కొత్త బంగారు లోకం.. సతత హరిత పంటలు

21 Apr, 2021 18:16 IST|Sakshi
ఎడారిలో ఆకుపచ్చని ఒయాసిస్సు మాదిరిగా పుష్పావతి పొలం (ఇటీవలి ఏరియల్‌ వ్యూ)

వర్షాధార భూముల్లో ఏడాది పొడవునా ‘సతత హరిత ఆహార అరణ్యాలు’ 

పి.ఎం.డి.ఎస్‌. ప్రకృతి సాగుతో 365 రోజులూ పచ్చగా పంట పొలాలు

ఎండాకాలంలోనూ నేల తల్లిపై పచ్చని పంటల తివాచీ

 అనంతపురం జిల్లాలో పి.ఎం.డి.ఎస్‌. రైతుల అపురూప అనుభవాలు

ధరిత్రీ దినోత్సవం (ఏప్రిల్‌ 22) సందర్భంగా ప్రత్యేక కథనం

మానవాళికి, పశు పక్ష్యాదులకు ప్రాణాధారమైన నేల తల్లి ఆచ్ఛాదన లేక మండుటెండల్లో అల్లాడిపోతోంది. వాతావరణంలో పెరిగిపోతున్న తాపం ధాటికి జీవాన్ని కోల్పోతోంది. ఇటువంటి సంక్షోభ కాలంలో సాధారణ పేద రైతులు ఆకుపచ్చని పంటలతో భూతల్లికి వస్త్రం కప్పుతున్నారు. ఏడాది పొడవునా ప్రతి రోజూ పొలం అంతటా పచ్చని పంటలు పండిస్తున్నారు. సాంత్వన పొందిన ఆ తల్లి ప్రేమతో ఇస్తున్న కూరగాయలు, ధాన్యాలను కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరిస్తూ ఆనందంగా ఉన్నారు. అపురూపమైన ఈ రైతులు నీటి వసతి ఉన్నవారో, సుభిక్షమైన ప్రాంతవాసులో అనుకుంటే పొరపాటు. ఎడారిగా మారిపోతున్న అనంతపురం జిల్లాలో! అదికూడా.. వర్షాధార వ్యవసాయ భూముల్లో!!  ‘భూమాతను పునరుద్ధరించుకుందాం’ అన్న నినాదంతో ఈ నెల 22న ‘ధరిత్రీ దినోత్సవం’ జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా.. కరువు సీమలో ఎండాకాలంలోనూ పచ్చని పంటలతో భూమాతను తమ గుండెలకు హత్తుకుంటున్న కొందరు రైతుల సుసంపన్నమైన అనుభవాల సమాహారమే ఈ కథనం. 

ప్రకృతి వ్యవసాయానికి చిరునామా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం’లో ఒకానొక సరికొత్త ఆవిష్కరణ ‘వర్ష రుతువు కన్నా ముందుగానే విత్తనాలు విత్తుకోవటం’. దీన్నే ఆంగ్లంలో ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోయింగ్‌ (పి.ఎం.డి.ఎస్‌.) అంటారు. ఈ పద్ధతిలో ఏడాదిలో 365 రోజులూ పంటలతో భూమిని కప్పి ఉంచడం.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు చల్లకుండా ఉండటం వల్ల భూమాత తిరిగి జీవాన్ని సంతరించుకుంటున్నది. ఏడాది పొడవునా ఆకుపచ్చని పంటలతో పి.ఎం.డి.ఎస్‌. పంట భూములు కళకళలాడుతుండటం విశేషం. 

సాధారణంగా నీరు నదుల్లోనే ఉంటుందనుకుంటాం. కానీ, నదుల్లో కన్నా పది రెట్లు ఎక్కువ నీరు గాలిలో ఉంది. గాలిలో తేమ రూపంలో నీరుంది. ఆ తేమను గ్రహించి నేలను చెమ్మగిల్లేలా చేస్తూ వర్షం లేని కాలాల్లోనూ పంటలు నిలిచేలా.. సహజసిద్ధంగానే ఏడాది పొడవునా పచ్చగా ఉండేలా చేయటమే.. వినూత్నమైన పి.ఎం.డి.ఎస్‌. ప్రకృతి సాగు పద్ధతి విశిష్టత. ఆస్ట్రేలియాకు చెందిన ప్రసిద్ధ సాయిల్‌ మైక్రోబయాలజిస్ట్‌ డాక్టర్‌ యన సిద్ధాంతం మూలాధారంగా ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు. దీని ద్వారా కరువును జయించడం, స్థానికంగా ఆహార భద్రతను కల్పించడమే కాకుండా.. భూతాపోన్నతిని సైతం తగ్గించే అవకాశం ఉందని డా. యన స్పష్టం చేస్తున్నారు. 

