి తన బిడ్డ నడిచివచ్చే దారిపొడవునా... ఊరూరా.... దీపాలు వెలిగించి స్వాగతం పలికే ఏర్పాటు చేశాడు శుద్ధోదనుడు.

బుద్ధుడు బహుళ చతుర్దశి  నాటికి కపిలవస్తు నగరం లో అడుగుపెట్టాడు. ఆరోజు బౌద్ధులకు అతి ముఖ్యమైన రోజు. ఉపవాసం పాటించే పర్వదినం. కాబట్టి నగరాన్ని అంతా దీపాలతో అలంకరించి బుద్ధునికి స్వాగతం పలికారు కపిలవస్తు ప్రజలు. అలా ఆనాటినుండి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు వేలాది దీపాలతో బౌద్ధ ఆరామాలను... స్తూపాలను అలంకరించి సంప్రదాయం మొదలైంది. అందుకే ఈ స్తూపాలకు దీపాలదిన్నెలు అనే పేరు వచ్చింది. గహస్తులు ఈరోజు తమ ఇండ్లను దీపాలతో అలంకరించి విశేషంగా దానధర్మాలు చేస్తారు. కాబట్టి ఈ పండుగను ధర్మ దాన దీపోత్సవం గా కూడా పిలుస్తారు. ప్రపంచంలో అందరూ విశేషంగా జరుపుకుంటారు. 
–డా. బొర్రా గోవర్ధన్‌

మరిన్ని వార్తలు