ఆటోకి ఊరి లుక్‌ వచ్చింది!

14 Nov, 2020 08:03 IST|Sakshi

పల్లెను వదిలొచ్చాక తల్లి గుర్తొస్తే గుట్టుగానైనా కన్నీళ్లు పెట్టుకోడానికి సిటీలో చోటే దొరకదు. పల్లే తల్లయిన కుర్రాడికి చెరువులోని చేపలు, చేలోని వరి కంకులు, కోళ్లూ కుందేళ్లూ, కొండ మీద గుడిలో స్వాముల వారు.. ఊరంతా తోబుట్టులే. బతకడానికి వచ్చినవాడు రాళ్లు కొట్టగలడు, ఆటో నడపగలడు, పట్టభద్రుడైతే పద్దులూ రాయగలడు. పొద్దుపోయాక, ’ఏరా పెద్దోడా తినే పడుకున్నావా..’ అనే తండ్రి గొంతు వినకుంటే సిటీలో బతుకు ఉన్నట్టేనా? బతుకుతున్నట్టేనా? ఇలాగే ఉంటుంది ఊరిని వదిలి రావడం. ఒడిశాలోని కంధమల్‌ గ్రామం నుంచి పని వెతుక్కుంటూ రాజధాని నగరం భువనేశ్వర్‌ వచ్చాడు సుజిత్‌ దిగల్‌. అమ్మను వదిలి వచ్చిన పిల్లవాడిని సిటీ పెద్దమ్మ ఆదరించింది. ఆటో నడిపే పనిలో పెట్టింది. డబ్బులొస్తున్నాయి సంతోషమే. అమ్మతోనూ రోజూ మాట్లాడుతూనే ఉన్నాడు.

అమ్మలాంటి ఊరినే.. చూడకుండా ఉండలేక పోతున్నాడు. సిటీలో ఊపిరి ఆడటం లేదు. సిటీని వదలి వెనక్కు వెళితే ఊపిరే ఉండదు. కొన్నాళ్లు చూశాడు. బెంగ అలాగే ఉంది. ఆటోలో చిన్న మొక్కను పెట్టుకున్నాడు. మనసుకు నెమ్మదిగా అనిపించింది. మరికొన్ని మొక్కలు తగిలించాడు. ఆటోకి గార్డెన్‌ లుక్‌ వచ్చింది. చిన్న ఆక్వేరియం పెట్టాడు. ఆటో లోపలే రెండు బోన్లు వేలాడదీసి ఒక దాంట్లో కుందేలు పిల్లను, ఇంకో దాంట్లో పక్షుల్ని ఉంచాడు. ఆటోకి ఊరి లుక్‌ వచ్చింది! ఆటో నడుపుతున్నంతసేపూ ఊళ్లో తిరుగుతున్నట్లే ఉంది సుజిత్‌ కి. ‘ఈ కుందేలు పిల్ల, పక్షులు, చేపలు, పూల మొక్కలు మా ఊరి వైబ్రేషన్స్‌ని నాకు అందిస్తున్నాయి‘ అంటున్నాడు. అమ్మ ఫొటో ఉన్న పర్స్‌ సుజిత్‌ కి తన ఆటో ఇప్పుడు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు