కథ: భర్త దగ్గర లభించని సాంత్వనేదో మనసును మెలితిప్పసాగింది! ఆ తర్వాత..

10 Apr, 2022 14:11 IST|Sakshi

‘దిక్కుమాలిన వాన.. ఇప్పుడే తగులుకోవాలా? కాసేపు ఆగాక రాకూడదూ’ ఆకాశం వైపు చూస్తూ తనలో తనే అనుకుంది యామిని. కడుపునిండా నీళ్లు తాగిన ఏనుగుల గుంపు హడావిడిగా తిరుగుతున్నట్లుగా దట్టమైన మేఘాలతో నిండిపోయింది ఆకాశం. ఎక్కడెక్కడికో ఎగిరెళ్ళిన పక్షలన్నీ గూళ్లకు చేరుకోవడానికి ఆరాటపడి గుంపులు గుంపులుగా ఆకాశాన్ని కమ్మేశాయి.

చూస్తుండగానే సాయంకాల పగటి గీతలన్నీ కాటుక పూసినట్లుగా నల్లగా మారిపోసాగాయి. చెట్లన్నీ సామూహిక బృందగానం చేస్తున్నట్లుగా పెద్దగా చప్పుడు చేస్తూ ఊగసాగాయి. యామిని మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఇంట్లోనుంచి వాకిట్లోకి, వాకిట్లో నుంచి ఇంట్లోకి తిరుగుతూ లోలోపలే  గొణుక్కోసాగింది. ఆలోచనలు అదుపుతప్పిన గుర్రంలా పరుగులు తీయసాగాయి.     

‘ఏమయిందే.. కాలుగాలిన పిల్లిలాగా లోపలికీ బయటికీ తిరుగుతున్నావ్‌. దండెం మీద బట్టలన్నీ ఇంట్లోకి  తెస్తావా? లేక తడిసిపోతున్న వాటిని చూస్తూ బయటే నుంచుంటావా? ఏమిటో నీ వాలకం అర్థం కాకుండా ఉంది’ అత్తగారి మాటలతో ఈ లోకంలోకి వచ్చిన యామిని అదిరిపడి ఆమెవైపు చూసి ఒక్కసారిగా గతుక్కుమంది. 

తనను, తన ఆలోచనలను చదివేస్తున్నట్లుగా మాట్లాడుతున్న అత్తవంక అయోమయంగా చూస్తూ ఏమీ మాట్లాడకుండా నిల్చున్న యామినిని చూస్తూ ‘పెద్దదాన్ని.. నా మాటంటే ఎలాగూ లెక్కలేదు. కనీసం కడుపున పుట్టిన కాయలమీదైనా కాసింత ప్రేముండొద్దూ’ అంది.               

వసారాలోని అరుగుమీద ఆడుకుంటున్న పిల్లలవంక చూసింది యామిని. మెరుస్తున్న మెరుపులు, కురుస్తున్న చినుకులు తమకోసమే అన్నట్లుగా చూపుల్లో స్వచ్ఛతను, ముఖంలో అమాయకత్వాన్ని నింపుకుని ఎవర్నీ పట్టించుకోకుండా ఆడుతున్నారు పిల్లలు. ఐదేళ్లు నిండిన పెద్దపాప పెద్ద ఆరిందలా మారిపోయి మూడేళ్ల చిన్నపాపకి ఆకాశాన్ని చూపిస్తూ ఏదో చెప్పసాగింది.

చిన్నపాపకి ఏదో అర్థమైనట్లుగా తలాడిస్తూ మధ్యమధ్యలో నవ్వులు చిందిస్తోంది. చూపు పిల్లల మీద నుంచి వానచినుకుల మీదకు మళ్ళించింది. వానంటే పెద్ద వానా కాదు.. అలాగని బయటికి వెళ్తే తడవకుండా రావడం కూడా సాధ్యం కాదు. కానీ వెళ్లాలి! ఎలాగైనా వెళ్లాలి. భర్త అనుమానపు చూపుల ముళ్లనుంచి, అత్తగారి ఆంక్షల నుంచి, కాళ్లకు చుట్టుకునే పిల్లల బంధనాలను విడిపించుకుని కాసేపైనా వెళ్లిరావాలి.

అతని చూపుల సుడిగుండంలో కొట్టుకుపోవాలి. మాటల ప్రవాహంలో మైమరచిపోవాలి. ఏదో స్థిరనిశ్చయానికి వచ్చినట్లుగా వసారాలోకి నడిచింది. నేలమీద కూర్చున్న అత్తగారి వీపుమీద పెద్దది, ఒడిలో చిన్నది కూర్చుని ఆడుకుంటూ కనిపించారు. ఆమెను సమీపించి ‘అత్తయ్యా.. ఒకసారి బయటికి వెళ్ళొస్తాను’ అంది యామిని.                     
అత్తగారి కళ్లల్లో ఉరుములు కనిపించాయి.  ‘తొందరగా వచ్చేస్తాను’ అంది యామిని.  ‘ఎందుకు?’ ‘రజనిని కలవాలి. ఈ సాయంత్రం వస్తానని చెప్పాను. తీరాచూస్తే వాన మొదలయింది’  . ‘వాన మొదలయిందని నువ్వే అంటున్నావు. ఎలా వెళ్తావు మరి?’   ‘గొడుగేసుకుని..’                 

అత్తగారు పళ్లకొరుకుతూ కొరకొరా చూస్తూ ‘వాడొస్తాడుగా.. తీసుకుని వెళ్లు’ అంది.   ‘అలసిపోయి వస్తారుగా మళ్ళీ ఇబ్బంది పెట్టడమెందుకు? నేను వెళ్లొస్తాను. పర్లేదు ’ అంది యామిని. ‘మరి పిల్లలు..’         

‘అన్నం తినిపించి..’ యామిని వాక్యం పూర్తి కాకుండానే ‘జోల కూడా పాడి నిద్రపుచ్చుతాను. నువ్వు మాత్రం చక్కగా గొడుగులేసుకుని అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అడ్డమైన వాళ్లని కలిసిరా’ అత్తగారి స్వరంలో తీవ్రత పెరగడం యామిని దృష్టిని దాటిపోలేదు. 

‘వానవల్ల చీకటి పడిందిగానీ టైం ఇంకా ఆరు కూడా దాటలేదు’ అంది యామిని. ‘ఆరుదాటిందో  ఏడుదాటిందో అరవై దాటినదాన్ని నాకెలా తెలుస్తుంది? నీకులాగా చదువుకున్నానా ఏమన్నానా? నువ్వంటే అన్ని కాలాలనూ చదివేశావు. నాదంతా వానాకాలం చదువు. నీకెలా తోస్తే అలా చెయ్‌’ ఉరిమినట్లు చూస్తున్న అత్తగారి చూపుల నుంచి తప్పించుకుని ఉరికినట్లుగా అక్కడినుంచి కదిలింది యామిని.        

గోడమేకుకి వేళాడుతున్న నల్లటి గొడుగును తీసుకుని బెడ్రూములోకి వెళ్లి నిలువుటద్దం ముందు నుంచుని చెదిరిన తలను, నలిగిన బట్టల్ని సరిచేసుకుంది యామిని. గదిలోనుంచి వసారాలోకి, అక్కడినుంచి వాకిట్లోకి నడిచింది. అత్తగారిని చూడడానికి ధైర్యం సరిపోలేదు. ఆవిడ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక లేదు. ముందు అక్కడినుంచి బయటపడాలనే తపన ఆమెను తొందర పెట్టింది.             

నేలంతా చిత్తడి చిత్తడిగా ఉంది. ప్రహరీ మెట్లు దిగి రోడ్డుమీద నడవసాగింది. ఇళ్లకుపోతున్న కార్లు, స్కూటర్ల  హడావిడి తప్ప దాదాపు రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. తలమీద చున్నీలను, చీరకొంగులను కప్పుకుని వేగంగా నడుస్తున్న కొందరు ఆడవాళ్లు కనిపించారు.          

అంతవానలో అతన్ని కలవడం అవసరమో కాదో తేల్చుకోలేక పోతోంది యామిని. వెళ్లకపోతే ఏదో పోగొట్టుకున్న ట్లుగా మనసంతా వెలితిగా అనిపించసాగింది. అలాగని పిల్లల్ని విడిచిపెట్టి రావడానికి మనసు అంగీకరించకుండా ఉంది. ఆగడానికి, సాగడానికి మధ్య ఊగిసలాట కొద్దిరోజుల క్రితం అతనితో జరిగిన పరిచయాన్ని గుర్తుకు తెచ్చింది యామినికి.        
∙∙∙ 
‘మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?’ అని వినిపించడంతో ఉలిక్కిపడి పక్కకి చూసింది యామిని. సన్నగా, పొడుగ్గా, ఆకర్షణీయంగా ఉన్న ముఖంతో, నిర్లక్ష్యంగా గాలికి ఎగురుతున్న జుట్టుతో ఓ వ్యక్తి కనిపించాడు. పిల్చింది తనను కాదేమోనని కూరగాయలు తీసుకోవడంలో నిమగ్నమైంది యామిని.
‘ఏమండీ.. మిమ్మల్నే.. ఏ కాలేజీలో చదువుతున్నారు?’ మళ్ళీ అడిగాడు.             

అతనివంక ఆశ్చర్యంగానూ, కోపంగానూ చూస్తూ ‘కళ్లుపోయాయా? కాళ్లకున్న మట్టెలు, మెడలో తాళి కనబడట్లేదా?’ అంది.  ‘మెడలో తాళీ, కాళ్లకు మెట్టెలా? ఏవీ ఎక్కడా కనబడవే? ఇష్టం లేకపోతే చెప్పడం మానెయ్యాలి గానీ అబద్ధాలు చెప్పకూడదు’అన్నాడు పెద్దగా నవ్వుతూ.

యామినిలో అయోమయం తొంగిచూసింది. వెన్నులో ఎక్కడలేని భయం మొదలైంది. తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని చుట్టూ చూసింది. మార్కెట్టులోని జనాలంతా హడావిడిగా కూరగాయల దుకాణాలతో కుస్తీపడుతూ కనిపించారు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న యామిని తన కాళ్లవైపు చూసుకుని అదిరిపడింది.

కాళ్లకు ఉండాల్సిన మెట్టెలు కనిపించలేదు. కంగారుగా మెడ తడుముకుంది. బోసిగా కనబడి వెక్కిరించినట్లుగా అనిపించింది. కంగారును కనబడనీయకుండా కూరగాయలు తీసుకుంటున్న యామినికి ‘నాకు తెలిసి మీరు ఏ డిగ్రీ ఫస్టియరో చదువుతూ ఉండాలి’ అన్న మాటలు వినిపించాయి. చేస్తున్న పనిని ఆపి అతని వైపు చూస్తూ ‘ఇద్దరు పిల్లలు నాకు’ అంది కోపంగా.     

ఆమెవైపు చూసి పెద్దగా నవ్వుతూ ‘ మీకు ఇద్దరు పిల్లలేంటండీ బాబూ! అయితే సంతూర్‌ సబ్బు యాడ్‌ మీతో కూడా ఇప్పించాల్సిందే’ అన్నాడు చిలిపిగా ఆమె కళ్లల్లోకి చూస్తూ.  ఆమెలో కోపానికి బదులుగా ఎక్కడలేని సిగ్గూ ముంచుకొచ్చింది. ఎంత చక్కగా తయారైనా ‘బాగున్నావు’ అని ఒక్క మాట కూడా మాట్లాడని భర్త గుర్తొచ్చాడు. పైనుంచి కిందకీ, కిందనుంచి పైకీ గుచ్చి గుచ్చి చూసే అత్త గుర్తొచ్చింది. అందాన్ని కూడా అరకేజీలుగానో, కేజీలుగానో మార్చి అంగళ్లలో అమ్మేస్తే బాగుండు. మగాళ్లకి అర్రులు చాచే పనుండదు, ఆడవాళ్ళకి అద్దాలతో పనుండదు.

తన అందం అప్పటివరకూ భర్త అవసరాలు తీర్చడానికి, బలవంతపు అనుభవాల్ని బహుమానంగా అందించడానికి పనికొచ్చింది. ఇప్పుడు మాత్రం పొగడ్త ద్వారా అంతర్లీనంగా అణచిపెట్టిన సంతృప్తికి దగ్గరచేసింది. ముఖం చిట్లించి మనసుని ముక్కలు చేసే భర్త దగ్గర లభించని సాంత్వనేదో యామిని మనసును మెలితిప్పసాగింది. 

‘అయితే ఇక్కడికి రోజూ వస్తారా’ అన్న మాటతో ఆలోచనలలో నుంచి బయటికి వచ్చింది. ‘వారానికోసారి..’ మనసు ఆపుతున్నా నోరు సమాధానం చెప్తూనే ఉంది.
‘ఈరోజు బుధవారం. అంటే మళ్ళీ వచ్చే బుధవారం దాకా వెన్నెల కనిపించదన్నమాట’  ‘వెన్నెల రాత్రి మాత్రమే కనిపిస్తుంది. తల్చుకోగానే మార్చుకోవడానికి అదేమీ తలగడ కాదు’ అంది. 

‘వచ్చే బుధవారం పగలే వెన్నెల్ని చూడాలని ఆశపడుతున్నాను. మీకోసం ఇక్కడే వెయిట్‌ చేస్తాను’ చెప్పి యామిని వైపు తిరిగి ఆమె కళ్లలోకి చూశాడు. ఆమె అతనివైపు బేలగా చూసింది. ‘వద్ద’ని చెప్పడానికి మనసు అంగీకరించట్లేదు, ‘కుదరద’ని చెప్పడానికి మాట పెగలట్లేదు. ఏమీ మాట్లాడకుండా కావలసినవి తీసుకుని అక్కడినుంచి బయటపడింది.     

‘వచ్చే బుధవారం.. ఇక్కడే.. ఇదే టైమ్‌..’ వెనక నుంచి వినిపిస్తున్న మాటలు యామిని చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి.  విసురుగా వచ్చిన ఎదురుగాలికి గొడుగు వెనక్కి ముడుచుకుపోయి వానజల్లు ముఖం మీద పడేసరికి తుళ్ళిపడింది. ఆలోచనల్లో నుంచి బయటికి వచ్చి చుట్టూ చూసింది. రోడ్డుపక్కనున్న చెట్లన్నీ గాలికి పూనకం వచ్చినట్లుగా భయంకరంగా ఊగుతున్నాయి.

తారుడబ్బాల్ని కుమ్మరించినట్లుగా కళ్లముందు చీకటి కదలాడుతోంది. గొడుగు సరిచేసుకుని ముందుకు నడుస్తున్న యామినికి  ఒకే కర్రను రెండు చివర్లా పట్టుకుని నడుస్తున్న ముసలి జంట కనిపించారు. వయసులో ఉన్నప్పుడు వందమంది దొరకొచ్చుగానీ వయసుడిగాక మాత్రం భార్యాభర్తలే ఒకరికొకరు ఊతకర్రలేమో అనిపించింది. మనసులో ఆలోచనలేవో సుడులు తిరగసాగాయి.

వేగంగా నడవడం వల్ల ఆయాసం ఎక్కువవసాగింది. మెడలో వేలాడుతున్న నల్లపూసల గొలుసు బరువుగా కదలాడుతోంది. తొందరగా వెళ్లాలని గబగబా ముందుకు నడిచి ఏదో అడ్డంపడినట్లుగా ముందుకు తూలిన యామిని అటువైపు చూసింది. వానను కూడా లెక్కచేయకుండా కోర్కెలు తీరని దెయ్యాల్లా చెట్టుచాటున కౌగిలించుకుంటున్న పడుచుజంట కనిపించారు.

శృంగారానికి, బంగారానికి ఇష్టమే కొలమానమేమో! కొనాలనే ధ్యాస, కావాలనే ఆశ ఎలాంటి వారినైనా ఊరించి ఊరించి ఊబిలో ముంచేస్తుందేమో! కోరిక కూడా చీకటికంటే చిక్కగా ఉంటుందేమో...!        

తన ఆలోచనలకు తనలో తానే నవ్వుకుంది యామిని. ‘ఏమీ తెలియని వాడు ఒక్కసారి బోర్లాపడితే అన్నీ తెలిసిన వాడు మూడుసార్లు బోర్లా పడ్డట్టుగా’ అయిపోయింది తన పరిస్థితి. ‘ఏ కాలేజ్‌’ అని అడిగినప్పుడు వచ్చిన కోపం ‘యాడ్‌’ ప్రస్తావన వచ్చేసరికి సంతూరు సబ్బులా జారిపోయింది. ‘మళ్ళీ కలుద్దాం’ అని అతనన్నప్పుడు వచ్చిన చిరాకు ‘పగలే వెన్నెల్ని చూడాలనుంది’ అన్నప్పుడు మబ్బుల్లో తేలిపోయింది.

పొగడ్త ఎంత పని చేస్తుంది? సాధ్యం కాదనుకున్న పనిని కూడా సావధానంగా అయ్యేలా చేస్తుంది. దేహానికి మెరుపునీ, మైమరుపునీ ఇస్తుంది! గొడుగును కొద్దిగా వంచి మార్కెట్టు వైపు చూసింది. మిణుగురు పురుగుల్లా అక్కడక్కడా వెలుగుతున్న వీథి దీపాల కాంతితప్ప అంతా చీకటిగా కనిపించింది.

చినుకులు నిలువుగా  కురుస్తున్నాయి. ఎక్కడో సగం వెలుతురు, సగం చీకటి కలిసిన మూలలో ఉన్న షెడ్డు కింద కనిపించాడతను. అడుగంటిన బావినీటిని ఆబగా తోడుకుని దాహం తీర్చుకున్నట్లుగా ఆమె ప్రాణం తెప్పరిల్లింది. గబగబా అక్కడికి నడిచి అతని పక్కన నిలబడింది.             

ఆమెకు అంతా కొత్తగా ఉంది. చుట్టూ పరచుకున్న చిమ్మచీకటి ఆమెను సాగనంపడానికి వచ్చిన స్నేహితురాల్లా అనిపించింది. అక్కడక్కడా కనిపిస్తున్న గుడ్డి వెలుతురు ఆమె చేస్తున్న పనిని చూడటానికి లోకం పంపించిన భూతద్దంలా కనిపించింది. తనది కాని ‘సగభాగం’ పక్కన సజీవంగా నిలబడిందో లేక జీవచ్ఛవంలా నిలబడిందో అర్థం కాకుండా ఉంది. వదిలేసి వచ్చిన బాధ్యతలన్నీ ఆమె వేడి వేడి నిట్టూర్పుల్లో పడి కాలిపోసాగాయి.

‘కొంచెం దగ్గరగా జరుగు’ అన్న మాటతో అతనివైపు చూసింది.   పొగలు కక్కుతున్న ఫ్యాక్టరీ గొట్టంలా ఆమె కళ్లకు కనిపించాడతను.  ఆమె అతనికి దగ్గరగా జరిగింది. అతను తన రెండుచేతులతో ఆమెను మరింత దగ్గరగా తీసుకుని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకోబోయాడు. యామిని అరచేతుల్ని అడ్డంపెట్టి ‘ఇది నీకు తొలిముద్దా?’అంది.              
అతను ఆమె వైపు విస్మయంగా చూస్తూ ‘నీకూ కాదుగా’ అన్నాడు.  యామిని అతన్ని తోసేసి దూరంగా నిలబడింది. ఆమె ఆలోచనలు సముద్ర తరంగాల్లా ఎగసిపడుతున్నాయి. పశ్చాత్తాపంతో ఆమె హృదయం దహించుకుపోసాగింది. ఒక్కసారిగా భర్త, అత్త, పిల్లలు గుర్తొచ్చి ఆమె కళ్లు తడిబారాయి. ఇన్నాళ్ళూ ఇల్లంటే బందిఖానా అనుకుంది తను.

కానీ మనిషికైనా, మనసుకైనా ఆంక్షలు అవసరమని, బంధాలను బరువుగా భావించడం కంటే బాధ్యతగా స్వీకరిస్తే బతుకు భద్రంగా ఉంటుందని ఆమెకు అర్థమైంది. యామిని అతని వైపు ఒకసారి చూసి అక్కడినుంచి బయల్దేరింది.             

‘ఇందుకేనా వచ్చింది’ వెనక నుంచి వినబడిన మాటతో ఒక్క నిముషం ఆగిపోయింది.  అతని వైపు చిర్నవ్వుతో చూస్తూ ‘ఇన్నాళ్లూ ఏదో భ్రమలోనూ, భ్రాంతిలోనూ ఉన్నాను. ఈ చీకటి నా కళ్ళు తెరిపించింది. నల్లని మబ్బులతో నిండిన ఆకాశం, వేసుకొచ్చిన నల్లని గొడుగు, ఈ నల్లపూసల గొలుసు.. అన్నిటినీ మించి అంధకారంతో నిండిన నా మనసు నన్నింతదూరం నడిపించాయి.

దారిలో ఎదురైన జంటలు నాకు పాఠాన్ని నేర్పించాయి. నాలో పరివర్తన కలిగించాయి. నా ఇంట్లో దీపాన్ని వెలిగించాల్సిన బాధ్యత నామీద ఉంది. ఆ దీపం ఆరిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది. మనం ఏర్పరచుకునే సంబంధాలు హత్యల్నో, ఆత్మహత్యల్నో కానుకగా ఇవ్వకూడదు.

పీడకలల్లా వెంటాడకూడదు. గుర్తుంచుకునే ఙ్ఞాపకాల్లా మిగలాలి..’ చెప్పి ముందుకు కదిలింది యామిని.  చేతికి చిక్కన చేప కళ్లముందే క్షణాల్లో చేజారిపోవడంతో అతనిలో నిరాశ తొంగిచూసింది. గట్టిగా నిట్టూర్పులు విడుస్తూ అక్కడి నుండి కదిలి చీకట్లో కలిసిపోయాడు. 
 -డా. జడా సుబ్బారావు  

మరిన్ని వార్తలు