3 రోజుల్లో లోకం చుట్టిన వనిత

23 Nov, 2020 04:27 IST|Sakshi

నవంబర్‌ 18, 2020 గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ డే. ఈ సందర్భంగా గిన్నిస్‌ బుక్‌ వారు 3 రోజుల 14 గంటల్లో (87 గంటలు) 7 ఖండాలు చుట్టిన వనితగా అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన డాక్టర్‌ ఖాలా అల్‌రొమైతీని ప్రకటించారు. ఆమె ఈ సంవత్సరం ఫిబ్రవరిలో  ఈ ఘనత సాధించింది. గతంలో అమెరికన్‌ నటి జూలీ బెర్రీ  92 గంటల్లో ఈ రికార్డ్‌ సాధించారు. ‘మా దేశం చిన్నదే కావచ్చు.  కాని మేం కూడా రికార్డులు సాధించగలమని నిరూపించడానికే ఈ ప్రయాణం కట్టాను’ అంటున్నారు డాక్టర్‌ ఖాలా.

‘లోకం చుట్టిన వీరుడు’ అని సినిమా ఉంది. ఎం.జి.ఆర్‌ హీరో. ‘లోకం చుట్టిన వీరురాలు’ అని ఎవరూ సినిమా తీయలేదు. ఎందుకంటే లోకం చుట్టే పని పురుషుడిది అని లోకం అభిప్రాయం. సాహసయాత్రలు చేసిన సింద్‌బాద్, గలీవర్‌లు పురుషులే. కాని స్త్రీలు చేసిన సాహసప్రయాణాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఇప్పుడిప్పుడే వెలికి తీసి గ్రంథస్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సంతోష పడాల్సిన విషయం ఏమిటంటే అతి తక్కువ సమయంలో లోకం చుట్టిన రికార్డు (ఏడు ఖండాలను తాకిన) ఒక వనితకు సొంతం కావడం. ఆ వనిత పేరు డాక్టర్‌ ఖాలా అల్‌రొమైతీ. యు.ఏ.ఇ దేశస్తురాలు. ఆమె ఫిబ్రవరిలో దాదాపు కరోనా దుమారం మొదలవుతున్న సమయంలో ఈ రికార్డు సాధించి తాజాగా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో ఎక్కింది. నవంబర్‌ 18, 2020న ఆమె రికార్డును అధికారికంగా ప్రకటించారు.


3 రోజుల 14 గంటలు
స్త్రీలను నాలుగు గోడల మధ్య ఉంచే పురుష సమాజం ఇది. ఇక ఇస్లామీయ సమాజాలలో వారికి స్వేచ్ఛ ఉండదనే ప్రచారం ఉంటుంది. కాని అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన వైద్యురాలు డాక్టర్‌ ఖాలా ఈ లోకాన్ని చుట్టిన వనితగా రికార్డ్‌ సాధించాలనుకున్నారు.

‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారు ఈ కరోనా సంగతి తెలియని రోజుల్లోనే 2020 సంవత్సరానికి ‘డిస్కవర్‌ యువర్‌ వరల్డ్‌’ అనే థీమ్‌ ఇచ్చారు. అది ఒక స్ఫూర్తినిచ్చింది నాకు. ఇక మా దేశంలో అన్ని దేశాల పౌరులు నివసిస్తారు. ముఖ్యంగా దుబాయ్‌లో ఏ దేశం వారినైనా మీరు చూడొచ్చు. వారందరూ రావడం వల్లే మా దేశం ఎంతో కళకళలాడుతుంది. అందుకని వారికి కృతజ్ఞతగా కూడా వారున్న దేశాలను, ఖండాలను చుట్టి రావాలని అనుకున్నారు’ అంటారు డాక్టర్‌ ఖాలా.

ఫిబ్రవరిలో మొదలైన ఆమె ప్రయాణం ఫిబ్రవరి 13, 2020న సిడ్నీ (ఆస్ట్రేలియా)లో ముగిసింది. అంటే అంతకు నాలుగు రోజుల ముందు ఆమె దుబాయ్‌ నుంచి బయలుదేరిందన్న మాట. ఏడు ఖండాలను తాకి ఆస్ట్రేలియాలో యాత్ర ముగించడానికి ఆమె తీసుకున్న సమయం 3 రోజుల 14 గంటల 46 నిమిషాల 48 సెకన్లు.


