Dry Eye Irritation: కంట్లో దురదా.. ఇలా చేస్తే సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు!

5 Oct, 2021 13:41 IST|Sakshi

మీ కళ్లు ఎర్రబడి, తరచు దురదతో బాధిస్తున్నాయా? ఐతే మీరు డ్రై ఐ సిండ్రోమ్‌ తో బాధపడుతున్నారన్నమాట. మధ్య వయస్కుల్లో, వృద్ధుల్లో ఇది సహజంగా కనిపించేదే అయినప్పటికీ ప్రస్తుత జీవనశైలి కారణంగా పిల్లల్లో, యుక్తవయసువారు కూడా ఈ సిండ్రోమ్‌ బారిన పడుతున్నారు. సాధారణంగా కన్నీటి గ్రంథులు పొడిబారితే డ్రై ఐ సిండ్రోమ్‌ సమస్య తలెత్తుతుంది. ఇది విపరీతంగా చికాకును, బాధను కలిగిస్తుంది. నిపుణులు సూచించిన ఈ కింది పద్ధతుల ద్వారా ఈ సిండ్రోమ్‌ నుంచి ఏ విధంగా బయటపడొచ్చో తెలుసుకుందాం..

ఎందుకు వస్తుందంటే..
వెలుతురు సరిగాలేని ప్రదేశాల్లో, ఎయిర్ కండిషన్డ్ గదుల్లో నివసించడం, ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్‌లపై పనిచేయడం వంటి కారణాల రిత్యా ఈ సమస్యతలెత్తవచ్చు. అంతేకాకుండా కొన్ని మెడికల్‌ ట్రీట్‌మెంట్స్‌, హార్మోన్ల అసమతుల్యత, అలర్జీలు, వృద్ధాప్యం కూడా కళ్లు పొడిబారడానికి కారణం అవుతాయి. దీర్ఘకాలంపాటు పొడి కళ్ళ సమస్య ఉంటే మీ దృష్టికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. 

సహజ పద్ధతుల్లో చికిత్స ఇలా..


నీరు అధికంగా తాగాలి
కంటి ఉపరితలం ఆరోగ్యంగా ఉండాలంటే తగిన మొత్తంలో నీరు అవసరం అవుతుంది. కంటిని శుభ్రపరచి, రక్షించడానికి ఉపయోగపడే ద్రవాలు విడుదల కావడానికి, లాక్రిమల్ గ్రంధులు సమర్థవంతంగా పనిచేయడానికి నీరు అధికంగా తాగడం ఉత్తమం. హైడ్రేటెడ్‌గా ఉండడం వలన ఆరోగ్యకరమైన సహజ కన్నీళ్లు, నూనెలు ఉత్పత్తి అవుతాయి. అయితే డీహైడ్రేటెడ్ వల్ల కంటి ఉపరితలం పొడిబారి చికాకు, దురద కలిగేలా చేస్తాయి. కాఫీ, ఆల్కహాల్.. వంటి ఇతర కెఫిన్ అధిరంగా ఉండే పానీయాలు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. వీటికి దూరంగా ఉండటం మంచిది. పుచ్చకాయ, పీచ్‌ పండ్లు, దోసకాయ, స్ట్రాబెర్రీ.. వంటి నీటి శాతం పుష్కలంగా ఉండే పండ్లు తినడం వల్ల కళ్లు పొడిబారకుండా నిరోధించవచ్చు.

ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి
అనేక అధ్యయనాల ప్రకారం ఫ్యాటీ ఆమ్లాలు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కళ్లు పొడిబారకుండా నిరోధించి కళ్లకవసరమైన నూనెలు సమృద్ధిగా అంది మృదువుగా ఉండేలా చేస్తాయని వెల్లడించాయి. ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాల్లో ఈపీఏ, డీహెచ్‌ఏ నిష్పత్తి అధికంగా ఉంటుంది. ఇది కళ్లు పొడిబారడం వల్ల కలిగే మంటను నిరోధిస్తుంది. అవిసె గింజలు, గుడ్లు, చియా విత్తనాలు, చేపలు, వాల్‌నట్స్‌లలో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు నిండుగా ఉంటాయి.

రెప్పవాల్చక పోవడం
కంప్యూటర్‌ వంటి ఎలక్ట్రిక్‌ గాడ్జెట్‌లను రెప్పవేయకుండా తదేకంగా చూడటం వల్ల కూడా కళ్లు పొడిబారిపోతాయి. దీనినే డిజిటల్‌ ఐ స్ట్రైన్‌ అని కూడా అంటారు. ఏదిఏమైనప్పటికీ నిముషానికి కనీసం 15 నుంచి 30 సార్లైనా కనురెప్పలు ఆడించాలి. ప్రతి 20 నిముషాలకు ఒకసారి మీ కళ్లకు విశ్రాంతినివ్వడం వల్ల డ్రై ఐ సిండ్రోమ్‌ నుంచి కాపాడుకోవచ్చు. మీరు ఒకవేళ ఎలక్ట్రిక్‌ స్క్రీన్‌ ముందు గంటలకొద్దీ సమయం గడపవలసి వస్తే బ్లూ లైట్‌ ఫిల్టరింగ్‌ స్పెటికల్స్‌ (కళ్లద్దాలు) వాడటం మంచిది.

కళ్లను శుభ్రపరచాలి
ప్రతిరోజూ కళ్లకు మేకప్‌చేసే అలవాటుంటే..  తప్పనిరిగా కను రెప్పలను, కను బొమ్మలను, కంటి చుట్టు పక్కల చర్మాన్ని బేబీ షాంపూ లేదా మిల్డ్‌ సోప్‌లతో శుభ్రపరచుకోవాలి. తర్వాత వేడి నీటిలో ముంచిన గుడ్డను కళ్లపై కనీసం నిముషంపాటైనా ఉంచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కంటి పై మూసుకుపోయిన నూనె గ్రంథులు విచ్చుకోవడానికి, మంటను తగ్గించి చికాకును తొలగించడానికి ఉపయోగపడుతుంది.

సన్‌ గ్లాసెస్‌ ధరించాలి
కాలుష్యం, ధుమ్ము, ధూళి కూడా మీ కళ్లు పొడిబారేలా చేస్తాయి. సన్‌ గ్లాసెస్‌ వీటి నుంచి మీ కళ్లను కాపాడటమేకాకుండా సూర్యుడి నుంచి ప్రసరించే ప్రమాదకర యూవీ కిరణాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. ఇది కంటిలోని నల్ల గుడ్డును, కటకాన్ని, రెటీనాను, మాక్యులర్‌ డీజనరేషన్‌ ప్రమాదంలో పడకుండా కాపాడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి: ఆ సమస్యతో బాధపడేవారిలో గుండె జబ్బులు రెండింతలు ఎక్కువ!

మరిన్ని వార్తలు