కూల్‌డ్రింక్స్‌ తాగితే లావెక్కుతాం.. ఎందుకో తెలుసా?

27 Aug, 2021 20:40 IST|Sakshi

కూల్‌డ్రింక్స్‌ తాగితే లావెక్కుతారని చాలా కాలంగా తెలుసు. అందుకే వాటిని జంక్‌ఫుడ్‌ జాబితాలో చేర్చారు. అయితే ఎందుకు అలా జరుగుతుందన్నది మాత్రం స్పష్టంగా తెలియదు. అమెరికాకు చెందిన వీల్‌ కార్నెల్‌ మెడిసన్‌ శాస్త్రవేత్తలు ఈ లోపాన్ని పూరించారు. కూల్‌డ్రింక్స్‌తోపాటు అనేక ఇతర ఆహార పదార్థాల్లో వాడే హై ఫ్రక్టోస్‌ కార్న్‌ సిరప్‌ (హెచ్‌ఎఫ్‌సీఎస్‌) వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా నిల్వ అవుతోందని, ఇదే అనారోగ్య హేతువు అవుతోందని వారు నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. హెచ్‌ఎఫ్‌సీఎస్‌లు చిన్నపేగుల్లోని కణాల్లో కొన్ని మార్పులు జరిగేందుకు కారణమవుతోందని, ఫలితంగా పోషకాలు ఎక్కువ మొత్తంలో శరీరానికి చేరి లావెక్కుతున్నారని వారు చెబుతున్నారు. 
చదవండి: సూపర్‌ కెపాసిటర్‌! చిన్నగా ఉందని చిన్నచూపు చూస్తే దెబ్బతింటారు

ఈ రకమైన చక్కెరలను అధికంగా తీసుకుంటే ఆహారంలోని కొవ్వును ఎక్కువగా శోషించుకునే పరిస్థితి వస్తుందని వివరించారు. 2019లో పేగు కేన్సర్‌పై జరిగిన ఒక పరిశోధన ఫ్రక్టోస్‌ కాస్తా కేన్సర్‌ కణితి పెరుగుదలకు దోహదపడుతుందని తేలడంతో దాని వెనుక ఉన్న కణస్థాయి వ్యవస్థలను తెలుసుకునేందుకు తాజా పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగానే చిన్నపేగుల్లోని ఇతర కణాలపై ఫ్రక్టోస్‌ ప్రభావాన్ని పరిశీలించారు.

చిన్నపేగుల్లో వెంట్రుకలను పోలినట్లు ఉండే కోట్లాది నిర్మాణాలైన ‘విల్లీ‘లు పోషకాలను శోషించుకునేందుకు ఉపయోగపడుతుంటాయి. ఎలుకలకు హెచ్‌ఎఫ్‌సీఎస్‌లు ఎక్కువగా ఇచ్చినప్పుడు ఈ విల్లీల పొడవు 40 శాతం వరకూ పెరగడమే కాకుండా.. బరువు కూడా ఎక్కువైనట్లు తేలింది. కణాల్లో ఫ్రక్టోస్‌–1–ఫాస్పేట్‌ ఎక్కువగా పేరుకుపోతుండటం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త శామ్యూల్‌ టేలర్‌ తెలిపారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు