పండగ కళ పదింతలు.. ఆదుర్దా వద్దు.. ఇలా చేయండి!

5 Oct, 2022 13:47 IST|Sakshi

పండగ వేళ ఇల్లు కళగా వెలిగిపోవాలంటే ఏం చేయాలా అని ఎక్కువ ఆదుర్దా పడనక్కర్లేదు. సింపుల్‌గా అనిపిస్తూనే, ఎక్కువ  శ్రమ లేకుండా కొన్ని వస్తువులతో అలంకరణ ద్వారా పండగ కళను రెట్టింపు చేసుకోవచ్చు. దశమి నాడు పది విధాల మేలైన కళ ఇది.

1.  ఇత్తడి, రాగి పాత్రలు
ఇవి ఉంటే చిటికెలో పని అయిపోయినట్టే. అందులోనూ దేవతా రూపాలతో ఉన్న వస్తువులైతే అలంకరణ మరింత సులువు అయిపోతుంది. మర చెంబులు, వెడల్పాటి ప్లేట్లు ఉన్నా.. వీటిలో నీళ్లు పోసి పువ్వులు వేస్తే చాలు పండగ కళ వచ్చేసినట్టే. 

2.  డిజైనర్‌ రంగోలీ
ముంగిట్లో ముచ్చటైన రంగవల్లికలు అందం. అలాగని పెద్ద పెద్ద ముగ్గులు వేసే టైమ్‌ లేదు అనుకునేవారికి సింపుల్‌ చిట్కా.. మార్కెట్‌లో డిజైనర్‌ రంగవల్లికలు రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. సాయంకాలపు వెలుగుకు ఈ ముగ్గులు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. 

3.  పువ్వులు–ఆకులు
ముగ్గుల స్థానంలో పువ్వులు, ఆకులతో ఇలా ముచ్చటైన డిజైన్లుగా రూపుకట్టవచ్చు. ఈ అలంకరణ ఎప్పుడు చేసినా పండగ నట్టింట్లో కొలువుదీరినట్టే. 

4.  డిజైనర్‌ తోరణం
మామిడి, బంతిపూలతోనే కాదు ఇవి కూడా డిజైనర్‌ తోరణాలే. ఎంబ్రాయిడరీ జిలుగులు, అద్దకం, కుందన్స్‌ మెరుపులతో తీర్చిదిద్దిన అందమైన తోరణాలు ఎన్నో. వాటిని ఒకసారి తెచ్చుకుంటే ప్రతి పండగకూ మెరిపించవచ్చు. ఇలా అందమైన కళను తీసుకురావచ్చు. 

5.  వాల్‌ హ్యాంగింగ్స్‌
టెర్రకోట గంటలు, ఫెదర్‌ తో కూడిన పక్షుల బొమ్మలు .. ఇలా రకరకాల హ్యాంగింగ్స్‌ తెచ్చి గుమ్మం ముందు వేలాడదీస్తే ఎంత కళను తెచ్చిపెడతాయో కళ్లారా చూడాల్సిందే. 

6.  పువ్వుల హ్యాంగింగ్‌
ఎన్ని పూల దండలను వేలాడదీస్తే అంత అందంగా కనిపిస్తుంది ఇల్లు. అయితే, ఎక్కడ ఎలా అలంకరించాలో మాత్రం ఎవరి అభిరుచి వారిదే. 

7.  డెకార్‌ కుషన్స్‌
చిన్న చిన్న పిల్లోస్‌ లేదా కుషన్స్‌ సోఫా– దివాన్‌ల మీద వేస్తూ ఉంటారు. వాటికి రంగు రంగుల కాంబినేషన్‌లో ఉన్న కవర్స్‌ వేస్తే పండగ కళ అదిరిపోయిందనే కితాబు రాకుండా ఉండదు. 

8.  బొమ్మలు
దసరా పండగ అంటే చాలామంది బొమ్మల కొలువులతో అలరిస్తుంటారు. అన్ని బొమ్మలు లేకపోయినా ఈ పండగ నాడు కొన్న కొన్ని బొమ్మలతో షోకేస్‌ని అలంకరిస్తే చాలు. వాటిలో మన దేశీయ హస్త కళాకృతులను చేరిస్తే మరింత అందం వస్తుంది. దసరా పండగను పురస్కరించుకుని వచ్చిన వాల్‌ స్టిక్కర్స్‌ను కూడా ఉపయోగించవచ్చు. 

9.  పూజా ప్లేట్‌
పూజలలో వాడే ప్లేట్‌ని కూడా అందంగా అలంకరించుకోవచ్చు. డిజైనర్‌ థాలీ పేరుతో ఇవి మార్కెట్లో లభిస్తున్నాయి. పువ్వులు, ఆకులు, నెమలి ఈకలు.. మొదలైనవాటిని ఉపయోగించే పూజా ప్లేట్స్‌ లేదా అలంకరణ ప్లేట్లను తయారు చేసుకోవచ్చు. 

10.  నీటిపైన పువ్వులు
అలంకరణకు ఏ వస్తువులూ లేవని చింతించనక్కర్లేదు. కొన్ని రకాల పువ్వులను ఒక పెద్ద పాత్రలో ఉంచి గుమ్మానికి ఒక వైపున లేదా ఇంటిలోపల గుమ్మానికి ఎదురుగా అలంకరించినా చాలు... పండగ కళ రెట్టింపుగా మిమ్మల్ని పలకరిస్తుంది. 

మరిన్ని వార్తలు