ఇంతకు ముందు ఉన్న రికార్డు 
ఏడు ఖండాలను అత్యంత తక్కువ టైమ్‌లో చుట్టి రావాలని ఇంతకు ముందు అనుకున్నది కూడా ఒక స్త్రీనే. ఆమె పేరు జూలీ బెర్రీ. అమెరికన్‌ నటి. ఆమె తన స్నేహితుడు కేసె స్టివార్ట్‌తో కలిసి ‘72 గంటల్లో 7 ఖండాలు’ అనే రికార్డు యాత్ర చేసింది. 13 డిసెంబర్‌ 2017న సిడ్నీలో మొదలుపెట్టి డిసెంబర్‌ 16న చిలీలో తన యాత్ర ముగించింది. అయితే ఆమె ఆశించినట్టుగా 72 గంటల్లో కాక యాత్ర 92 గంటల్లో ముగిసింది. అయినప్పటికీ అది అత్యంత తక్కువ సమయంలో లోకం చుట్టిన రికార్డుగా గిన్నిస్‌ బుక్‌లో నమోదైంది. ఈ యాత్రలో జూలీ ఆమె మిత్రుడు దాదాపు 48 గంటలు అసలు నిద్ర లేకుండా ప్రయాణిస్తూనే ఉన్నారు. ఇద్దరికీ టెన్‌ టు సిక్స్‌ చేసే పని పట్ల విసుగు ఉండటం వల్లే ఈ యాత్ర చేసి విజయవంతం అయ్యారు.

నా కుటుంబం తోడు నిలిచింది
‘యాత్ర మొదలెట్టానన్న మాటే కాని మధ్యలో చాలాసార్లు అనుకున్నాను ఆగి వెనక్కి వెళ్లిపోదామా అని. అన్నీ మనం అనుకున్నట్టుగా ఉండవు. ఎయిర్‌పోర్టుల్లో ఫ్లయిట్‌లను పట్టుకోవడం అంత సులభం కాదు. కాని నా కుటుంబం నాకు అన్ని విధాలుగా సహకరించి యాత్ర పూర్తి చేసేలా చూసింది’ అన్నారు డాక్టర్‌ ఖాలా. ‘మాది చిన్న దేశమే అయినా రికార్డ్‌ సృష్టించిన విశేషాలెన్నో ఉన్నాయి. ప్రపంచంలో ఎత్తయిన భవనం మా దేశంలో ఉంది. లార్జెస్ట్‌ హైడెఫినేషన్‌ వీడియో వాల్‌ మా దేశంలో ఉంది. అత్యంత వేగంగా ప్రయాణించే పోలీస్‌ కార్‌ కూడా మాకే సొంతం. మా దేశ అధ్యక్షుడు, ప్రధాని.. ఇద్దరూ తమ పౌరులను గొప్ప పనులు చేయమని ప్రోత్సహిస్తుంటారు. మహిళల ముందంజకు ప్రాధాన్యం ఇస్తుంటారు. వారిని చూసి కూడా నేను స్ఫూర్తి పొందాను’ అంటారు డాక్టర్‌ ఖాలా.


ఖాలా వివాహిత. పిల్లల తల్లి. అయినప్పటికీ ఆమె ఈ అరుదైన రికార్డు కోసం సంకల్పం తీసుకున్నారు. ‘నా సాఫల్యం నా దేశానికి, నా సమాజానికి అంకితం ఇస్తున్నాను. నన్ను చూసి కలలు కనవచ్చని వాటిని సాఫల్యం చేసుకోవచ్చని ఎవరైనా స్ఫూర్తి పొందితే అంతే చాలు’ అన్నారు ఖాలా. పత్రికలు ఈ రికార్డు అనౌన్స్‌ అయ్యాక ఖాలాను మెచ్చుకుంటూ కథనాలు రాశాయి. ఒక పత్రిక ‘ఆమె లోకం చుట్టింది. మనం ఇంకా పక్క మీద నుంచి లేవడానికే తాత్సారం చేస్తున్నాం’ అని హెడ్డింగ్‌ పెట్టింది. కదలడం జీవ లక్షణం. ఈ కరోనా తర్వాత ఎంత వీలైతే అంత లోకం చుడదామనుకునేవారు తప్పక ఖాలా వంటి మహిళలను చూసి స్ఫూర్తి పొందుతారు.
– సాక్షి ఫ్యామిలీ 

మరిన్ని వార్తలు