Sudha Mahalingam: 70 ఏళ్ల డాక్టర్‌.. ఇప్పటికి 70 దేశాలు చుట్టారు.. ఇంకా

16 Sep, 2021 00:18 IST|Sakshi

70 ఏళ్లు డాక్టర్‌ సుధా మహాలింగంకు. ఇప్పటికి దాదాపు 70 దేశాలు చుట్టేసిందామె. భయం లేదు.. గియం లేదు... బ్యాగ్‌ సర్దుకుని పదండి అంటోందామె. మరి తోడు? ఎవరూ అక్కర్లేదు.. మీరు ఎక్కడకు వెళితే అక్కడి మనుషులే తోడు అంటుంది. నిజానికి మన దేశాన్ని పూర్తిగా చూడటానికే ఒక జీవిత కాలం సరిపోదు. ఉన్న ఆయుష్షులో ఇంత పెద్ద ప్రపంచం చూడాలంటే ఎంత వేగిర పడాలి. అందుకే సుధా మహాలింగం భ్రమణకాంక్ష కొందరికి ఈర్ష్య పుట్టిస్తోంది... కొందరిచే టికెట్లు బుక్‌ చేయిస్తోంది.

‘వీలున్నప్పుడు మంచి ప్రయాణం చేయాలి అని మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు. నామాట నమ్మండి. వీలు ఎప్పుడూ ఉండదు. వీలు చేసుకోవాలి’ అంటుంది సుధా మహాలింగం. ఆమె కథ కొంచెం అసూయ  పుట్టించేదే. ‘చాలామంది మేగజీన్లలో మంచి మంచి ట్రావెల్‌ ఫొటోలు చూసి అంతటితో సంతృప్తి పడతారు. నా అదృష్టం... నేను ఆ చోట్లకంతా వెళ్లాను’ అంటుందామె.

బెంగళూరుకు చెందిన సుధా మహాలింగంకు చెన్నైతో కూడా అనుబంధం ఉంది. ఆమె భర్త సివిల్‌ సర్వీసెస్‌లో పని చేసి రిటైర్‌ అయ్యాడు. 25 ఏళ్లకు పెళ్లి చేసుకున్న సుధ ‘అందరూ చెప్పేటటువంటి తీర్చిదిద్దేటటువంటి’ జీవితాన్నే ఆ తర్వాతి 25 ఏళ్లు జీవించింది. 50వ ఏట వరకూ ఆమె కూడా ట్రావెల్‌ మేగజీన్లు చూస్తూ గడిపింది. అదనంగా చేసిన పని ఏదైనా ఉంటే భర్త టూర్లు వెళ్లినప్పుడు తోడు వెళ్లడమే.

కాని ఒకసారి ఒక విశేషం జరిగింది. భర్తకు ఆఫీస్‌ పని మీద స్వీడన్‌లో రెండు నెలలు ఉండాల్సి వచ్చింది. తోడు వెళ్లిన సుధకు అక్కడ ఖాళీగా ఉండటం బోరు కొట్టింది. ‘నేను ఒక్కదాన్నే ఫిన్లాండ్‌కు ఒక షిప్‌లో వెళ్లాను. అక్కడి నుంచి నార్వేకు ట్రైన్‌లో వెళ్లాను. అక్కడి నుంచి డెన్మార్క్, బెర్లిన్‌ తిరిగి మళ్లీ స్వీడన్‌ చేరుకున్నాను. భలే అనిపించింది’ అంటుంది సుధ.

కాని ఆమె కాలి కింద చక్రాలు ఏర్పడటానికి 2003 రావాల్సి వచ్చింది. అంతకు రెండేళ్ల ముందు ఆమె ఎనర్జీ రంగాన్ని అధ్యయనం చేసి ఎనర్జీ (ఇంధన శక్తి) ఎక్స్‌పర్ట్‌గా మారింది. ‘ఆ సమయంలో ఆ రంగంలో ఎవరూ ఎక్స్‌పర్ట్‌లు లేరు. దాంతో నాకు దేశవిదేశాల నుంచి కాన్ఫరెన్స్‌లకు ఆహ్వానాలు రాసాగాయి. 2003లో కిర్గిస్తాన్‌ వెళ్లాను ఒక్కదాన్నే. అక్కడి నుంచి ఉజ్బెకిస్తాన్‌ వెళ్లాను. ఒక్కదాన్నే తిరగడంలో ఆనందం అర్థమైంది. ఇక నేను ఆగలేదు. నా భ్రమణ జీవితం నా 50వ ఏట మొదలైంది’ అంటుంది సుధా నాగలింగం.

సుధకు ఇద్దరు కొడుకులు. వాళ్లు ఎప్పుడూ తల్లికి మద్దతే. ‘నీ ఇష్టం వచ్చినట్టు లోకం చూడమ్మా. కాని సేఫ్‌గా ఉండు’ అంటారు. కాని భర్త సంప్రదాయవాది. ‘ఆయన నేను ఎక్కడకు వెళ్లానో తెలిస్తే కంగారు పడతారు. అందుకని ఎక్కడికో చెప్పను. వచ్చాక నా ప్రయాణ అనుభవాలు బ్లాగ్‌లో రాస్తే చదువుకుంటారు. వచ్చేశాక ఏం భయం’ అని నవ్వుతుందామె.

స్త్రీగా ఉంటూ ఒంటరిగా తిరుగుతూ 50 ఏళ్లు పైబడ్డాక ఇన్ని పర్యటనలు చేయడం సుధా నాగలింగంకే చెల్లిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె నేపాల్‌ మీదుగా ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌ వరకూ అధిరోహణ చేసింది. ఆస్ట్రేలియాలో డీప్‌ సీ డైవింగ్‌ చేసింది. ఆ దేశంలోని ‘ఉలురు’లో స్కైడైవింగ్‌ కూడా చేసింది. ఆకాశంలో ఇన్‌స్ట్రక్టర్‌ సహాయంతో దూకినప్పుడు ఆమె వయసు 66 సంవత్సరాలు.

‘నా ప్రయాణాల్లో అనుకోనివి ఎన్నో జరిగాయి. నైరోబీ ఎయిర్‌పోర్ట్‌ లో ఎల్లో ఫీవర్‌ వాక్సినేషన్‌ లేదని నన్ను ఆపేశారు. చైనాలో వెజిటేరియన్‌ రెస్టరెంట్‌ వెతకలేక ఆకలి తో నకనకలాడాను. చెక్‌ రిపబ్లిక్‌ లో వాలిడ్‌ వీసా లేదని చాలా హంగామా చేశారు. ఇరాన్‌లో ఒక చారిత్రక కట్టడం చూస్తుంటే నేను లోపల ఉన్నానన్న సంగతి మరచి సిబ్బంది తాళం వేసుకు వెళ్లిపోయారు. ఇన్ని జరిగినా చివరకు మనుషులు తోడు నిలిచారు. ప్రయాణాలు సాటి మనుషుల మీద విశ్వాసాన్ని పెంచుతాయి అని తెలుసుకున్నాను’ అంటుందామె. ‘నేను తిరిగిన అన్నీ దేశాల్లోకెల్లా ఇరాన్‌లో స్త్రీలు ఒంటరిగా చాలా సేఫ్‌గా తిరగొచ్చు అని తెలుసుకున్నాను.’ అంటుందామె. ఇరాక్‌ను కూడా చుట్టేసింది.

‘సాధారణంగా కొత్త ప్రాంతాల్లో తిరుగుతుంటే స్థానికులు ఆకర్షణీయంగా ఉండే స్త్రీలను చూస్తారు. గమనిస్తారు. కాని నా వయసు, మామూలు దుస్తులు నా మీద అటెన్షన్‌ పడేలా చేయవు. అందుకే నేను స్వేచ్ఛగా అన్నీ ఆస్వాదిస్తాను’ అంటుందామె.

‘ఇండోనేషియాలో రెయిన్‌ ఫారెస్ట్‌లో పది రోజులు ఉన్నాను. అక్కడ మోకాలు లోతున ఆకులు రాలిపడి ఉంటాయి. వాతావరణం అనూహ్యంగా ఉంటుంది. వేరెవరైనా సరే భయపడతారు. కాని నేను మాత్రం ప్రకృతి ఎంత చిక్కగా ఉంటుందో అక్కడే చూడగలిగాను. ఏ మలినం లేని ప్రకృతి అది’ అంటుంది సుధ. ఆమె ఇకపై ఆఫ్రికా ఖండం చుట్టాలనుకుంది. అక్కడ ఏ అనుభవాలు మూటకట్టుకోనుందో.

‘పెళ్లి.. పిల్లలు.. కెరీర్‌– ఉంటాయి. కాని ఇవి మాత్రమే జీవితం కాదు. మన జీవితంలో ఎన్నో జీవితాలు జీవించాలి. ప్రయాణాలు ఒక అవసరమైన జీవితం. అద్భుత జీవితం. జీవిస్తేనే అందులోని గొప్పతనం తెలుస్తుంది’ అంటుందామె. ఆమె మాటలు విని, కదిలే అదృష్టం ఎందరిదో.                                          

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు