కొసరు ముప్పుల కరోనా!

3 Sep, 2020 08:16 IST|Sakshi

గోరు చుట్ట మీద రోకటి పోటు సామెత  మనకు తెలిసిందే. అచ్చం అలాంటి పరిస్థితే ఇప్పుడు కరోనా రోగుల విషయంలోనూ ఎదురవుతోంది. అసలే కరోనా కారణంగా వచ్చే కోవిడ్‌–19 వ్యాధితో బాధపడుతూ ఉంటే... దానికి తోడు అనేక సమస్యలను కొసరుగా తెచ్చిపెడుతోంది. నేరుగా వ్యాధితో చికిత్స పోరాటంలో తలమునకలై ఉన్న వైద్యులకు ఈ కొసరు రోగాలు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. దాంతో అటు అసలు వ్యాధికి చికిత్స చేస్తూనే, ఇటు ఈ సమస్యలకూ వైద్యమందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు అసలు సమస్య అయిన కరోనాకే ఆందోళన పడాల్సిన పరిస్థితి లేనందున... ఈ కొసరు సమస్యల విషయంలో కాస్తంత అదనపు ఇబ్బందులూ, ఇక్కట్లే అయినందున భయపడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. కాకపోతే ఉన్న సమస్యకు తోడుమరింత అప్రమత్తంగా అదనపు చికిత్సలూ, జాగ్రత్తలూ అవసరం కొత్త ఇక్కట్లేమిటో తెలుసుకునేందుకు అంటున్నారు. ఆ కొసరు సమస్యల ఉపయోగపడేదే ఈ కథనం.

కాపా
కరోనా వచ్చిన ప్రతివారికీ ‘కాపా’ కూడా వస్తుందనే ఆందోళన వదిలేయండి. ఎందుకంటే... వెంటిలేటర్‌పైకి వెళ్లిన రోగుల్లోని కొంతమందికి మాత్రమే వచ్చే సమస్య ఇది. ‘కరోనా వైరస్‌ అసోసియేటెడ్‌ పల్మునరీ ఆస్పర్జిల్లోసిస్‌’ అనే పెద్ద మాటకు సంక్షిప్తరూపమే ఈ ‘కాపా’.  కరోనా వ్యాధి సోకగానే దాన్నుంచి రక్షించుకునేందుకు దేహంలో ‘సైటోకైన్స్‌’ అనే రక్షణ కణాలు పుడతాయి. సైనికుల్లాంటి ఈ కణాలు విచక్షణరహితంగా చేసే పోరాటంలో... శత్రువు మీదకు విసిరిన శతఘ్ని మన మీదే పేలితే కలిగే నష్టంలా... అటు శత్రుకణాలతో పాటు ఇటు సొంతదేహానికి సంబంధించిన కణాలూ దెబ్బతింటాయి. అలాంటి నష్టాన్ని నివారించేందుకు రోగికి స్టెరాయిడ్స్‌ ఇస్తుంటారు.

ఆ స్టెరాయిడ్స్‌తో పాటు అసలు వ్యాధికి వాడే మరికొన్ని మందులైన ‘టొసిలుజిమాబ్‌’ వంటి వల్ల కూడా కరోనా రోగులకు ‘కాపా’ వచ్చే అవకాశం ఉంది. నిజానికి ‘కాపా’ అనేది ఓ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. వెంటిలేటర్‌ మీ ఉన్న రోగుల్లో మరణాల రేటు పెరగడానికి ‘కాపా’ కూడా ఓ ముఖ్యమైన కారణమని వైద్యనిపుణులు గుర్తించారు. అయితే దీన్ని త్వరగా కనుగొంటే రోగికి ప్రాణాపాయం ఏర్పడే ముప్పు తొలగిపోతుంది. వీలైనంత త్వరగా దీన్ని గుర్తించి ‘వారికొనజోల్‌’ వంటి యాంటీఫంగల్‌ మందులు వాడటం ‘కాపా’ వల్ల వచ్చే ముప్పు నుంచి రోగులను కాపాడవచ్చు.

లాంగ్‌ కోవిడ్‌
కరోనా వచ్చి తగ్గాక అంటే... పాజిటివ్‌ కేసులు నెగెటివ్‌ అయ్యాక కూడా కొంతమంది రోగుల్లో లక్షణాలన్నీ పూర్తిగా తగ్గవు. ఇలా అసలు వ్యాధి తగ్గాక కూడా లక్షణాలు అలాగే కొనసాగడాన్ని ‘లాంగ్‌కోవిడ్‌’ అని పిలుస్తున్నారు. కొద్దిగా ఒళ్లునొప్పులు ఉండటం, జ్వరం వచ్చినట్టుగా అనిపించడం, బాగా నిస్సత్తువగా, నీరసంగా ఉండటం, ఆయాసం వస్తుండటం, వాంతులు లేక విరేచనాలు అవుతుండటం, జ్ఞాపకశక్తి మందగించడం, గుండెవేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు ‘లాంగ్‌ కోవిడ్‌’లో కనపడతాయి. కరోనా వ్యాధిగ్రస్తుల్లో దాదాపు మూడువంతుల మందికి ఇలా ‘లాంగ్‌ కోవిడ్‌’ ఉండవచ్చని ఒక అంచనా. ఈ లక్షణాలు ఎంతమాత్రం ప్రాణాంతకం కావు. అయితే అసలే ఆందోళనలో ఉండే రోగులను ఇవి మరెంతగానో భయపెట్టే అవకాశం ఉంటుంది.

అప్పటికే ఎంతో భయం, మానసిక ఆందోళన, ఒత్తిడి (స్ట్రెస్‌)ని ఎదుర్కొన్న రోగుల్లో ఈ లక్షణాలు అయోమయాన్ని నింపుతాయి. తమకు వచ్చిన నెగెటివ్‌ ఫలితాలపై అనుమానాలు కలిగించి, తమకింకా జబ్బు తగ్గలేదేమో అనిపిస్తూ మానసికంగా కుంగదీస్తాయి. అయితే తమకు నెగెటివ్‌ వచ్చాక... ఇక కరోనా వైరస్‌ తమ దేహంలో లేదని రోగులు గుర్తిస్తే అదే వారికి సరైన చికిత్స. అంతేగానీ లాంగ్‌కోవిడ్‌కు నిర్దిష్టంగా చికిత్స అంటూ ఏదీ లేదు. దాని అవసరమూ లేదు. గతంలో చికన్‌గున్యా వచ్చిన రోగుల్లో కొంతకాలం కాళ్లనొప్పలూ, ఒళ్లునొప్పులూ వస్తూ. క్రమేణా తగ్గిన విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. దాని లాగే ఇది కూడా వైరస్‌ జబ్బే కావడంతో లక్షణాలు క్రమేణా తగ్గుతాయంటూ ధైర్యం చెప్పుకుంటే చాలు. 

కోవిడ్‌–19తో వచ్చే మానసిక సమస్యలు 

కరోనా రిలేటెడ్‌ ఐసీయూ సైకోసిస్‌
కరోనా వ్యాధిగ్రస్తుల్లో కొంతమంది కాస్తంత ఎక్కువ కాలం పాటే  ఐసీయూలో ఉండాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అలా ఉండాల్సిరావడంతో కొందరు రోగుల్లో ఒక రకమైన మానసిక పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. ఇలా తలెత్తే సమస్యను ‘ఐసీయూ సైకోసిస్‌’ అని పిలుస్తారు. దీనికి గురైన రోగుల్లో తీవ్రమైన ఆందోళన ఉంటుంది. చికిత్స పూర్తిగాక ముందే  తమంతట తాము మంచం దిగి ఆసుపత్రినుంచి వెళ్లిపోడానికి ప్రయత్నిస్తుంటారు. శరీరానికి అమర్చిన పైపులను లాగిపారేయడానికి ప్రయత్నిస్తుంటారు. వారిని ఐసీయూలో ఉంచడం తప్పకపోవడం వల్ల ఉత్పన్నమయ్యే ఈ సమస్యకు  వైద్యులూ, నర్స్‌లతో పాటు వైద్యసహాయకులు రోగికి  ధైర్యం చెబుతూ చికిత్స అందజేస్తారు.

కరోనా బారిన పడ్డ చాలామందిలో శారీరక సమస్యలతో పాటు మానసికమైన ఇబ్బందులు కనిపించే అవకాశం కూడా కాస్తంత ఎక్కువే. ఎందుకంటే కరోనా వ్యాధి పట్ల ముందునుంచీ ఉండే భయాలకు తోడు... రోగి అతిగా ఆందోళనచెందడం, డిప్రెషన్‌కు గురికావడం జరుగుతుంటుంది. ఫలితంగా ఇలాంటి మానసిక సమస్యలెన్నో కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ గురైనవారిలో ఎక్కువగా కనిపిస్తుండటం చూస్తున్నాం. కరోనా సోకిన రోగుల్లో 98 శాతం మంది కోలుకుంటున్నప్పటికీ మానసిక ఆందోళనతో కలిగిన డిప్రెషన్‌ కారణంగా కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం చాలా దురదృష్టకరం. అసలు జబ్బులేకపోయినప్పటికీ... ఇలాంటి ఆందోళనల కారణంగా ముప్పు చేకూరడం సమాజంలో మనం తరచూ చూస్తున్నాం.

వ్యాధిగ్రస్తులకు ధైర్యం చెబుతూ, వారిలో సానుకూల దృక్పథాన్ని నెలకొల్పడం మనందరి కర్తవ్యం. సామాజిక జీవులైన మనమందరం కూడా రోగులెవరూ వివక్షకు గురికాకుండా చూసుకుంటే చాలు. అదే ఈ సమస్యకు సరైన మందు. చివరగా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే... ఇప్పుడు అసలు సమస్యకే మంచి మంచి పరిష్కారాలు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడీ కొసరు ఇక్కట్లను ఇబ్బందులుగా భావించకపోతే... రోగులు మరింత వేగంగా కోలుకుంటారు. ఇందుకోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

ఎంఐఎస్‌ – సీ
అదృష్టవశాత్తూ పిల్లల విషయంలో కరోనావ్యాధి అంతగా ప్రమాదకారి కాదన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కరోనా వచ్చి తగ్గిన పిల్లల్లో కొంతమందికి ఎంఐసీ అనే కాస్తంత ప్రమాదకరమైన జబ్బు వచ్చే అవకాశం ఉంది. మల్టీ సిస్టమ్‌ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రెన్‌ అన్న దానికి ‘ఎంఐఎస్‌–సీ’ అనేది సంక్షిప్తరూపం. కానీ దీని గురించి అస్సలు ఆందోళనపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది రావడం చాలా చాలా అరుదు. కాకపోతే అత్యంత అరుదుగా వచ్చే ఈ జబ్బుకు గురైన వారికి ఇమ్యునోగ్లోబ్యులిన్‌ ఇంజెక్షన్లు, అనాకిన్రా అనే మందులు వాడాల్సి ఉంటుంది. ఇందులో ప్రతికూలత ఏమిటంటే... ఈ మందులు ఒకింత ఖరీదైనవి.

డయాబెటిస్‌ 
కరోనా వైరస్‌ వల్ల రక్తంలో చక్కెర పాళ్లు పెరగవచ్చు. కొన్నిసార్లు ఇది మధుమేహానికి దారితీయవచ్చు. వైరస్‌ వల్లనే కాకుండా... కరోనా వచ్చిన వారికి వాడే స్టెరాయిడ్స్‌ వల్ల కూడా రక్తంలో చక్కెర పాళ్లు పెరగవచ్చు. కొంతమంది కరోనా వ్యాధిగ్రస్తులు జ్వరం లేకుండానే... షుగర్‌ వ్యాధి వల్ల వచ్చే ‘డీకేఏ’ అనే కాంప్లికేషన్‌తో ఆసుపత్రికి వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. కరోనా అసోసియేటెడ్‌ డయాబెటిస్‌ ఎంతకాలం పాటు ఉండవచ్చు, అది దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం ఉందా అన్న అంశం మీద ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. 

రక్తం గడ్డకట్టే స్వభావం
కరోనా వచ్చిన రోగుల్లో రక్తం గడ్డకట్టే స్వభావం ఉంటుంది. దీనివల్ల అనేక సమస్యలు రావచ్చు. గుండెకు సంబంధించిన సమస్యలూ, మెదడుకు సంబంధించిన సమస్యలూ, కాళ్లుచేతుల్లోని రక్తనాళాల్లో రక్తపు గడ్డలు (క్లాట్స్‌) ఏర్పడటం వల్ల మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే కరోనా రోగులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేస్తూ ఇంటికి పంపించాక కూడా వారు కొంతకాలం పాటు రక్తాన్ని పలచబార్చే మందులు వాడాలని సూచిస్తుండటం మామూలే. అయితే మోతాదు మించితే రక్తాన్ని పలచబార్చే మందుల వల్ల ఒక్కోసారి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉండవచ్చు. అందుకే డాక్టర్లు సూచించిన మోతాదులోనే వాటిని వాడటం అవసరం.

ఇన్‌సామ్నియా
ఇన్‌సామ్నియా అంటే నిద్రలేమి అన్న విషయం మనలో చాలామందికి తెలిసిందే. కోవిడ్‌–19 వచ్చి తగ్గిన చాలామందిలో ఆ తర్వాత నిద్రలేమి సమస్య ప్రస్ఫుటంగా కనిపించడం చాలామందిలో వైద్యనిపుణులు చూస్తున్నారు. ముందుగా ఈ లక్షణాన్ని కోవిడ్‌ వల్ల వచ్చిన భయం కారణంగా అనుకున్నప్పటికీ... ఇప్పుడు మాత్రం ఇది కోవిడ్‌–19 అనంతర పరిణామంగా వైద్యులు పరిగణిస్తున్నారు. ఇలా నిద్రలేమి వల్ల రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ పరిస్థితిని కూడా క్రమంగా రోగులు అధిగమించగలరని ధైర్యం చెప్పుకుంటే చాలు.
- డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ, 
సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ 

మరిన్ని వార్తలు