కవికోకిల దువ్వూరి

9 Nov, 2020 00:18 IST|Sakshi

నేడు దువ్వూరి రామిరెడ్డి 125వ జయంతి

ఒక గ్రంథాలయంలో ఒక శతావధాని కవిత్వం పూర్వజన్మ సంస్కారమనీ, పుస్తక పఠనం వల్ల పండితుడు కావచ్చేమో కానీ కవి మాత్రం కాలేడనీ వ్యాఖ్యానించాడు. అది ఓ 19 ఏళ్ల యువకుడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ప్రయత్నిస్తే కవిత్వం రాయటం కష్టం కాదని ఆయనతో వాగ్వివాదానికి దిగాడు. ఆ అవధాని అయితే రాసి చూపించమని సవాల్‌ విసిరాడు. ఆ సంఘటన అతనిలో దాగివున్న కవితా ప్రతిభను వెలికి తెచ్చిన ఓ ఘటన మాత్రమే. ఆ యువకుడే తన అద్భుత కవితాధారను ఖండకావ్యాలుగా, ప్రబంధాలుగా, నాటకాలుగా, అనువాదాలుగా ప్రవహింపజేసిన సాహితీ గంగ దువ్వూరి రామిరెడ్డి.

రామిరెడ్డి 1895 నవంబర్‌ 9న నెల్లూరు జిల్లా గూడూరులో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గూడూరులో, పెమ్మారెడ్డిపాలెంలో సాగింది. తరువాత హార్వీ అనే ఆంగ్లేయుని వద్ద థర్డ్‌ ఫారం వరకు చదివారు. తండ్రి మరణంతో పై చదువులు కొనసాగించలేకపోయారు. జిజ్ఞాస ఏ డిగ్రీలూ ఇవ్వలేనంత జ్ఞానసంపదనిస్తుందన్నది దువ్వూరి విషయంలో అక్షర సత్యం. ఆయన ఆసక్తిని, పరిశీలనాశక్తిని విజ్ఞానశాస్త్రాలు, మెకానికల్‌ ఇంజనీరింగ్, హిప్నాటిజం, సినిమా ఎంతగానో ఆకర్షించాయి. వాటి మీద పట్టు సాధించేటట్లు చేశాయి. ఇంటిని కళాశాలగా, విశ్వవిద్యాలయంగా మలుచుకున్నారు. సాహిత్యమే ఊపిరిగా చేసుకున్న ఆయన  రచనల ప్రణాళిక, సన్నివేశాల, పాత్రల రూపకల్పన గురించి, తను చదివిన పుస్తకాల, చూసిన నాటకాల మీద స్పందనను డైరీలో రాసేవారు. పట్టుదలతో ఛందో లక్షణాలను, అలంకారాలను, తెలుగు వ్యాకరణాన్ని చదివారు. సహజ పాండిత్యంతో రసికజనానందం, స్వప్నాశ్లేషమ్, అహల్యానురాగం, కృష్ణ రాయబారం అనే ప్రబంధాలను రచించారు.

కర్షకవిలాసం, కుంభరాణా, మాధవ విజయం అనే నాటకాలను రచించారు. వీటిలో కుంభరాణా ప్రసిద్ధం. నాటకం రాసిన తరువాత కేవలం తొమ్మిది రోజుల్లో ప్రదర్శన కావటానికి దువ్వూరి సహాధ్యాయి ఎరగుడిపాటి హనుమంతరావు కృషి చేశారు. అంతే కాదు, విషాద పాత్రలకు పేరొందిన ఆయన కుంభరాణా పాత్రను అద్భుతంగా పోషించారు. ఆంధ్ర దేశమంతటా ప్రదర్శనలతో ఆ నాటకం ఇరువురికి ఎంతో పేరు తెచ్చింది. స్వతంత్ర రచనలే కాక ఋతుసంహారం, పుష్పబాణ విలాసం అనే అనువాదాలు చేశారు. తన ఖండకావ్యాలలోని మణిపూసలను ‘వాయిస్‌ ఆఫ్‌ ద రీడ్‌’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించి కజిన్స్‌ హెచ్‌. జేమ్స్‌ను దిద్దుబాటు చేసి, పీఠిక రాయమన్నారు. భారతీయుల ఆంగ్ల కావ్యాలకు రాయనని నియమం పెట్టుకున్నానన్న ఆయన అనువాదాన్ని చదివి దువ్వూరి ప్రతిభకు ముగ్ధుడై అద్భుతమైన ఉపోద్ఘాతాన్ని రాశారు. 

వీరి విస్తృత రచనలలో విశేష ప్రాచుర్యాన్ని పొందినవి నలజారమ్మ, కృషీవలుడు, పానశాల కావ్యాలు. అవి చిరంజీవత్వాన్ని పొందాయి. వాటిలో నలజారమ్మ ఇతివృత్తం రామిరెడ్డి తల్లి లక్ష్మీదేవమ్మ కుటుంబ నేపథ్యం నుండి వచ్చింది. ఆనాటి తురుష్క రాజులు స్థానిక పరిపాలనలో జోక్యం చేసుకోక శిస్తు వసూళ్లను, న్యాయపాలనను గ్రామపెద్దలకే ఇచ్చేవారు. గూడూరులో ఆ వ్యవహారాలను పెరుమారెడ్డి పెంచెల్‌రెడ్డి చూస్తుండేవాడు. తప్పులకు కఠినమైన శిక్షలుండేవి. ఒక గ్రామస్తుడి కూతురే నలజారమ్మ. అల్లుడు వెంకటరెడ్డి. ప్రసవించబోతున్న భార్య జొన్నకంకులు తినాలన్న చిన్న కోరికే వెంకటరెడ్డిని అవి తెచ్చేటట్లు చేసింది.

ఐతే వేరొకరి పొలంలోవి తెచ్చాడు. వాటిని ఇంటికి తెచ్చేలోపు నలజారమ్మ ఒక శిశువును ప్రసవించింది. కానీ ఆ రైతు ఫిర్యాదు మేరకు ఆమె భర్తకు మరణశిక్ష విధించాడు పెంచెల్‌రెడ్డి. జరిగిన దారుణాన్ని తెలుసుకున్న ఆమె అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ ‘నలజారమ్మ అగ్నిప్రవేశం’ దువ్వూరి ప్రథమ కావ్యాలలో గొప్ప రచనగా భావించవచ్చు. కావ్యమంతా అద్భుతమైన వర్ణనలే. పచ్చని పొలాలు, చెరకు గానుగలు, జొన్నచేలు ఇతివృత్తానికి సరిపడే వాతావరణాన్ని ఇస్తాయి. నలజారమ్మ పేర వెలసిన గుడిలో నేటికీ గూడూరులో పూజలు, కైంకర్యాలు జరుగుతాయి.

దువ్వూరికి విశేష కీర్తిని తెచ్చిన ఖండకావ్యం ‘కృషీవలుడు’. రైతును, అతని జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకుని తెలుగులో వచ్చిన మొదటి కావ్యమిది. కవి రైతుగా స్వానుభవాన్ని అక్షరీకరించాడు. తన కావ్యపు నవ్యతను తెలియచేస్తూ ‘అన్నా హాలిక, నీదు జీవితము నెయ్యంబార వర్ణింప మే కొన్న, నిర్ఘర సారవేగమున ...’ అనే పద్యంలో రైతు జీవితాన్ని వర్ణించాలనుకున్నప్పుడు సెలయేటి ప్రవాహంలా మాధుర్యవంతమైన పదాలు అప్రయత్నంగా వస్తూవుంటే సమకాలిక కవులు కర్షక పక్షపాతి అని నిందావాక్యాలు పలుకుతారని భావించారు. అయినా పంజరంలోని చిలుక స్వేచ్ఛనెలా కోరుకుంటుందో తన మనసు అంతవరకు ఉన్న కావ్య నియమాలను అధిగమించి స్వేచ్ఛాకాశంలో విహరించాలని కోరుకుంటున్నదని అన్నారు. రైతు ఎంత నిరాడంబర జీవితాన్ని గడుపుతాడో ఈ కావ్యంలో ఎంతో హృద్యంగా చెప్పారు. అతని కోరిక లెపుడు నిత్యావసరాలను దాటి వెళ్లవని, అతని ఆలోచనలెప్పుడు పంటపొలాల చుట్టూనే ఉంటాయని, అతనికి పల్లే్ల సమస్త ప్రపంచమని చెప్పారు. రైతు శ్రమ ఫలితాన్ని ఇతరులు అనుభవిస్తారని, అతనికి తినటానికి, కట్టుకోవటానికి ఎప్పుడూ కరువే అని వ్యథ చెందారు.

దువ్వూరి తన పానశాల కావ్యానికి సుదీర్ఘ ఉపోద్ఘాతాన్ని రాశారు. అది పారసీక భాషా సాహిత్యాల మీద రామిరెడ్డి సాధికారతను తెలియచేస్తుంది. పారసీక నాగరికత, నాటి సాంఘిక, రాజకీయ పరిస్థితులను, సాహిత్యాన్ని వివరించారు. పారసీక సాహిత్యంలో ఇద్దరు కవులు ఆయనకు ఆత్మీయులయ్యారు. షేక్‌ సాదీ, ఉమర్‌ ఖయ్యాం. సాదీ రాసిన గులిస్తాను, బోస్తానులను ‘గులాబీతోట ’, ‘పండ్లతోట’లుగా అనుసృజన చేశారు. ఇక ఉమర్‌ ఖయ్యాం రచన రుబాయీలు. పారసీ ఛందస్సులోని వివిధ గతులు, పాదాంతర అక్షర నియమం వల్ల రుబాయీలకు ఒక మనోహరత్వం వస్తుందన్నారు. ఆ ధ్వని చెవులకు చేరిన వెంటనే మది పులకించి, కనుబొమలు నృత్యం చేస్తాయని ఆనందించారు. పారసీక భాషలోని కావ్య భేదాలను, ఛందోరీతులను పరిచయం చేస్తూ రెండు ద్విపదల కలయికే రుబాయీ అన్నారు. ఈ కవితా ప్రక్రియ తత్త్వాలు, సూక్తులు క్లుప్తంగా, సూటిగా చెప్పటానికి అనువుగా ఉంటుంది.

ఖయ్యాం రసార్ద్ర హృదయం, పారసీక భాషా మాధుర్యం దువ్వూరిని పారవశ్యానికి గురి చేశాయి. అజంత భాషైన తెలుగులో ఖయ్యాం రుబాయీలను ఒక లయ, తూగు, ఊగులతో పానశాలగా అనువదించి అజరామరమైన కీర్తి ఇరువురూ పొందేటట్లు చేశారు. అందువల్లనే వారికి కవికోకిల బిరుదు అన్నివిధాలా యుక్తమైనది. కావ్యారంభంలో ఖయ్యాంను పొగుడుతూ తొమ్మిది పద్యాలను రాశారు. జీవితం నశ్వరమని, జీవన్మరణాలకు వైరుధ్యం లేదని, అవి కవల పిల్లలని ఆకళింపు చేసుకున్న రామిరెడ్డి జీవిత తాత్త్వికతను ఈ కావ్యంలో పలుచోట్ల చెప్పారు. ‘నీవూ నేనను తారతమ్యం మిహమందే గాని...’ అన్నారు. ఈ ప్రపంచమంతా ఒక విశ్రాంతి గృహమని, ఎవరూ ఇక్కడ శాశ్వతంగా ఉండరని, దీనిని వీడి కొత్త వారికి చోటిస్తూ, ఎక్కడికో వెళ్లిపోతారన్న భావనను ‘అంతము లేని యీ భువనమంత పురాతన పాంథశాల’ పద్యంలో తేటపరిచారు. 

దువ్వూరి రాసిన సాహిత్య వ్యాసాలు ఆయన సాహిత్య మథనాన్ని, అందుకున్న సాహితీ ఎత్తుల్ని తేటతెల్లం చేస్తాయి. సాహిత్య శిల్ప సమీక్ష వారిని ఓ అలంకార శాస్త్రవేత్తగా, లక్షణ గ్రంథకర్తగా చూపుతుంది. జగన్నాథ పండితుడు ఎంత ఇష్టమో, ఎడ్గార్‌ అలన్‌ పో అంతే ఇష్టం. చలనచిత్ర రంగంలో కాలిడి తనదైన ప్రత్యేకతను చాటారు. సతీ తులసి చిత్రానికి కథ, మాటలు, పాటలు సమకూర్చారు. వేంకటేశ్వర మహాత్మ్యం, పార్వతీ పరిణయానికి పద్యాలు, పాటలు రాశారు. అక్కినేని నాగేశ్వరరావు తొలి చిత్రమైన ‘సీతారామ జననానికి’ సంభాషణలు అందించారు.  చిత్ర నళీయం సినిమాకు దర్శకత్వం వహించారు. అలా ఒక సినిమాకు దర్శకత్వం వహించిన తొలి తెలుగు కవి అయ్యారు.

తన కవిత్వ సుధారసాన్ని తెలుగు వారికి మిగిల్చిన కవికోకిల దువ్వూరి రామిరెడ్డి 1947 సెప్టెంబర్‌ 11న తుదిశ్వాస విడిచారు. రైతుల మనసుల్ని, జీవితాలను అర్థం చేసుకున్న; గ్రామీణ సౌందర్యానికి, ప్రశాంతతకు పరవశించిన ఆయన పార్థివ దేహం నేడు పెమ్మారెడ్డిపాలెంలో వాటి మధ్యే ప్రశాంతంగా నిదురపోతోంది. దువ్వూరి రామిరెడ్డి నిస్సందేహంగా 20వ శతాబ్దపు అగ్రశ్రేణి కవులలో ఒకరు.
-బొడ్డపాటి చంద్రశేఖర్‌ 

అంతము లేని యీ భువనమంత పురాతన పాంథశాల; విశ్రాంతి గృహంబు; నందు నిరుసంజలు రంగుల వాకిళుల్‌; ధరా క్రాంతులు పాదుషాలు బహరామ్‌ జమిషీడులు వేనవేలుగా గొంత సుఖించి పోయి రెటకో పెఱవారికి జోటొసంగుచున్‌ (పానశాల)

మరిన్ని వార్తలు