తమకున్న పొలంలో కొద్దిపాటి విస్తీర్ణాన్ని మాత్రమే చిన్న, సన్నకారు, పేద రైతులు.. ముఖ్యంగా మహిళా రైతులు పి.ఎం.డి.ఎస్‌. పద్ధతిలోకి మార్చుతున్నారు. ఆ పొలాలు ప్రస్తుత ఎర్రని ఎండల్లోనూ పచ్చగా అలరారుతూ కూరగాయలను అందిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. తమ పంట పొలాల్లో ఎప్పుడూ పచ్చగా ఉండే ‘ఆహారపు అడవి’ని సృష్టిస్తున్నారు! గత మూడేళ్లుగా ఒక్క అనంతపురం జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌ అంతటా కొంత మంది రైతులు పి.ఎం.డి.ఎస్‌. పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నారు. వీరి కుటుంబాలకు ఏడాది పొడవునా కూరగాయలు వంటి పంటలతో అమృతాహారం అందుతున్నది. తినగా మిగిలిన కూరగాయలను అమ్ముకుంటూ చెప్పుకోదగ్గ ఆదాయాన్ని సైతం సమకూర్చు కుంటున్నారు. 

పి.ఎం.డి.ఎస్‌. ప్రకృతి సాగు అంటే..?
సాధారణంగా వర్షం పడి భూమి పదును అయిన తర్వాత దున్ని విత్తనం వేస్తారు రైతులు. అయితే, ఈ పద్ధతిలో రైతులు చేస్తున్నదేమిటంటే.. వర్షం రాక మునుపే, ఎండాకాలంలోనే, నేల పొడిగా ఉన్నప్పుడే.. ఎకరానికి 600 కిలోల ఘన జీవామృతం వేస్తున్నారు.. దుక్కి చేసి నవధాన్య విత్తనాలకు మట్టి, పేడతో లేపనం చేసి విత్తన బంతులు తయారు చేసి చల్లుతున్నారు. ఆ పైన వేరుశనగ కాయల పొట్టు, కంది పొట్టు, శనగ పొట్టు వంటి పంట వ్యర్థాలను రెండు, మూడు అంగుళాల మందాన వేస్తున్నారు. భూతల్లికి ఆచ్ఛాదనగా కప్పుతున్నారు. గాలిలో ఉన్న తేమను ఈ ఆచ్ఛాదన ఒడిసిపట్టి ఘనజీవామృతానికి, మట్టి కణాలకు అందిస్తోంది. ఆ విధంగా ప్రకృతి సాగు ద్వారానే వాతావరణంలోని తేమను ఒడిసిపట్టి పంట పొలాన్ని సస్యశ్యామలం చేస్తున్న వైనం ప్రపంచానికే ఆదర్శప్రాయం. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా పి.ఎం.డి.ఎస్‌. ప్రకృతి సాగుదారులందరికీ ‘సాక్షి సాగుబడి’ జేజేలు పలుకుతోంది!
– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

మెట్ట రైతులందరికీ ఈ సాగు పద్ధతిని నేర్పిస్తాం! 
ప్రకృతి వ్యవసాయం, వర్షానికి ముందే విత్తనాలు వేయటం వంటి సరికొత్త పద్ధతులను అనుసరించడం వల్ల ఎకరం, అరెకరం భూములను వర్షాధారంగా సాగు చేసే రైతులు కూడా ఏడాది పొడవునా అనేక రకాల కూరగాయలు పండించగలుగుతున్నారు. వారు తినగా మిగిలిన కూరగాయలు అమ్మి రూ. 60 వేల నుంచి రూ. 1,50,000 వరకు నికరాదాయాన్ని పొందుతున్నారు. అంతేకాదు, భూసారం పెంపుదలకు, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. ఏడాదంతా పొలాన్ని పంటలతో పచ్చగా ఉంచుతున్న పుష్పావతి, చంద్రకళ వంటి రైతులు ఏపీలో ప్రస్తుతం 110 మంది ఉన్నారు. 2021–22 సంవత్సరంలో కనీసం 1,500 మంది రైతులతో 365 రోజులూ పచ్చని పంటలు ఉండేలా ప్రకృతి వ్యవసాయం చేయిస్తాం. మున్ముందు రాష్ట్రంలో మెట్ట రైతులందరికీ ఆహార, ఆదాయ, పర్యావరణ భద్రతను కల్పించే ఈ పద్ధతిని నేర్పించాలన్నది మా లక్ష్యం. 
– టి. విజయకుమార్, ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షులు, ఏపీ రైతు సాధికార సంస్థ 
vjthallam@gmail

ఎడారిలో పంటల ఒయాసిస్సు
పి.ఎం.డి.ఎస్‌. ప్రకృతి సేద్యంలో అరెకరంలో 16 పంటలు పండిస్తున్న బండారి పుష్పావతి 
మండు వేసవిలోనూ పైరు పచ్చని నిరంతర వర్షాధార సేద్యం  
2020 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు అరెకరంలో రూ. 61,818ల నికరాదాయం
వచ్చే ఒకటి, రెండు నెలల్లో రానున్న మరో రూ. 26,800 ఆదాయం

రాయలసీమ... అందులోనూ... అనంతపురం జిల్లా... కరువుకు ఓ చిరునామా... అలాంటి జిల్లాలో నీరు చుక్క లభ్యం కాని గుండాల తాండా క్లస్టర్‌లోని ‘గుండాల’ ఓ గిరిజన గ్రామం. ఆ గ్రామంలోని కోడలు పిల్ల బండారి పుష్పావతి. ఆమె భర్త పేరు డేవిడ్‌... ఆమె చదువుకున్నది 10వ తరగతి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించిన ‘ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం’ కార్యక్రమంలో గ్రామస్ధాయి కార్యకర్తగా ఆమె గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆమె అత్త వారి తరపున లెక్కకయితే స్వంతంగా 6 ఎకరాల మెట్ట భూముంది. కానీ ఎప్పుడూ లక్ష రూపాయలకు మించి ఆదాయం చూడలేదు.. బ్రతుకు బండి సాఫీగా సాగాలంటే ఏదో రూపంలో బ్రతుకు తెరువు వెదుక్కోవలసిందే. ఇటు ఉపాధి హావిూ పనులతోపాటు పెద్ద రైతుల వద్ద కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇలాంటి పరిస్ధితులలో ప్రకృతి వ్యవసాయం మార్గదర్శనం చేసింది. ఈ విభాగం జిల్లా మేనేజర్‌గా చేస్తున్న లక్ష్మానాయక్‌ ఆమెలో ప్రేరణ కలిగించారు. ‘వర్ష రుతువు రాక ముందే పొలంలో విత్తనాలు చల్లుకొనే’ ఒక వినూత్న పద్ధతిని పరిచయం చేశారు. ఒక వైపు ఆదాయంతోపాటు మరో వైపు  వందలాది సందర్శకుల అభిమానాన్ని కూడా స్వంతం చేసుకున్నారు పుష్పావతి. 

2018లో అర ఎకరాలో దుక్కి చేసి ప్రారంభించిన పచ్చని పంటల సాగు మూడేళ్ల తర్వాత ఇప్పుడు కూడా విరామ మెరుగని దిగుబడులను అందజేస్తుంటే ఆశ్చర్యమే కదా! నేటికీ ఆ పొలంలో 16 రకాల పంటలు అప్పుడే వర్షంలో తడిసి కేరింతలు కొడుతున్న పసి పిల్లల్లా మిలమిలా మెరిసిపోతున్నాయి. వంగ, టమాట, మిరప, క్యాబేజీ, ముల్లంగి, అలసందలు, క్లస్టర్‌ బీన్స్, గోంగూర, తోటకూర, పాలకూర, కాకర, వేరుశనగ, బంతి పంటలు మరో ఒకటి, రెండు నెలలు దిగుబడులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. బహువార్షిక రకాలయిన కంది, ఆముదం అయితే ఒక సంవత్సరంలోనే మూడు దఫాలు దిగుబడులిచ్చాయి. తిండి గడవక ప్రతి ఏటా వలస పోయే ఆ కుటుంబం వలస మాటే మర్చిపోయింది. వచ్చిన దిగుబడిలో తమ కుటుంబం యావత్తూ తినగా మిగిలిన పంట అమ్మడం వలన వచ్చిన డబ్బులతో ఇతర ఖర్చులు కూడా గట్టెక్కుతున్నాయని చెబుతున్న పుష్పవతి కళ్ళల్లో ఏదో కొట్టొచ్చిన మెరుపు. ఆ ఆనందంతో మొత్తం దిగుబడులు, ఖర్చులు టకటకా చెప్పేశారు.  

ఈ అరెకరంలో పెరుగుతున్న కూరగాయ పంటల ద్వారా 2020 ఏప్రిల్‌ నుంచి జూలై వరకు వచ్చిన మొత్తం ఆదాయం రూ. 15,178. ఖర్చులు పోను నికరాదాయం రూ.10,738. అదే సంవత్సరం ఖరీఫ్‌లో మొత్తం రూ. 38,540ల దిగుబడి రాగా, ఖర్చులు పోను రూ. 32,630ల నికరాదాయం వచ్చింది. ఇంకా రబీలో ఖర్చులు పోను రూ.18,450  నికరాదాయం చేతికందింది. ఇప్పటి వరకు గత ఏడాదిలో రూ. 61,818 నికరాదాయం వచ్చింది. 

మరో రెండు నెలల్లో వంగ మీద రూ.9 వేలు, కంది మీద రూ. 3 వేలు, ఆముదం మీద రూ. 4 వేలు, క్యాబేజీ మీద మరో రూ. 4 వేలు, ముల్లంగి మీద రూ. 4 వేలు, గోరుచిక్కుడు మీద రూ. 400, టమాటా మీద రూ. 2 వేలు, బీర, గోంగూర పంటల ద్వారా రూ. 400 (మొత్తం మరో రూ. 26,800) ఆదాయం వస్తుందని పుష్పావతి ధీమాగా చెప్పారు. 


ఇంత ఆదాయం తీసుకుంటున్న ఈమె అరెకరం పి.ఎం.డి.ఎస్‌. పొలానికి నీటి వసతి లేదు. అంతా వర్షాధారమే. 4 అంగుళాల మందంలో ఆచ్ఛాదనగా వేసిన శెనక్కాయల పొట్టుతోపాటు నెలకు రెండు సార్లు 100 లీటర్లు చొప్పున ద్రవ జీవామృతాన్ని క్రమం తప్పకుండా పంటలకు పుష్పావతి అందిస్తున్నారు. అత్యవసర పరిస్ధితులలో గత మూడేళ్లలో కేవలం 5 సార్లు ట్యాంకర్లతో (బోదెలకు ఇరువైపులా వున్న నీటి కాలువల ద్వారా) పంట రక్షక తడులు అందించారు.

పుష్పావతి సేద్యం గురించి తప్పక తెలుసుకోవలసిన మరో విశేషం వుంది. వీళ్ళకున్న 6 ఎకరాల భూమిలో అరెకరంలో పి.ఎం.డి.ఎస్‌. ప్రకృతి సాగు మినహాయిస్తే మిగిలిన 5.5 ఎకరాలలో గత ఖరీఫ్‌లో ఏక పంటగా వేరుశనగ వేశారు. ఖర్చులు పోను నికరంగా మిగిలింది కేవలం రూ. 90 వేలు మాత్రమే. అంటే ఒక అరెకరంలో పి.ఎం.డి.ఎస్‌. ప్రకృతి సాగు ద్వారా తీసుకున్న నికరాదాయం 5.5 ఎకరాల్లో వచ్చిన నికరాయంతో దాదాపుగా సమానమన్నమాట. వచ్చే నెలలో మరో అరెకరాలో 365 రోజులు కొనసాగే పంటల సాకు శ్రీకారం చుడతానని చెబుతున్నారు పుష్పావతి. 

ఈమె పొలానికి ఆనుకొని వున్న పొలం రైతులకు బోరుబావి వున్నప్పటికీ గత ఖరీఫ్‌లో వేరుశనగను సాగు చేసి, రబీలో భూమిని ఖాళీగా వుంచేశారు. అయితే, పుష్పావతి పొలంలో వస్తున్న మార్పులను గమనిస్తున్నారు. ఆచ్ఛాదన చల్లదనానికి భూమిపైకి వస్తున్న వానపాములను, పంట దిగుబడులను చూసి పక్క రైతులు తాము కూడా పి.ఎం.డి.ఎస్‌. ప్రకృతి సేద్యం చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. మండు వేసవిలోనూ పచ్చని పంటలతో నేలతల్లికి రక్షణ కల్పిస్తూ.. తమ కుటుంబానికి ఆహార, ఆదాయ భద్రతను అందిస్తున్న చల్లని తల్లి పుష్పావతి (91821 75892)కి జేజేలు. 

అరెకరంలో రూ.79 వేల నికరాదాయం
లీడ్‌ ఫార్మర్‌ చంద్రకళ అనుభవం

అరెకరంలో పి.ఎం.డి.ఎస్‌. ప్రకృతి సేద్యం చేపట్టిన పరిశపోగుల చంద్రకళ దంపతులు గత ఏడాదిలో తమ కుటుంబానికి సరిపడా కూరగాయలు పండించుకోవడమే కాకుండా రూ. 79 వేల నికరాదాయాన్ని కూడా పొందారు. అనంతపురం జిల్లా పూడేరు మండలం జయపురానికి చెందిన చంద్రకళ ప్రకృతి వ్యవసాయ విస్తరణ విభాగంలో లీడ్‌ ఫార్మర్‌గా పనిచేస్తూ ఆదర్శప్రాయమైన సేద్యం చేస్తున్నారు.  తమకున్న ఎకరం డి.పట్టా మెట్ట భూమిలోని అరెకరంలో గత ఏడాది ఏప్రిల్‌లో పి.ఎం.డి.ఎస్‌. ప్రకృతి సేద్యం ప్రారంభించారు. ప్రభుత్వ సహకారంతో తీసిన బోరు బావికి ఉద్యాన శాఖ బిందు సేద్య పరికరాలను మంజూరు చేసింది. సజ్జ, జొన్న, కొర్ర, నువ్వులు, ఆవాలు, ధనియాలు, అలసందలు, పెసలు, ఆనప, చిక్కుడు, కాకర, బీర, బంతి, ఆముదం, ఉలవలు, కందులు, మినుములు (ఉద్దులు), వేరుశనగ సాగు చేస్తున్నారు. 

చివరి దుక్కిలో 150 కేజీల ఘనజీవామృతం, 500 కేజీల టైప్‌2 ఘనజీవామృతం వేసుకొని కలియదున్నారు. 4 అడుగుల వెడల్పుతో బోదెలు (మట్టి పరుపులు) వేసుకొని, ఇరువైపులా 2 అడుగుల వెడల్పున కాలువలు తీశారు. ప్రతి 4 నెలలకొకసారి రిలే పంటలు వేసిన ప్రతి సారీ 150 కేజీల చొప్పున ఘనజీవామృతం చల్లుకున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని మొక్కంతా తడిసి క్రిందకు జారేలా క్రమం తప్పకుండా పిచికారీ చేశారు.

3 ట్రాక్టర్లతో తెచ్చిన వేరుశనగ పొట్టును పొలమంతా 4 అంగుళాల ఎత్తులో సమతలంగా ఆచ్చాదనగా పరిచారు. ఈ ఆచ్ఛాదన వలన నీటి అవసరం తగ్గడంతోపాటు.. వేరుశనగ పొట్టు కొద్దికొద్దిగా కుళ్ళుతూ మొక్కలకు సారాన్ని అందించడం వలన పంటలన్నీ ఆరోగ్యంగా నిగనిగలాడుతు న్నాయి.

బీజ రక్షతో విత్తనశుద్ధి చేసి.. అలసంద, జొన్న పంటలను సరిహద్దు పంటలుగా వేసుకున్నారు. బంతి, ఆముదం పంటలను ఎర పంటలుగా నాటారు. పంటల వైవిధ్యం పాటించారు. ఒక వరుసలో 45 రకాల పంటలుండేలా జాగ్రత్త తీసుకున్నారు. వంగ తరువాత టమోటా, ఆ తరువాత మిరప, క్యాబేజీ మళ్ళీ వంగ.. ఈ విధంగా బహుళ పంటలు పొలమంతా వేశారు. దోమపోటు రాకుండా నీమాస్త్రంను, పూత రాలకుండా పుల్లటి మజ్జిగ పిచికారీ చేశారు.

రసాయన అవశేషాలు లేని ముల్లంగి దుంపల కూర తినడం వలన తన భర్తకు వచ్చిన మొలల వ్యాధి శస్త్రచికిత్స చేయకుండానే నయమయ్యిందని చంద్రకళ ఆనందంగా చెప్పారు. వచ్చే ఖరీఫ్‌లో ఆముదం, క్యాబేజీ, క్యారట్, బీట్‌రూట్‌ పంటలు వేసుకొని రాబోయే సంవత్సరం మరింత ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తానని చంద్రకళ (99637 17844) ఆశాభావంతో ఉన్నారు. 
(ఇన్‌పుట్స్‌ : డా. డి.పారినాయుడు, జట్టు ట్రస్టు)

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు