Kilimanjaro: తల్లి.. తనయుడు.. కిలిమంజారో

27 Jul, 2021 01:28 IST|Sakshi

కొడుక్కు14 ఏళ్లు. తల్లికి 35 లోపే. ‘కిలిమంజారో అధిరోహిద్దామా అమ్మా’ అని కొడుకు అంటే ‘అలాగే నాన్నా’ అని తల్లి సమాధానం ఇచ్చింది. అలా ఏ కొడుకూ తల్లీ కలిసి కిలిమంజారోకు హలో చెప్పింది లేదు. దుబాయ్‌లో స్థిరపడ్డ   శోభ తన కొడుకుతో కలిసి సాధించిన రికార్డు అది. పిల్లలను మార్కెట్‌కు పంపడానికి భయపడే ఈ రోజుల్లో కొత్త ప్రపంచాలకు చూపు తెరిచే సాహసాలు చేయడం స్త్రీలు సాధ్యం చేస్తున్నారు.

సాధారణంగా తల్లీకుమారులు కలిసి సాయంత్రం కూరగాయలు కొనడానికి వెళుతుంటారు. ఐస్‌క్రీమ్‌ తినడానికి. లేదంటే ఒక లాంగ్‌ డ్రైవ్‌. పిక్నిక్‌. కాని దుబాయ్‌లో స్థిరపడ్డ్డ బెంగాలి కుటుంబం శోభ మహలొనోబిస్, ఆమె కొడుకు శాశ్వత్‌ మహలొనోబిస్‌ మాత్రం అలా ఏదైనా కొండెక్కి దిగుదామా అనుకుంటారు. శోభ భర్త శుభోజిత్‌ ఇందుకు తన వంతు ప్రోత్సాహం అందిస్తుంటాడు. విదేశాలలో ఉన్న భారతీయులు సాధించే విజయాలు కొన్ని ఇక్కడ ప్రచారం పొందడం లేదు. కాని జూలై రెండో వారంలో ప్రపంచంలో అతి ఎత్తయిన పర్వతాలలో ఒకటైన కిలిమంజారోను అధిరోహించిన తొలి తల్లీకొడుకుల జంటగా శోభ, శాశ్వత్‌ రికార్డు స్థాపించారు. బహుశా కిలిమంజారోను అధిరోహించిన అతి చిన్న వయస్కుడైన భారతీయుడిగా కూడా శాశ్వత్‌ రికార్డు నమోదు చేసి ఉండవచ్చు.

 శోభ, కుమారుడు శాశ్వత్‌తో శోభ

భళాభళిమంజారో
అఫ్రికాఖండంలో అతి ఎత్తయిన పర్వతంగా ఖ్యాతి గడించిన కిలిమంజారో టాంజానియాలో ఉంది. సముద్రమట్టం నుంచి దీని ఎత్తు 19,341 అడుగులు. ఏదైనా పర్వతాల వరుసలో కాకుండా ఏకైక పర్వతంగా (సింగిల్‌ ఫ్రీ స్టాండింగ్‌) నిలవడం దీని విశిష్టత. ఇది అగ్నిపర్వతం. అంతేనా? మైనస్‌ 7 నుంచి 16 డిగ్రీల వరకూ ఉండే తీవ్రమైన శీతల ఉష్ణోగత, మంచుపొరలు, కఠినమైన శిలలు, ప్రచండ గాలులు... దీనిని అధిరోహించడం పెద్ద సవాలు. ఈ సవాలును స్వీకరించడంలోనే పర్వతారోహకులకు కిక్‌ ఉంటుంది. ప్రాణాలకు తెగించైనా సరే అనే తెగింపు ఉంటుంది. అలాంటి తెగింపును చూపారు శోభ, శాశ్వత్‌.

