నాకు ఫిట్స్‌, ప్రయత్నిస్తే సమస్యలొస్తాయా?

28 Feb, 2021 11:25 IST|Sakshi

సందేహం

నా వయసు 27 ఏళ్లు. పదేళ్లుగా ఫిట్స్‌తో బాధపడుతున్నాను. దీనికి డాక్టర్లు చెప్పిన మందులు కూడా వాడుతున్నాను. నెల్లాళ్ల కిందటే నాకు పెళ్లయింది. ఫిట్స్‌ సమస్యకు మందులు వాడుతుండగా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తే సమస్యలేవైనా వస్తాయా? దయచేసి వివరించగలరు.
– రచన, తణుకు

ఈ పది సంవత్సరాలలో ఫిట్స్‌ మళ్లీ వచ్చాయా, వస్తే ఎన్నిసార్లు వచ్చాయి? లేదా మందులు వాడటం వల్ల మళ్లీ అసలు ఫిట్స్‌ రాలేదా అనే అంశాలు తెలియవలసి ఉంది. ఈ మధ్యకాలంలో ఫిట్స్‌ రాకపోతే ప్రెగ్నెన్సీలో సమస్యలు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే ఫిట్స్‌ మందుల మోతాదు కూడా ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉండదు. ఫిట్స్‌కు వాడే అనేక రకాల మందుల వల్ల పుట్టబోయే బిడ్డలో నాడీ వ్యవస్థలో లోపాలు, గుండె సమస్యలు వంటి అవయవలోపాలు ఏర్పడే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గర్భం దాల్చకముందే మీ నరాల (న్యూరోఫిజీషియన్‌) డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. వారు అతి తక్కువ దుష్ఫలితాలు ఉన్న మందులను వీలైనంత మోతాదులో అవసరాన్ని బట్టి మార్చి ఇవ్వడం చేస్తారు. కాబట్టి పుట్టబోయే బిడ్డలో సమస్యలు ఉండే అవకాశాలు కొద్దిగా తగ్గుతాయి. గర్భం సమయంలో ఫిట్స్‌ మందులు న్యూరోఫిజీషియన్‌ పర్యవేక్షణలో సక్రమంగా వాడుతూ, గైనకాలజిస్ట్‌ దగ్గర నెలనెలా చెకప్‌లు, అవసరమైన పరీక్షలు, స్కానింగ్‌లు చేయించుకుంటూ ఉంటే, సమస్యలు ఎక్కువ లేకుండా పండంటి బిడ్డకు జన్మనివ్వచ్చు.

మేడమ్‌! నా వయసు 38 సంవత్సరాలు. ఏడాదిగా నాకు పీరియడ్స్‌ రెగ్యులర్‌గా రావడం లేదు. పీరియడ్స్‌ వచ్చినప్పుడు బ్లీడింగ్‌ ఎక్కువగా ఉంటోంది. కడుపులో నొప్పిగా ఉంటోంది. మా అమ్మ సర్వైకల్‌ కేన్సర్‌తో చనిపోయింది. నాకు కూడా కేన్సర్‌ వస్తుందేమోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు.
– రాధ, చిత్తూరు

ఈ వయసులొ పీరియడ్స్‌ సమయంలో ఎక్కువ బ్లీడింగ్, కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. నీ బరువు, ఎత్తు రాయలేదు. ఒక్కొక్కరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి, గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్లు, ఫైబ్రాయిడ్స్, కంతులు, పాలిప్స్, అడినోమయోసిస్, అండాశయాలలో సిస్ట్‌లు, కంతులు వంటి కారణాలు ఉండవచ్చు. థైరాయిడ్‌ సమస్య వల్ల కూడా బ్లీడింగ్‌ కొందరిలో ఎక్కువ లేదా కొందరిలో తక్కువ అవ్వవచ్చు. ఈ వయసులో క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ఈ లక్షణాలు ఎక్కువగా ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌లో ఉండే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. కాని ఇందులో బ్లీడింగ్‌ మధ్యమధ్యలో కూడా ఉంటుంది.

నొప్పి ఎక్కువగా ఉండదు. కానీ సర్వైకల్‌ క్యాన్సర్‌ లక్షణాలు ఇలా ఉండవు. ఇందులో తెల్లబట్టతో పాటు ఎరువు జీరలు లాగా అంటే స్పాటింగ్‌ లాగా ఉండటం వంటి లక్షణాలు ఉండవచ్చు. కొందరిలో లక్షణాలేమీ లేకుండా కూడా స్పెక్యులమ్‌ పరీక్ష, ప్యాప్‌స్మియర్, సర్వైకల్‌ బయాప్సి వంటి పరీక్షలలో నిర్ధారణ అవ్వవచ్చు. సర్వైకల్‌ క్యాన్సర్‌ జన్యుపరంగా వచ్చే అవకాశాలు, ఎండోమెట్రియల్, అండాశయ (ఒవేరియన్‌) క్యాన్సర్‌తో పోలిస్తే చాలా తక్కువ. ఏది ఏమైనప్పటికీ, నీ లక్షణాలతో ఇబ్బంది పడుతూ, నీకు నువ్వే ఏదో ఊహించేసుకుని భయపడుతూ ఉండే దానికంటే ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, స్పెక్యులమ్‌ ఎగ్జామినేషన్, ప్యాప్‌స్మియర్, అల్ట్రాసౌండ్‌ పెల్విస్, సిబిపి, థైరాయిడ్‌ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, సమస్య ఎక్కడ ఉందో నిర్ధారణ చేసుకుని సరైన చికిత్స తీసుకోవడం మంచిది.
- డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు