ఇకపై క్యాన్సర్‌తో కాళ్లూ, చేతులు కోల్పోనక్కర్లేదు! 

31 Jul, 2021 23:17 IST|Sakshi

గతంలో క్యాన్సర్‌ కాళ్లూ లేదా చేతులకు సంబంధించిన ఎముకలకు సోకిందంటే... దాన్ని దేహం నుంచి వేరు చేయాల్సిన పరిస్థితి ఉండేది. అలా చేయడాన్ని ఇంగ్లిష్‌లో ‘యాంపుటేషన్‌’గా వ్యవహరిస్తారు. దాంతో ఇక ఆ వ్యక్తి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి రాకుండా కాపాడదామంటే క్యాన్సర్‌ అలా అలా ఆరోగ్యకరమైన కణజాలానికి పాకుతూ పరిస్థితిని మరింత దుర్భరం చేస్తుందన్న అంశం తెలిసిందే కదా. కానీ ఇప్పుడు సాంకేతిక పురోగతి, అధునాతన వైద్యవిజ్ఞానాల నేపథ్యంలో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. గతంలో లాగా ఇప్పుడూ కాళ్లూ, చేతుల యాంపుటేషన్‌ లేకుండా... వాటిని రక్షించేందుకు చాలావరకు మార్గం సుగమమైంది. అందుకు దోహదపడేదే ‘లింబ్‌ సాల్వేజ్‌ సర్జరీ’. ఆ ప్రక్రియపై అవగాహన కలిగించే కథనమిది. 

లింబ్‌ సాల్వేజ్‌ సర్జరీ అంటే..?
క్యాన్సర్‌ గడ్డలనూ, వ్రణాలను శస్త్రచికిత్సతో తొలగిస్తారన్న విషయం తెలిసిందే. ఒకవేళ అది ఎముకకు పాకితే కేవలం ఆ గడ్డ (ట్యూమర్‌)ను మాత్రమే కాకుండా... చుట్టుపక్కల ఉండే కొంతభాగాన్ని కూడా తొలగిస్తారు. ఎందుకంటే ఒకవేళ అక్కడ పొరబాటున చిన్నపాటి క్యాన్సర్‌ కణం ఉన్నా... మళ్లీ అది పెరుగుతూ, వ్యాప్తిచెందుతూ నష్టం చేస్తుంది. కాలు లేదా చేయి విషయంలోనూ ఇదే జరుగుతుంది కాబట్టి గతంలో ప్రభావితమైన ప్రాంతాన్ని తొలగించడంలో భాగంగా కాలూ, చేతినీ తీసేయాల్సి వచ్చేది. అయితే అలా కాకుండా చాలా సునిశితంగా కేవలం ప్రభావితమైన గడ్డ మేరకు తొలగించి, ఎముకలోనూ ప్రభావితమైన ప్రాంతంలో కొత్త ఎముక భాగాన్ని తిరిగి అతికించేలా సర్జరీ నిర్వహించడాన్ని ‘లింబ్‌ సాల్వేజ్‌ సర్జరీ’గా చెప్పవచ్చు. 
మిగతా అవయవభాగాలతో పోలిస్తే ఎముక భాగంలో ఇలా కొత్త ఎముకను గ్రాఫ్ట్‌ చేయడం ఒకింత సవాలుతో కూడిన విషయం. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి తేడా రాకుండా జాగత్తగా శస్త్రచికిత్స నిర్వహించాలి. ఇందుకోసం కొన్ని ప్రక్రియలు అవలంబించాల్సి వస్తుంది. అవి... 

అల్లోగ్రాఫ్ట్‌ బోన్‌ రీప్లేస్‌మెంట్‌ : అవయవదానంలో భాగంగా బ్రెయిన్‌డెడ్‌గా  మృతిచెందిన వ్యక్తుల నుంచి గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కళ్లు (కళ్ల విషయంలోనైతే మృతి చెందాక కూడా కొంతసమయం వరకు సేకరించవచ్చు) వంటివి సేకరించడం మామూలే. ఇదే తరహాలో... మృతిచెందిన ఆరోగ్యవంతుడి దేహం నుంచి ఎముకలను సేకరించి,  బోన్‌బ్యాంక్‌లో సుస్థిరపరుస్తారు. ఇలా సుస్థిరపరచిన ఎముకను... బాధితుడి దేహం నుంచి క్యాన్సర్‌కు లోనైన ఎముక పరిసర భాగాన్ని తొలగించిన ప్రదేశంలో, అవసరమైన మేరకు గ్రాఫ్ట్‌ చేస్తూ అమర్చడమే ‘అల్లోగ్రాఫ్ట్‌ బోన్‌ రీప్లేస్‌మెంట్‌’. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులు, పరిమితులు ఉన్నాయి. ఒక్కోసారి ఇలా చేసే సమయంలో ఇన్ఫెక్షన్లు, గ్రాఫ్ట్‌ చేసిన చోట ఫ్రాక్చర్‌ కావడం వంటి సమస్యలు రావచ్చు. 

ఎండోప్రోస్థెసిస్‌ : ఈ ప్రక్రియతో లింబ్‌ సాల్వేజ్‌ చికిత్సలో పెను మార్పులు వచ్చాయి. ఎముకను రక్షించడంలో ఈ ఎండోప్రోస్థెసిస్‌ విప్లవాత్మకమైన భూమిక పోషిస్తోంది. ఇందులో మృతుడి శరీరం నుంచి కాకుండా... ఎలాంటి రసాయన చర్యలకు లోనుకాని లోహం (ఇనర్ట్‌ మెటల్‌)తో తయారు చేసిన... ఎముకకు ప్రత్యామ్నాయ భాగాన్ని అవసరమైన చోట అమరుస్తారు. సాధారణంగా ఆ భాగాన్ని ‘టైటానియమ్‌’ అనే లోహంతో రూపొందిస్తుంటారు. ఇందులోనూ కొన్ని ఇబ్బందులున్నాయి. ఇలా కృత్రిమంగా రూపొందించిన భాగాల జీవితకాలం చాలా పరిమితంగా ఏ పది లేదా పదిహేనేళ్లు ఉంటుంది. ఇది ఎండోప్రోస్థెసిస్‌ లో ఉండే పరిమితి. 

టీష్యూ రీజనరేషన్‌ : కాళ్లూ–చేతులను రక్షించే ఈ లింబ్‌ సాల్వేషన్‌ లో... టిష్యూ రీజనరేషన్‌ అన్నది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రంగం. బాధితుడి సొంత కణాలను సేకరించి, ‘ప్యూరిఫైడ్‌ ప్రోటీన్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌’లాంటి చర్యలతోనూ, ‘సింథటిక్‌ మాట్రిక్స్‌ మెటీరియల్‌’ లాంటి కృత్రిమ పదార్థాలతో... బాధితుడు కోల్పోయిన అదే కణాలూ, కణజాలాలను... మళ్లీ ముందులాగే పెరిగేలా చేయడమే ఈ ‘టిష్యూ రీజనరేషన్‌’ ప్రక్రియ. ఇలా చేయడానికి కాలు లేదా చేతిలోని ఇతర కణజాలాలు, కండరాలూ, ఎముకలూ, కీళ్లు బలంగా ఉండాలి. ఆ తర్వాత కూడా...  కృత్రిమంగా కణజాలం పెరిగిన చోట... అంతకుముందులాగే నాడీకణాల వ్యవస్థ–నరాలూ...  అలాగే రక్తప్రసరణ వ్యవస్థలోని రక్తనాళాలూ అంతకుమునుపు ఉన్నట్లే పెరిగేలా చేయగలగాలి. అప్పుడే కాళ్లూ, చేతులు అంతకుముందులాగే పనిచేయగలుగుతాయి. 

‘లింబ్‌ స్వాలేషన్‌’ సా«ధ్యం కాని పరిస్థితులు 
ఎముకకు క్యాన్సర్‌ సోకడం వల్ల అది బలహీనమై విరిగిన సందర్భంలో (పాథలాజికల్‌ ఫ్రాక్చర్స్‌). 
అంతకు మునుపు నిర్వహించిన బయాప్సీలో తేడాలు 
క్యాన్సర్‌ సోకిన ఎముకను క్యూరెటేజ్‌ చేసి తొలగించినప్పుడు
కీమోథెరపీ తర్వాత కూడా క్యాన్సర్‌ ఆగకుండా అదేపనిగా విస్తరిస్తూ ఉండటం. 

పై కండిషన్స్‌ మినహా ఇప్పుడు చాలా సందర్భాల్లో కాళ్లూ–చేతులను కోల్పోవాల్సిన పరిస్థితులను వీలైనంతగా తగ్గించడమిప్పుడు సాధ్యమవుతోంది. ఇదీ ఇటీవలి కాలంలో వైద్యరంగంలో చోటు చేసుకున్న మంచి పురోగతి.


డా. అజయ్‌ చాణక్య వల్లభనేని, కన్సల్టెంట్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ అండ్‌ రోబోటిక్‌ సర్జన్‌ 

మరిన్ని వార్తలు