Cough Problem: దగ్గును బలవంతంగా ఆపుకోకండి!

4 Sep, 2022 13:05 IST|Sakshi

పదిమంది మధ్య ఉన్నప్పుడు బలంగా అదేపనిగా దగ్గు వస్తుంటే చాలామంది ఆపుకోడానికి ప్రయత్నిస్తుంటారు. దగ్గడం అన్నది సాధారణంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యానికి సూచన. చాలా జబ్బుల్లో అదో లక్షణం. అదే సమయంలో దగ్గడం అనే ప్రక్రియ మనల్ని కొన్ని సమస్యల నుంచి రక్షిస్తుంది కూడా. అందుకే దగ్గు వస్తున్నప్పుడు మీటింగ్‌లో ఉన్నామనో, లేదా నలుగురిలో ఇబ్బంది అనో దాన్ని ఆపకూడదనీ, అణచివేయకూడదని సూచిస్తున్నారు వైద్యనిపుణులు. 

దగ్గినప్పుడు మన శ్వాసనాళాల్లోని గాలి చాలా వేగంగా బయటకు వస్తుంటుంది. దాంతో దేహంలోపల ఉన్న అవాంఛిత స్రావాలు బయటకు వెళ్లిపోతాయి. ఊపిరితిత్తుల్లో స్రావాలు అక్కడే ఉండిపోయినా, అక్కడి వాయునాళాల్లో అవి అడ్డుపడ్డా, గట్టిగా దగ్గు వస్తుంది. అలాంటప్పుడు దగ్గితే... కళ్లె / కఫం బయటపడుతుంది. ఫలితంగా మనకు కీడు చేసే స్రావాలను దగ్గు బయటకు పంపించి వేస్తుంది కాబట్టే దగ్గును ఆపుకోకూడదు. వీలైతే మందులతోనూ  అణచివేయకూడదు.  

కానీ దగ్గు వల్ల బాధితులకు నిద్రలేకపోయినా, లేదా పనులకు ఆటంకం కలుగుతున్నా,  హెర్నియా వంటి జబ్బులు ఉన్నా... కేవలం ఇలాంటి కొన్ని సందర్భాల్లో మాత్రమే పొడి దగ్గును ఆపడానికి మందులు వాడాలి. నిజానికి దగ్గు అనేది జబ్బు కాదు. మనల్ని రక్షించేందుకు ఉన్న ప్రక్రియ. అందుకే దగ్గు వస్తున్నప్పుడు అది ఏ కారణంగా వస్తుందో తెలుసుకొని, దానికి చికిత్స తీసుకోవాలి. అప్పుడు సమస్యా తగ్గుతుంది. ఆటోమేటిగ్గా దగ్గు కూడా తగ్గుతుంది.  

చదవండి: నరకానికి ప్రవేశ ద్వారం.. 2200 సంవత్సరాలుగా!

మరిన్ని వార్తలు