కొడుకు కోసం
దుబాయ్‌లోని జెమ్స్‌ మోడ్రన్‌ అకాడెమీలో చదువుకుంటున్న 14 ఏళ్ల శాశ్వత్‌ చదువులో చాలా బ్రిలియంట్‌. ఇప్పటికే అతడు ‘పైథాన్‌’ లాంగ్వేజ్‌లో స్పెషలిస్ట్‌. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌లో 14 సర్టిఫికెట్లు పొందాడు. కోవిడ్‌ కాలంలో ఊరికే ఉండక చాలామందికి పైథాన్‌ నేర్పించాడు. గిటార్‌ కూడా వాయిస్తాడతడు. అంతే కాదు బయట తిరగడం కూడా అతడి హాబీ. ‘మావాడు ఇంట్లో ఉండడు. ఎక్కడికైనా తిరగాలంటాడు. వాడి ట్రెక్కింగ్‌లో భాగంగా నేను కూడా వెళ్లేదాన్ని. నేను వాడితో పాటు కొండలెక్కుతుంటే మా అమ్మ కూడా భలే ఎక్కుతోంది అన్నట్టుగా గర్వంగా చూసేవాడు. వాడు నా నుంచి ఇన్‌స్పయిర్‌ అవుతున్నాడని అనిపించింది. వాడు కిలిమంజారో ఎక్కుదామని అన్నప్పుడు వాడికి తోడుగా నేను కూడా ఉండాలని నిశ్చయించుకున్నాను’ అంటుంది శోభ.

కఠోర శిక్షణ తీసుకుని
కాని ఇది చిన్నా చితక వ్యవహారం కాదని వాళ్లిద్దరికీ తెలుసు. అందుకే కఠోర శిక్షణ మొదలెట్టారు. ముందుగా దుబాయ్‌ చుట్టుపక్కల ఉండే కొండలను ట్రయినర్స్‌ సహాయంతో ఎక్కడం నేర్చుకున్నారు. భుజాలకు పది పది కేజీలు ఉన్న బ్యాగ్‌లు కట్టుకుని, వాటిలో పర్వతారోహణ సామాగ్రిని మోస్తూ సాధన చేశారు. ‘వారంలో నాలుగురోజులు మేము కొండలెక్కడం దిగడం సాధన చేశాం. ఇవి కాకుండా ఇద్దరం కలిసి రోజూ ఐదు కిలోమీటర్లు నడిచేవాళ్లం. శాశ్వత్‌ అది చాలదన్నట్టు ట్రెడ్‌మిల్‌ మీద తిరిగి నడిచేవాడు’ అంది శోభ. ‘కిలిమంజారో ఎక్కడానికి అవసరమైన శారీరక, మానసిక దృఢత్వం మాకు వచ్చింది అనుకున్నాకే మేము అధిరోహణకు బయలుదేరాం’ అని శాశ్వత్‌ అన్నాడు.

ఆరు రోజులలో
టాంజానియాలో కిలిమంజారో నుంచి జూలై 4న ఈ తల్లీకొడుకుల ఆరోహణ మొదలైంది. ‘మొదటి రోజు మేము 10 గంటల పాటు అధిరోహించాము. కాని నా పని అయిపోయిందని అనిపించింది. ఇక చాలు వెనక్కు వెళ్లిపోదాం అనుకున్నాను. కాని అమ్మ నాకు ధైర్యం చెప్పి ముందుకు తీసుకువెళ్లింది. జూలై 9న మేము శిఖరాన్ని అధిరోహించాము. మధ్యలో అమ్మ డీలా పడితే నేను ధైర్యం చెప్పాను. మేము ఇద్దరం ఒకరికి ఒకరం విశ్వాసం కల్పించుకుంటూ ముందుకు సాగాం. శిఖరం ఎక్కే రోజున ఏకధాటిగా 14 గంటలు ఎక్కుతూనే ఉన్నాం. అంత శ్రమ పడి పైకి ఎక్కిన తర్వాత అక్కడ కనిపించే ప్రకృతి దృశ్యం వర్ణనాతీతం అనిపించింది. అది ఒక అద్భుతం’ అని శాశ్వత్‌ అన్నాడు.

ఈ విజయం తర్వాత ఈ తల్లీకుమారులు ఎవరెస్ట్‌ మీద తమ గురి నిలిపారు. ‘మేము ముందే అనుకున్నాం... ఈ అధిరోహణ విజయవంతమైతే ఎవరెస్ట్‌ను తాకాలని. బహుశా వచ్చే మార్చి, ఏప్రిల్‌లలో మేము ఆ పని చేస్తాం’ అని శోభ అంది. సాహసాలు, ప్రకృతి దర్శనం మానవ ప్రవృత్తిని ఉన్నతీకరిస్తుంది. ఆ మేరకు చిన్న వయసులోనే తల్లిని తోడు చేసుకుని అంత పెద్ద పర్వతం అధిరోహించిన శాశ్వత్‌ మున్ముందు ఎన్నోసార్లు ఘనవిజయాలతో మనల్ని తప్పక కలుస్తాడు.

మరిన్ని వార్తలు