కాఫీ ఎక్కువైతే.. కంగారే!

11 Apr, 2022 09:14 IST|Sakshi

పొద్దున లేవగానే కాఫీ చుక్క గొంతులో పడనిదే రోజు గడవదు చాలామందికి. కానీ అదే కాఫీ పరిమితి మించితే మాత్రం కంగారు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మం నుంచి కంటి దాకా ఎన్నో సమస్యలనూ కాఫీ తెచ్చిపెడుతుందని ఈ అంశంపై పరిశోధనలు చేసిన ఈస్తటిక్‌ క్లినిక్‌ ఫౌండర్‌ డాక్టర్‌ అహ్మద్‌ ఎల్‌ మాంటసర్‌ హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలేంటి.. వాటి నుంచి తప్పించుకోవడం ఎలాగంటే.. 

వయసు పెరిగిపోద్ది.. 
బాగా వర్క్‌ ప్రెషర్‌తోనో, ఇంకేదో ఒత్తిడితోనో కాఫీ తెగ తాగేస్తూ ఉంటాం. చిత్రమేంటంటే.. కాఫీ ఎక్కువైతే కిడ్నీలు కార్టిసాల్‌ అనే హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయట. మరి ఈ కార్టిసాల్‌తో మన చర్మంలోని గ్రంధుల నుంచి నూనె స్రావాలు పెరుగుతాయని.. చర్మ రంధ్రాలు మూసుకుపోయి.. మొటిమలు, ఇతర సమస్యలు వస్తాయని మాంటసర్‌ చెప్తున్నారు.

దీనికితోడు ఆల్కహాల్‌ తరహాలోనే కెఫీన్‌ అధికంగా తీసుకుంటే.. డీహైడ్రేషన్‌కు దారితీస్తుందని, చర్మం పొడిబారి కాంతివిహీనంగా మారుతుందని అంటున్నారు. అంటే.. ఈ సమస్యలతో ఎవరైనా వారి వయసుకు మించి కనబడతారని వివరిస్తున్నారు. 
– సాధారణంగా రోజూ తాగే నీటితోపాటు.. ప్రతి కప్పు కాఫీకి మరో గ్లాసు నీళ్లు అదనంగా తాగాలని హార్మోన్‌ స్పెషలిస్టు సోఫీ షాటర్‌ సూచిస్తున్నారు. దానివల్ల సమస్య కొంత ఉపశమిస్తుందని అంటున్నారు. 


 
రిలీఫ్‌ కాదు.. చిరాకు.. 
కాఫీ ఎక్కువైతే శరీరంలో అడ్రినల్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరుగుతుందని.. దీనితో రక్తపోటు పెరిగి, నిద్రలేమికి దారితీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. సరిగా నిద్ర లేకపోవడం వల్ల మానసిక సమస్యలకు కారణమవుతుంది. కాఫీ అలవాటు ఎక్కువగా ఉన్నవారిలో 33శాతం మందికి నిద్ర సమస్య వస్తోందని పరిశోధనల్లో వెల్లడైంది కూడా. ఇక అధిక కెఫీన్‌ వల్ల మెదడుకు రక్త సరఫరా తగ్గి.. మానసిక ఆందోళన పెరుగుతుందని, ఏకాగ్రత తగ్గిపోతుందని నిపుణులు చెప్తున్నారు. 

– కాఫీ అలవాటును నియంత్రించుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్ర పోవడానికి రెండు, మూడు గంటల ముందు నుంచీ కాఫీకి దూరంగా ఉండాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. 

స్ట్రోక్‌.. మైగ్రేన్‌ ప్రమాదం కూడా.. 
కాఫీలోని కెఫీన్‌కు వ్యసనంగా మారే లక్షణం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. కాఫీ తీసుకున్నప్పుడు మెదడు, చుట్టూ ఉన్న ప్రాంతాల్లో రక్తనాళాలు సంకోచానికి గురవుతాయని.. తాగడం ఆపేసినప్పుడు వ్యాకోచించి తలనొప్పి వస్తుందని అంటున్నారు. ఇది కొందరిలో మైగ్రేన్‌కు దారితీస్తుందని వివరిస్తున్నారు. అందువల్లే తలనొప్పి అనిపించినప్పుడల్లా కాఫీ తాగుతూ.. అదో అలవాటుగా మారుతుందని పేర్కొంటున్నారు. కొందరిలో రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగడం, కండరాలు మెలితిప్పినట్టు, తిమ్మిరిగా అనిపించడం, చేతులు వణకడం..వంటివీ తలెత్తుతాయని అంటున్నారు. 
– ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు కాఫీ వినియోగాన్ని తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. లేకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు. 

కంటి సమస్యలకూ దారి.. 
అధిక కెఫీన్‌ రక్తపోటును పెంచడం వల్ల.. కళ్లకు రక్తాన్ని సరఫరా చేసే సన్నని రక్తనాళాలు దెబ్బతిని, కంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో రెటీనా దెబ్బతినే ప్రమాదమూ ఉంటుందని అంటున్నారు. 
– రోజుకు మూడు కప్పులకు మించి కాఫీ తాగితే.. కంటి సమస్యలను కొని తెచ్చుకోవడమేనని, తగ్గిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.  

 –సాక్షి, సెంట్రల్‌డెస్క్‌ 

మరిన్ని వార్తలు