ఓవరీస్‌ లేవని చెప్పారు

7 Mar, 2021 09:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సందేహం

మా అమ్మాయి వయసు 17 ఏళ్లు. ఇంతవరకు రజస్వల కాలేదు. వైద్యపరీక్షలు చేయించితే, అమ్మాయికి యుటెరస్, ఓవరీస్‌ లేవని చెప్పారు. మా అమ్మాయి పెళ్లికి పనికొస్తుందా?
– త్రివేణి, మైసూరు

ఆడవారిలో గర్భాశయం, అండాశయాలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తయారవుతాయి. కాని కొందరిలో కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల, ఎలాగైతే వేరే అవయవాలు సరిగా ఏర్పడవో అలాగే పుట్టుకతోనే కొందరిలో గర్భాశయం ఉండదు. కొందరు గర్భాశయంతోపాటు అండాశయాలు కూడా లేకుండా పుడతారు. వీరికి ఏ విధంగాను పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. వీరిలో కొందరిలో యోని భాగం బాగానే ఉంటుంది. కొందరిలో సరిగా ఉండదు. మూసుకుపోయి ఉంటుంది. యోని ద్వారం సరిగా ఉంటే పెళ్ళి చేసుకుంటే వైవాహిక జీవితానికి ఇబ్బంది ఉండదు. ఒకవేళ యోనిద్వారం మూసుకుపోయి ఉంటే పెళ్ళికి ముందే వెజైనోప్లాస్టీ అనే ఆపరేషన్‌ ద్వారా క్రింద నుండి యోనిభాగాన్ని తయారుచెయ్యడం జరుగుతుంది. దీనివల్ల కలయికకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఈ సమస్యలను పెళ్ళికి ముందే అబ్బాయికి, వారి తరఫు వారికి చెప్పి పెళ్ళి చెయ్యవలసి ఉంటుంది. లేకపోతే తర్వాత మనస్పర్థలు ఏర్పడి గొడవలు వస్తాయి. వీరికి అండాశయాలు లేకపోవడం వల్ల వీరి శరీరంలో నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తి ఉండదు. దీనివల్ల వారికి వక్షోజాలు సరిగా పెరగక చిన్నగా ఉండటం, చంకల్లో, జననేంద్రియాల వద్ద రోమాలు లేకపోవడం, స్త్రీ శరీరాకృతి అంతగా ఉండకపోవడం, వయసుపెరిగే కొద్దీ ఎముకల దృఢత్వం తగ్గి ఆస్టియోపోరోసిస్‌ సమస్య తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరికి వారి శరీరతత్వాన్ని బట్టి డాక్టర్‌ పర్యవేక్షణలో సమయానుగుణంగా అవసరమైతే ఈస్ట్రోజన్‌ హార్మోన్స్‌లో చికిత్స (హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌) ఇవ్వవలసి ఉంటుంది.
- డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు